ఈ స్కూల్​ బామ్మలకి మాత్రమే

చకచకా స్కూల్​ బ్యాగ్ భుజానికి  వేసుకున్నాడు. బ్లూ యూనిఫామ్​లో టిప్​ టాప్​గా రెడీ అయ్యి ​ తొంభై  ఏళ్ల బామ్మ చెయ్యి పట్టుకుని నడక మొదలుపెట్టాడు.  సరిగ్గా స్కూల్​ గేటు దగ్గరకొచ్చేసరికి  బామ్మ  చేతికి బ్యాగ్​ ఇచ్చాడు. ‘క్లాస్​ టైం అవుతోంది’ అంటూ బామ్మని మందలించి మరీ స్కూల్​కి పంపాడు మనవడు. ఏంటి సీన్​ రివర్స్​ అయింది? అనుకుంటున్నారా! మహారాష్ట్రలోని ‘థానే’లో ఇలాంటి సీన్స్​ రోజుకి వందల్లో కనిపిస్తాయి. ఆ ఊరి స్పెషాలిటీయే అది మరి. వృద్ధుల కోసమే ‘ఆజిబాయిచిశాల’ పేరుతో స్కూల్​ నడుపుతున్నారు ఇక్కడ.

ఈ జనరేషన్​లో​ ఆడవాళ్ల చదువు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, ఓ డెబ్బై, ఎనభై ఏళ్ల క్రితం అదో వింతే. కేవలం సమాజం నుంచే కాదు ఇంట్లోనూ వ్యతిరేకత మొదలయ్యేది ఆడపిల్లల  చదువు విషయంలో. ఆడవాళ్లు వంటింటికే పరిమితం అనే మాటలు పదేపదే చెవినపడుతుండేవి. దాంతో చదువుకోవాలన్న  కోరిక ఉన్నా  మౌనంగా ఉండిపోయేవాళ్లు చాలామంది ఆడవాళ్లు.  అలా చదువుకి దూరమైన వాళ్లందరినీ ఒకచోట చేర్చి పాఠాలు చెప్తున్నారు ఆజిబాయిచిశాలలో. యోగేంద్ర బంగర్ అనే స్కూల్​ ​మాష్టారు​ 2016లో ఈ స్కూల్​ని స్టార్ట్​ చేశాడు..

రూపు రేఖలు మార్చేశాడు

చిన్నప్పట్నించి గవర్నమెంట్​ స్కూల్స్​లో  చదువుకోవడం వల్ల ఆ సిస్టమ్​లోని లోపాలన్నింటినీ సరిదిద్దాలనుకున్నాడు యోగేంద్ర. అందుకోసం కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్​గా ఉద్యోగం సాధించాడు. ప్రైమరీ స్కూల్​ టీచర్​గా  ‘థానే’ ఊళ్లోని జిల్లా పరిషత్​ స్కూల్​లో జాయిన్​ అయ్యాడు. ఫస్ట్​ డే నుంచి గవర్నమెంట్​ స్కూల్​ గ్రాఫ్​ని పెంచే ప్రయత్నాలు చేశాడు. ఊరూవాడా తిరిగి పిల్లల్ని తీసుకొచ్చి పాఠాలు చెప్పాడు. కేవలం పిల్లలకే కాదు పెద్దలకి కూడా గవర్నమెంట్​ స్కీమ్స్​ , ఊళ్లోని వసతులపై అవగాహన కల్పించాడు. వర్షపు నీళ్లతో  హార్వెస్టింగ్, సివిక్​ వాటర్​ పైప్​లైన్​ లాంటి వాటితో ఊరి రూపురేఖలు మార్చి ​ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కేవలం వృద్ధులకోసమే స్కూల్​ ఓపెన్​ చేశాడు.

