ఈ ట్రాకర్ కరోనా అనుమానితులు, పేషెంట్స్ ఎక్కడున్నాకనిపెట్టేస్తది

కరోనా భయంతో … ‘‘మా ప్రపంచం మాదే’’ అని చుట్టూ గిరిగీసుకుని బతుకుతున్న కాలం ఇది. ఇలాంటి టైంలో  స్వార్థాన్ని పక్కనపెట్టి వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు హైదరాబాద్​కి చెందిన అషార్​ అహ్మద్​ షేక్​. రోజు రోజుకి పెరుగుతోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం  బిగించాడు. స్నేహితులతో కలిసి రెండు రోజుల్లోనే  కరోనా అనుమానితులు, పేషెంట్స్​ కదలికల్ని గమనించడానికి ఒక  ట్రాకర్​ కనిపెట్టాడు. క్వారంటైన్ సెంటర్స్​, ఐసోలేషన్​ వార్డ్స్​లో ఈ ట్రాకర్​ని ఫిక్స్​ చేసి  కరోనా బాధితుల్ని ఎక్కడున్నా గుర్తించే వెసులుబాటు కల్పించాడు. అది  కూడా అతి తక్కువ ధరలోనే.. అసలు ఈ ట్రాకర్​ వెనకున్న కథతో పాటు ..  ఎలా పనిచేస్తుందో  ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్​  మాటల్లోనే.

‘‘నాకు చిన్నప్పట్నించీ ప్రయోగాలంటే చాలా  ఇష్టం. ఏదైనా మెషిన్​ లేదా, వెరైటీ వస్తువు కనబడితే చాలు నిమిషాల్లో  పోస్ట్‌‌మార్టం​​  చేసి  పార్ట్స్​ బయటకు తీసేవాడ్ని.  అసలు ఆ వస్తువు అలానే ఎందుకు ఉంది? ఎలా పనిచేస్తుంది? అని గంటలు గంటలు ఆలోచించేవాడ్ని.  రిమోట్​ కార్ల బ్యాటరీలు పీకి ఏవేవో ఎక్స్​పరిమెంట్స్​ చేస్తుండేవాడ్ని. ‘చిన్నప్పుడు పిల్లలంతా ఇలానే ఉంటారు. పెద్దయితే ఆసక్తి తగ్గుతుంద’నుకునే వాళ్లట ఇంట్లోవాళ్లు.  కానీ, నా ఇంట్రెస్ట్ పెద్దయ్యే కొద్దీ పెరుగుతూ వచ్చింది. దాంతో నా ఇష్టానికి అనుగుణంగానే  కెరీర్​ ఉండాలని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్​ చదివేందుకు ఎస్​ఎంఆర్​లో చేరా.

ఐడియా తట్టింది

ఆ కాలేజీలో చిన్నప్పట్నుంచి నాకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. నాకున్న థియరెటికల్ నాలెడ్జ్​కి  ప్రాక్టికల్​గా ఇంప్లిమెంట్  చేసే అవకాశం వచ్చింది. ‘నువ్వు చెయ్యగలవ్’​ అంటూ ముందుకు నడిపించే లెక్చరర్స్​  కూడా దొరికారు. వాళ్లందరి సపోర్ట్​తో ఫ్రెండ్స్​తో కలిసి ఎలక్ట్రిక్​ కారుని తయారు చేశా. అది సక్సెస్​ కావడంతో  మంచి గుర్తింపు వచ్చింది. పెద్దపెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్​ వచ్చాయి. కానీ, సొంతంగా బిజినెస్​ చేయాలనే ఆలోచనతో హైదరాబాద్​లో  పెట్రోల్, డీజిల్​ కార్లని ఎలక్ట్రిక్​గా మార్చేందుకు ‘భరత్​భూమి’ అనే స్టార్టప్​ని స్నేహితులతో కలిసి మొదలుపెట్టా. కానీ, లాక్​డౌన్ ​వల్ల మా పనికి  బ్రేక్​ పడింది. దాంతో ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆ టైంలోనే ఈ ట్రాకర్​ ఐడియా తట్టింది.

