కాషాయ నేతలు పెండ్లి చేసుకోరు.. రేప్‌లు చేస్తరు

  • జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో హేమంత్ సోరెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాషాయం వేసుకున్న నేతలు రాష్ట్రంలో తిరుగుతున్నారు. వాళ్లు పెళ్లి చేసుకోరు కానీ, రేప్‌లు చేస్తారు’ అని కామెంట్స్ చేశారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పాకుర్‌లో సభ నిర్వహించారు సోరెన్. ఈ సందర్భంగా ఆయన ఉన్నావ్, హైదరాబాద్ రేప్, మర్డర్ కేసుల్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘ఇటీవల కొన్ని చోట్ల మహిళల్ని రేప్ చేసి తగలబెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాషాయం కట్టుకుని వచ్చి రాష్ట్రంలో (బీజేపీ తరఫున ప్రచారానికి) తిరుగుతున్నారని నేను విన్నాను. ఆ బీజేపీ నేతలు పెళ్లి చేసుకోరు. కానీ కాషాయం కట్టుకుని మన ఆడబిడ్డల్ని రేప్‌లు చేస్తారు’ అని అన్నారు హేమంత్ సోరెన్. అలాగే మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ ఫెయిల్ అయిందని, కానీ క్రిమినల్స్‌ను మాత్రం కాపాడుతోందని ఆరోపించారాయన.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కలిసి పొత్తు పెట్టుకుని బీజేపీని ఓడించాలని పోరాడుతున్నాయి. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్‌ను ప్రకటించారు.

Latest Updates