రూ.100 కోట్లకు చేరుకున్నతిరుమల శ్రీ వాణి ట్రస్ట్

దేశంలోని ఆలయాల పునర్నిర్మాణం, భద్రతకు ఈ నిధులు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… టీటీడీ సహాయ సహకారాలతో ప్రారంభించిన శ్రీ వాణి ట్రస్ట్ భక్తుల మన్ననలు పొందుతోంది. పథకం ప్రారంభించిన ఏడాది పూర్తయిన కొద్ది రోజులకే వందకోట్ల మూల నిధుల సమీకరించింది. దేశంలోని ఆలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధారణ అవసరమైన చోట్ల నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ ను 2019 నవంబర్ 4న ప్రారంభించారు.  ఈ పథకం ద్వారా 10 వేలు విరాళమిచ్చిన భక్తులకు విఐపి బ్రేక్ సమయంలో తీర్థం, దర్శనం లభిస్తుంది. ఈ కారణంగా పథకం ఆదరణ అనూహ్య ఆదరణ అందుకుంటోంది. మొన్న జనవరి 1 నాటికి మూల నిధి వందకోట్ల రూపాయల దాటిందని టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా  ఒక రోజు మాత్రమే  తెరిచి ఉంచే పవిత్ర ఉత్తర ద్వారాన్ని పది రోజులు పాటు తెరిచి ఉంచడం వల్ల భక్తులు శ్రీ వాణి ట్రస్ట్ ను ఎంపిక చేసుకుంటున్నారు. రోజుకు వెయ్యి మందికి పైగా ఈ పథకం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉండే ఆలయాల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం… టిటిడి ఈ స్కీమును ప్రారంభించింది. నూతన ఆలయాల నిర్మాణం, నిర్వహణ, అమరావతి ఆలయ నిర్మాణ బాధ్యతలతో పాటు దేశంలోని  ఏ ప్రాంతంలో అయినా  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం కోసం కూడా ఈ నిధులను వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అంతేగాక పలు సౌకర్యాల కల్పన పూజలు, హోమాలు యజ్ఞ యాగాదుల, పండుగల నిర్వహణ కోసం ఈ నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించారు. భారతీయ సంస్కృతి, చరిత్రను, సాంప్రదాయాలు ప్రతిబంబించే పురాతన భవనాలు, గోపురాలు సంరక్షణ, నిర్వహణ తోపాటు వాటి రక్షణకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయాలని ట్రస్ట్ ఏర్పాటు చట్టంలో పొందుపరిచారు.

 

Latest Updates