హాలీవుడ్ రేంజ్ చేజ్: నగలు కొట్టేసి ట్రైన్‌లో దొంగ పరార్.. ఫ్లైట్‌లో బెంగళూరు పోలీసుల చేజింగ్

నగలు కొట్టేసి పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి పోలీసులు హెలికాప్టర్‌లో చేజింగ్ చేయడం లాంటి సీన్లు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ రియల్‌గా జరిగింది. అది ఏ విదేశాల్లోనో కాదు.. మన దేశంలోనే!! కోటి 30 లక్షల రూపాయల విలువైన బంగారం, వజ్రాల నగలు కొట్టేసి పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి బెంగళూరు పోలీసులు ఈ రకమైన చేజింగ్ చేశారు. రైలులో కోల్‌కతాకు పరారవుతున్న దొంగ మిస్ అయితే దొరకడని ఫ్లైట్‌లో ముందుగానే అక్కడికి చేరుకుని మాటు వేసి మరీ అరెస్టు చేశారు.

బెంగళూరులోని జేపీ నగర్‌లో నివసించే బిల్డర్ రాజేశ్ బాబు ఇంట్లో పశ్చిమ బెంగాల్‌లోని బుర్దావన్‌కు చెందిన కైలాస్ దాస్ పని మనిషిగా ఉండేవాడు. ఆరేళ్ల నుంచి నమ్మకంగా ఉంటూ పని చేసుకుంటున్న దాస్‌కు రాజేశ్ ఇంటి సెల్లార్‌లో రూమ్‌ కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం రాజేశ్ కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్చించారు. రాజేశ్ ఫ్యామిలీ అంతా ఆ హడావిడిలో ఉండగా దాస్‌కు ఆ ఇంట్లో ఉండే బంగారు, వజ్రాల నగలపై కన్నుపడింది. అక్టోబర్ 9న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోటి 30 లక్షల రూపాయల విలువ చేసే నగలు ఉండే ఎలక్ట్రానిక్ లాకర్‌ను తీసుకుని పరారయ్యాడు. బెంగళూరు నుంచి మైసూర్ పారిపోయి అక్కడ స్క్రూ డ్రైవర్‌తో లాకర్‌ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సొంతూరికి వెళ్లిపోయి అక్కడ ఏదొకటి చేయొచ్చని ఫిక్స్ అయ్యాడు.

ఇక మళ్లీ బెంగళూరు వచ్చి రెండ్రోజుల క్రితం యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్లే ట్రైన్ ఎక్కాడు దాస్. అయితే ఆ ముందు రోజే రాజేశ్ బాబు కుటుంబం లాకర్ మిస్ అయిన విషయం చూసుకోవడంతో వాళ్లు జేపీ నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ తెప్పించుకుని పరిశీలించారు. సరిగ్గా అతడు ట్రైన్ ఎక్కిన కొన్ని గంటల తర్వాతే పోలీసులు రైల్వే స్టేషన్ ఫుటేజీ చూడడంతో దొంగ రైలు ఎక్కిన విషయం పసిగట్టగలిగారు. దీంతో అతడు చివరి స్టేషన్ చేరుకుని ట్రైన్ దిగి సిటీలోకి వెళ్లాడంటే మళ్లీ పట్టుకోవడం కష్టం అవుతుందని పోలీసులు భావించారు. దీంతో అక్కడికి చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్తే దాస్‌ను పట్టుకోవడం కుదరదని విమానంలో కోల్‌కతాకు వెళ్లారు. రైలు హౌరా స్టేషన్ చేరుకోగానే దొంగ ప్లాట్‌ఫామ్‌పై దిగడాన్ని పోలీసులు పసిగట్టారు. అయితే పోలీసులు తన కోసమే వచ్చారని అర్థం చేసుకున్న దాస్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు చుట్టుముట్టి అతడని అరెస్టు చేశారు. నగలు ఉన్న లాకర్‌తో పాటు అతడిని బెంగళూరుకు తీసుకుని వచ్చామని పోలీసులు తెలిపారు.

Latest Updates