ఇది జస్ట్ ట్రైలర్.. అసలు సినిమా ముందుంది

రాంచీఅవినీతి, టెర్రరిజాన్ని అంతం చేయడంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్ని విజయవంతంగా కొనసాగించడం దగ్గర్నుంచి ట్రిపుల్​ తలాక్​ రద్దు, జమ్మూకాశ్మీర్​ విభజన లాంటి కీలక నిర్ణయాలెన్నో తీసుకున్నామన్నారు. రెండో టర్మ్​ 100 రోజుల పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని, రాబోయే రోజుల్లో దేశంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని ప్రధాని చెప్పారు. జార్ఖండ్​ రాజధాని రాంచీలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతిపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నందుకే అక్రమార్కులు జైలుపాలవుతున్నారని, ఇంకొంత మంది బెయిల్​పై బతుకుతున్నారని పరోక్షంగా కాంగ్రెస్​ నేతలపై మోడీ విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్న ప్రధాని.. ఇదేవేదికపైనుంచి పలు పథకాల్ని ప్రారంభించారు. దేశంలో 60 ఏండ్లు నిండిన ప్రతి రైతులకు నెలనెలా రూ.3వేలు అందించే ‘‘ప్రధానమంత్రి కిసాన్​ మాన్​ ధన్​ యోజన’’, 60 ఏండ్లు నిండిన షాప్​ కీపర్లు, రిటైల్​ దుకాణం దారులకు నెలకు మూడు వేలు అందించే ‘‘ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్​ ధన్​ యోజన’’, సెల్ఫ్ ​ఎంప్లాయిమెంట్ పొందుతోన్న యువకుల కోసం రూపొందించిన ‘‘స్వరోజ్​గార్​ పెన్షన్​ స్కీం”లబ్ధిదారులకు మోడీ సర్టిఫికేట్లు అందజేశారు.

19ఏండ్లకు సొంత అసెంబ్లీ.. అదీ పేపర్​లెస్

బీహార్ నుంచి విడిపోయిన 19 ఏండ్ల తర్వాత జార్ఖండ్ సొంతగా అసెంబ్లీ బిల్డింగ్ ఏర్పాటుచేసుకుంది. దేశంలోనే తొలి పేపర్​లెస్​ అసెంబ్లీగా రికార్డులకెక్కిన ఈ బిల్డింగ్​ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇన్నాళ్లూ రాంచీ సిటీలోని ఇండస్ట్రియల్​ ఏరియాలోని లెనిన్​ హాలునే అసెంబ్లీగా వాడుకున్నారు. సిటీ శివారులోని కుంటేగ్రామ్​లో 39 ఎకరాల సువిశాల స్థలంలో రూ.465 కోట్లతో కొత్త అసెంబ్లీని నిర్మించారు. ఈ బిల్డింగ్​కు 40 శాతం సోలార్​  కరెంటే. కొత్త బిల్డింగ్​ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం అసెంబ్లీ ఒకరోజుపాటు సమావేశం కానుంది. 81 స్థానాలున్న జార్ఖండ్​ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయి. కొత్త అసెంబ్లీతోపాటు సాహిబ్​గంజ్​ వద్ద నిర్మించిన కార్గో టెర్మినల్​ను కూడా మోడీ ప్రారంభించారు. గంగానదిలో జలరవాణా కోసం నిర్మించిన రెండో పెద్ద టెర్మినల్​ ఇది. మొదటిది టెర్మినల్​ను వారణాసిలో నిర్మించారు.

 

 

Latest Updates