లాక్ డౌన్ ముగిశాక‌.. వెంట‌నే చేయ‌కూడ‌ని ప‌నులివే

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నెల రోజులు దాటిపోయింది. తొలుత మార్చి 24న ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ విధిస్తూ ప్ర‌క‌టన చేసిన ప్ర‌ధాని మోడీ.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మే 3 వ‌ర‌కు పొడిగించారు. ప్ర‌జ‌లంతా అత్య‌వ‌స‌ర‌మైతే ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండాల‌ని కోరారు. ప్ర‌యాణాల‌ను నిలిపేసి.. అన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌ను, కంపెనీల‌ను క్లోజ్ చేశారు. ఈ ఆంక్ష‌ల‌కు ప్ర‌జ‌లు చాలా వ‌ర‌కు స‌హ‌క‌రించ‌డంతో సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి. కొన్ని ప్రాంతాల్లో క‌రోనా కంట్రోల్ లోకి వ‌చ్చింది. దీంతో గ్రీన్ జోన్ల‌లో ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ వ‌స్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తిస్తోంది. అయితే ఇప్పుడే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే అవ‌కాశాలు మాత్రం లేవ‌ని తెలుస్తోంది. అయితే భ‌విష్య‌త్తులో లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత‌, లేదా ఆంక్ష‌లు స‌డ‌లించిన స‌మ‌యంలో కొన్ని పొర‌బాట్లు చేయ‌కుండా ఉండ‌గ‌లిగితే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన నుంచి మ‌న‌ల్ని కాపాడుకోగ‌లుగుతాం.

సోష‌ల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ బ్రేక్ చేయ‌కూడ‌దు

క‌రోనా వైర‌స్ దానంత‌ట‌దే వ్యాపించ‌లేదు. ఈ వైర‌స్ సోకిన వారిని మ‌నం తాకితేనో లేదా వారు తుమ్మినప్పుడు, ద‌గ్గిన‌ప్పుడు తుంప‌ర్లు ప‌డితేనో త‌ప్ప మ‌రొక‌రికి అంటుకోదు. దీన్ని అడ్డుకోవాలంటే సోష‌ల్ డిస్టెన్ ప‌క్కాగా పాటించ‌డ‌మే ఉత్త‌మ మార్గం. లాక్ డౌన్ రిస్ట్రిక్ష‌న్ ఎత్తేసినా… ఒక‌రినుంచి మ‌రొక‌రు క‌నీసం రెండు మీట‌ర్ల వ‌ర‌కు దూరం పాటించ‌డం మంచిది.

బ‌య‌టి ఫుడ్స్ తిన‌క‌పోవ‌డం బెట‌ర్

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకుంటే క‌రోనా నుంచి ర‌క్షించుకోవ‌చ్చు. ఒక‌వేళ వైర‌స్ బారిన‌ప‌డినా సుల‌భంగా కోలుకోవ‌చ్చు. ఇమ్యూనిటీ పెంచుకోవ‌డానికి హెల్తీ లైఫ్ స్టైల్, మంచి డైట్ ఫాలో అవ్వ‌డం అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బ‌య‌టి ఆహారం, జంక్ ఫుడ్స్ లాంటి తిన‌క‌పోవ‌డం మేలు. ప్రూట్స్, కూర‌గాయ‌లు వంటివి తీసుకోవ‌డం మంచిది.

శుభ్ర‌త పాటించ‌కుంటే క‌ష్ట‌మే

ప‌రిస‌రాల శుభ్ర‌త, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించ‌డం చాలా ముఖ్యం. త‌ర‌చూ స‌బ్బు లేదా ఆల్క‌హాల్ బేస్డ్ హ్యండ్ శానిటైజ‌ర్ తో చేతులు క‌డుక్కోవ‌డం మ‌ర్చిపోకూడ‌దు. ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లివ‌చ్చిన త‌ర్వాత స్నానం చేస్తే ఇంకా మేలు. తుమ్మేట‌ప్పుడు, ద‌గ్గేట‌ప్పుడు క‌ర్చీఫ్ లేదా టిష్యూ అడ్డుపెట్టుకోవాలి. బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ ధ‌రించ‌డం మ‌ర్చిపోకూడ‌దు.

ప్ర‌యాణాలు ప్లాన్ చేయొద్దు..

ఇప్ప‌టికిప్పుడు బ‌స్సులు, ట్రైన్ స‌ర్వీసులు ప్రారంభమ‌య్యే అవ‌కాశాలు లేవు. అయితే జిల్లాల ప‌రిధిలో తిరిగేందుకు అనుమతిస్తార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వీలు దొరికింది కదా అని అన‌స‌వ‌రంగా అటూ ఇటూ చుట్టాల ఇంటి, ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర‌కు ప్ర‌యాణాల‌ను ప్లాన్ చేయ‌డం మంచిది కాదు. ఎటువంటి ల‌క్ష‌ణాలు లేకున్నా క‌రోనా పాజిటివ్ వస్తున్న‌ కేసులు ఎక్కువ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అవ‌స‌రం లేకుంటే ఎక్క‌డి వారు అక్క‌డే ఇళ్ల‌లో ఉండ‌డం మంచిది. ఫ్రెండ్స్ అంతా ఒక చోట చేరి పార్టీలు చేసుకోవ‌డం లాంటివి కొన్నాళ్లు బంద్ పెట్ట‌డం మేలు. షాపింగ్ మాల్స్, మార్కెట్స్ ఓపెన్ చేస్తే అమాంతం వెళ్లిపోవ‌డం మ‌ళ్లీ వైర‌స్ విజృంభ‌ణ‌కు దారితీయొచ్చు.

మాస్కుల విష‌యంలో జాగ్ర‌త్త‌

మాస్కులు వాడే విష‌యంలోనూ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ వేసుకోవ‌డం మ‌ర్చిపోకూడ‌దు. మాస్కు వేసుకున్న‌ప్పుడు దాన్ని ప‌దే ప‌దే తాక‌‌కుండా ఉండాలి. వాడిన త‌ర్వాత మాస్కును ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డేయ‌కూడ‌దు. జాగ్ర‌త్త‌గా డ‌స్ట్ బిన్ లో ప‌డేయాలి.

Latest Updates