వెనకడుగేశారు

పెద్దవాళ్లకి పాఠాలు చెప్పడానికి శీతల్​ అనే మహిళను టీచర్​గా అపాయింట్​ చేశాడు. అన్నీ పర్ఫెక్ట్​గా సెట్​ చేశాక  వచ్చేందుకు వృద్ధులు మొదట వెనకడుగేశారు. మనసులో చదువుకోవాలన్న  కోరిక ఉన్నా  ఈ వయసులో చదువంటే ఎగతాళి చేస్తారేమో!  అనే అనుమానాలతో క్లాస్​కి రావడానికి ఇష్టపడలేదు. అయినా సరే అధైర్యపడకుండా అందరికీ నచ్చజెప్పాడు మాష్టారు​. డోలు చప్పుళ్లతో ఊళ్లోని వృద్ధులందరినీ  స్కూల్లోకి ఆహ్వానించాడు.  అంతేకాదు వాళ్లకి పింక్​ కలర్​ చీరని యూనిఫామ్​గా డిజైన్​ చేయించాడు

అరవై ఏళ్లు దాటాలి..

ఈ గ్రాండ్​ మదర్స్​ స్కూల్​ మిగతా స్కూల్స్​కి  పూర్తి కాంట్రాస్ట్​లో ఉంటుంది. ఇక్కడ చదువుని ఆటపాటల రూపంలోనే చెప్తారు. అంతేకాదు గ్రేడ్స్​, ఎగ్జామ్స్​ లాంటివేం ఉండవు. అరవై సంవత్సరాలు పైబడిన వాళ్లు ఎవరైనా ఈ స్కూల్​లో అడ్మిషన్​ తీసుకోవచ్చు. అది కూడా పైసా కట్టకుండా.

ఎలా మొదలైంది

2016లో ఫిబ్రవరి 19,  ఛత్రపతి శివాజీ మహారాజ వర్ధంతి సందర్భంగా  ఊళ్లోని జనాలందరూ ఒక చోట చేర్చాడు యోగేంద్ర​. ఛత్రపతి శివాజీకి సంబంధించిన బుక్స్​ చదువుతూ ఊళ్లోని వాళ్లంతా సంబరాలు జరుపుకున్నారు ఆరోజు. కానీ, ఊళ్లోని  కొందరు వృద్ధులు మాత్రం ‘‘మాకు చదవడం రాదు.చదువుకొని ఉంటే అందరిలాగే మేమూ పుస్తకాలు పట్టుకునే వాళ్లం. ఇలా  ఓ మూలన కూర్చొని వాళ్ల మాటల్ని వినేవాళ్లం కాదు’’అంటూ తన మనసులోని మాటల్ని యోగేందర్​కు చెప్పారు​ ఆరోజు. ఆ మరుక్షణమే వాళ్లకి చదువుకోవడానికి ఓ అవకాశం కల్పించాలని ఫిక్స్​ అయ్యాడు స్కూల్​ మాష్టారు​. ఆ విషయాన్ని ఊళ్లోవాళ్లకి చెప్పడంతో  ‘ఫ్రీగా పాఠాలు చెప్పుకోండి’ అంటూ కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఇళ్లని ఇచ్చారు. వాళ్లందరి ప్రోత్సాహంతో అదే సంవత్సరం మా ర్చి 8న ఇంటర్నేషనల్​  విమెన్స్​ డే రోజు ఆజిబాయిచి శాల స్కూల్​ని స్టార్ట్​ చేశాడు..

ఓర్పు కావాలి

పదేళ్ల పిల్లలకి ఏదైనా కొత్త విషయం చెప్తే టక్కున పట్టేస్తారు. కానీ, వృద్ధులకి ఒకటికి పదిసార్లు  ఓపికగా వివరించాలి. అంతేకాదు మా స్టూడెంట్స్​లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్​ ఉన్నవాళ్లున్నారు. కొందరికి వినికిడి సమస్యలున్నాయి. మరికొందరి చేతులు బలపం పట్టుకోవడానికి కూడా సహకరించవు. చేతులు వణుకుతాయి. అలాంటి వాళ్లకి చదువు చెప్పడం ఓ ఛాలెంజ్​ అంటోంది ఈ స్కూల్​ టీచర్​ ​ శీతల్​.

 

Latest Updates