పట్టపగలే దొంగతనానికి యత్నం.. చితకబాదిన స్థానికులు

నగర శివారులో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ ఇంట్లో దూరి దొంగతనానికి యత్నించారు. స్థానికులు అప్రమత్తమై వారిని పట్టుకోవడంతో భారీ చోరీ తప్పింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో  కిస్మత్ పూర్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న బంగారాన్ని దోపిడీ చేశారు. ఆ ఇంట్లోని మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నంలో ఆమె గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వారు అక్కడికి వచ్చి వారికి దేహశుద్ది చేశారు. దొంగలను ఒక గదిలో బంధించి స్థానికి పోలీస్ స్టేషన్ కు సమాచారమందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం ఐదుగురు దొంగలను అదుపులో తీసుకున్నారు. వారందర్ని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.