అయోధ్య రామ మందిరం మోడల్ ఇదే

చిన్న చిన్న మార్పు లు చేస్తం

న్యూఢిల్లీ, లక్నో, గ్వాలియర్: రాముడి గుడి కోసం విశ్వహిందూ పరిషత్(వీహెచ్​పీ) సిద్ధం చేసిన మోడల్​కు కొన్ని మార్పులు చేయాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. ఈ మోడల్​ ప్రకారం కాకుండా గుడి ఎత్తును ఇంకాస్త పెంచనుంది. మోడల్​లో గుడి ఎత్తు 125 ఫీట్లుగా పేర్కొనగా.. దీనిని 160 ఫీట్లకు పెంచాలని, అదనంగా మూడో ఫ్లోర్​ను కూడా కట్టాలని ట్రస్టు నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం ట్రస్టు సభ్యులు చంపత్​ రాయ్, విమలేంద్ర మోహన్​ ప్రతాప్​ మిశ్రా, అనిల్​ మిశ్రాలు కన్​స్ట్రక్షన్ కమిటీ హెడ్​ నృపేంద్ర మిశ్రాను కలుసుకున్నారు. టెంపుల్​ నిర్మాణ ప్రతిపాదనలపై ఈ సందర్భంగా చర్చించారు. టెంపుల్​ మోడల్​ను ఫైనల్​ చేయడానికి ముందు ఎక్స్​పర్ట్స్​తో చర్చించనున్నట్లు నృపేంద్ర మిశ్రా చెప్పారని ట్రస్టు సభ్యుడు ఒకరు వెల్లడించారు. నిపుణులతో పాటు వివిధ గ్రూపులను సంప్రదించి, అందరికీ ఆమోదయోగ్యమైన మోడల్​ను ఎంపిక చేస్తామని, నిర్మాణ పనులు అన్నింటికీ సంబంధించి ప్లానింగ్​ సిద్ధం చేస్తామని చెప్పారు. నిర్మాణ పనులు ఆరునెలల్లో మొదలుపెడతామని ట్రస్టు ప్రెసిడెంట్​ నృత్య గోపాల్​ దాస్​ చెప్పారు.

మోడల్​ అదే.. చిన్న మార్పులు

రామ జన్మభూమిలో గుడి కట్టేందుకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్​పీ) ముప్పై ఏళ్ల క్రితమే నమూనా సిద్ధం చేసింది. పలు సందర్భాలలో ఈ మోడల్​ను వివిధ వేదికలపై ప్రదర్శించింది. ఎప్పటికైనా ఈ మోడల్​ ప్రకారమే గుడి నిర్మాణం జరుగుతుందని చెబుతూ వస్తోంది. టెంపుల్​ ట్రస్ట్​ ఏర్పాటయ్యాక కూడా ఈ మోడల్​లోనే గుడి కడతారని ఆశిస్తున్నట్లు వీహెచ్​పీ పేర్కొంది. ఇదే విషయాన్ని ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్​ దేవ్​ గిరి కూడా స్పష్టంచేశారు. వీహెచ్​పీ మోడల్​ ప్రకారమే గుడి నిర్మాణం జరుగుతుందని, అయితే, కొన్ని మార్పులు చేయాలని ట్రస్టు నిర్ణయించిందని చెప్పారు.

గుడి నిర్మాణంలో గొడవలొద్దు: మోడీ

రామ మందిర నిర్మాణ పనులు శాంతియుతంగా, ఎలాంటి గొడవలు లేకుండా జరగాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్​ సెక్రెటరీ చంపత్​ రాయ్​ వివరించారు. ఈమేరకు శుక్రవారం ట్రస్ట్​ ప్రెసిడెంట్​నృత్య గోపాల్​ దాస్, ముగ్గురు సభ్యులు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. రామ మందిరం భూమి పూజకు రావాలని మోడీని ఆహ్వానించారు.
నిర్మాణ పనులపై చర్చిస్తూ.. పనులను శాంతియుతంగా జరిపించాలని ప్రధాని సూచించినట్లు ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..: ప్రహ్లాద్​ పటేల్

అయోధ్యలో కట్టబోయే రామ మందిరం ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ అన్నారు. టూరిస్టులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్​మెంట్​కు తోడ్పడుతుందని చెప్పారు. గుడి నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసేందుకు కేంద్రంతో పాటు యూపీ సర్కారు కూడా కట్టుబడి ఉందన్నారు. 5 ట్రిలియన్​ అమెరికన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడానికి టూరిస్ట్  గైడ్స్​లకు ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

ఆల్టర్నేటివ్​ ప్లేస్ ​మాకు ఓకే: వక్ఫ్​బోర్డు

‘వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని మొదటి నుంచీ చెబుతున్నం.. తీర్పు ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ఐదెకరాల ల్యాండ్​ను వద్దనే చాయిస్​ మాకు లేదు’ అని యూపీ సున్నీ సెంట్రల్​ వక్ఫ్ బోర్డ్​ సభ్యుడు ఫరూఖీ చెప్పారు. ఆల్టర్నేటివ్​ ల్యాండ్​ను వద్దనడం కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చే ఆ ల్యాండ్​ను ఎలా ఉపయోగించాలనే విషయంలో బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంపై సోమవారం జరిగే బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఫరూఖీ తెలిపారు.

Latest Updates