దొంగతనానికి వెళ్లి మూడు రోజులు బావిలోనే…

దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడగా అతని నడుము విరిగిపోయింది.  ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం నడిరాత్రి ఇద్దరు దొంగలు ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లారు. అయితే…  దొంగలను గుర్తించిన ఊర్లోని వాళ్లు వారిని వెంబడించారు. ఇద్దరిలో ఒకర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే మరో దొంగ పారిపోతూ ప్రమాదవశాత్తు ఊరి చివర్లోవున్న బావిలో పడ్డాడు. దీంతో అతని నడుము విరిగిపోయింది. మూడు రోజులుగా ఆ దొంగ కదలలేని స్థితిలో బావిలోనే పడివున్నాడు.

గురువారం బావిలోంచి అరుపులు వినపడడంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లిచూశారు. దీంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో పడింది మరో దొంగ అని గుర్తించారు. అతను తీవ్రంగా గాయపడడంతో… కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతని పేరు ఆదినారాయణ అని.. విజయనగరం జిల్లా.. చీపురుపల్లి మండలం పురేయవలసకు చెందిన అతనిగా పోలీసులు తెలిపారు.

Latest Updates