అలా మొదలైంది

లాక్​డౌన్​లో మొదటి రెండురోజులు ఆడుతూ పాడుతూ గడిపినా.. రానురాను బోర్​ మొదలైంది. క్వారంటైన్​, ఐసోలేషన్​ వార్డుల నుంచి అనుమానితులు, పేషెంట్స్​ తప్పించుకుంటున్నారన్న వార్తలు తరచూ చెవిన పడ్డాయి. దాంతో వాళ్లెందుకు అలా చేస్తున్నారన్న ఆలోచనలో పడ్డా.. మా ఫ్యామిలీ కౌన్సిలర్​ని ఫోన్లో కాంటాక్ట్ చేశా. వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఆయన్ని అడిగి తెలుసుకున్నా. అనుమానితులు, పేషెంట్స్​ పారిపోతే సమాజానికే ముప్పనిపించింది. దాంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు నా మెదడుకి పని చెప్పి ఇంట్లో అందుబాటులో ఉన్న బ్యాటరీలు, రిమోట్లు, వైర్లతో ఓ ట్రాకర్​ రెడీ  చేయాలనుకున్నా. నా ఆలోచనలకి ఫ్రెండ్స్​ అక్బర్​ బేగ్​, వంశీ కృష్ణ  తోడయ్యారు. ముగ్గురం కలిసి రెండ్రోజుల్లోనే  పేషెంట్ మానిటరింగ్ అండ్​ ట్రాకింగ్ డివైస్​ రెడీ చేశాం.

ఇలా పనిచేస్తుంది

ఈ ట్రాకర్​లో మాస్టర్​ అండ్ స్లేవ్​ అని రెండు డివైస్​లు ఉంటాయి.  మాస్టర్​ డివైస్​లో   కమ్యూనికేషన్​  కోసం బ్లూటూత్ మాడ్యూల్, ఎస్సెమ్మెస్​ అలర్ట్​ కోసం జిఎస్ఎమ్​ మాడ్యూల్, ఈ ఆపరేషన్​ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి  మైక్రో కంట్రోలర్​ ఉంటాయి. అలాగే స్లేవ్​ డివైస్​లో కూడా కమ్యూనికేషన్​ కోసం బ్లూటూత్  మాడ్యూల్, పేషెంట్ లైవ్​ ట్రాకింగ్ కోసం జిపిఎస్  మాడ్యూల్, మొత్తం ఆపరేషన్​ని కంట్రోల్ చేయడానికి మైక్రోకంట్రోలర్​ ఉంటాయి. స్లేవ్ డివైస్​ని క్వారంటైన్​, ఐసోలేషన్​లో ఉన్న బాధితుల చేతికి బ్యాండ్​లా ఫిక్స్​ చేస్తాం. మాస్టర్​ డివైస్​ని క్వారంటైన్, ఐసోలేషన్​ వార్డుల్లో గోడలకి ఫిక్స్​ చేస్తాం. స్లేవ్ అండ్ మాస్టర్​ డివైస్​లు ​ఒకదానితో ఒకటి కనెక్ట్  అయి ఉంటాయి. ఒకవేళ  బాధితులు ఆ రూం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే  మాస్టర్​ అండ్ స్లేవ్ డివైస్​కి మధ్య కనెక్షన్​ కట్ అవుతుంది. దాంతో వెంటనే మాస్టర్​ డివైస్​ సిబ్బందికి మెసేజ్​ పంపుతుంది. క్వారంటైన్​, ఐసోలేషన్​ సెంటర్స్​లో ఎమర్జెన్సీ లైట్స్​ కూడా వెలుగుతాయి. అలా అనుమానితులు లేదా పేషెంట్స్​ని పట్టుకోవడం తేలికవుతుంది.

ఖర్చు తక్కువే

ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈ ప్రయోగం చేశాం. చిన్నాచితకా ఖర్చులు లెక్కపెడితే  ట్రాకర్​ పూర్తయ్యే సరికి  రెండువేలు అయ్యింది. తక్కువ పెట్టుబడితే ఈ ట్రాకర్​ని రెడీ చేశాం. కస్టమర్ల నుంచి కూడా  మేం పెట్టిన ఖర్చునే ఎక్స్​పెక్ట్ చేస్తున్నాం. రెండువేల రూపాయలకి మార్కెట్​లోకి అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం లోకల్ మెడికల్ డిపార్ట్​మెంట్స్​తో చర్చలు జరుపుతున్నాం. బహుశా వారంలోగా మా ట్రాకర్​ని క్వారంటైన్​ కేంద్రాల్లో, ఐసోలేషన్​ వార్డ్స్​లో అందుబాటులో ఉంచుతాం.’’

Latest Updates