‘యూఏఈలో ఆ ఇద్దరు బౌలర్లు చెలరేగుతారు’

న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో సెప్టెంబర్–నవంబర్ విండోలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి లైన్ క్లియర్ అయింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐపీఎల్ గవర్నింగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పారు. ఈ నేపథ్యంలో తటస్థ వేదిక అయిన యూఏఈలో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని ఆర్సీబీ టీమ్‌కు మంచి విజయావకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో ఆర్సీబీ స్పిన్నర్లు పవన్ నేగి, యజ్వేంద్ర చాహల్ చెలరేగుతారని అంచనా వేశాడు.

‘ఈ పన్నెండేళ్లలో ఏం జరిగిందో అందరూ దాన్ని మర్చిపోవాలి. ఒకవేళ యూఏఈలో ఐపీఎల్ జరిగితే ఏ టీమ్‌కు కూడా ఇతోధిక లాభం చేకూరే అవకాశం లేదు. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడితే హోం సపోర్ట్‌ ఉండదు. పిచ్‌లు కూడా ఒకే తీరులో ఉండవు. ప్రతి టీమ్ ఒకేలా ప్రారంభించాలి. ముంబై, చెన్నై లాంటి టాప్ క్లాస్‌ టీమ్స్‌ మొదట్లో వెనుకపడినా అవి త్వరగా పుంజుకుంటాయి. ఆర్సీబీ లాంటి టీమ్‌కు యూఏఈలో మంచి విజయావకాశాలు ఉంటాయి. ఆ టీమ్ బౌలింగ్ బలంగా లేదు. కానీ పెద్ద గ్రౌండ్స్ ఉండే యూఏఈలో లిమిటెడ్ బౌలింగ్ ఎటాక్ ఉన్న ఆర్సీబీ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. చాహల్, పవన్ నేగి యూఏఈలో కీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది’ అని చోప్రా పేర్కొన్నాడు.

Latest Updates