యుద్ధం వద్దు : ఆలోచింపచేస్తున్న కశ్మీరీ పిల్లల వీడియో

పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత ఉగ్రవాద శక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ భారతీయుల రక్తం మరిగిపోయింది. సైన్యానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని కేంద్రం సూచనలు కూడా ఇచ్చింది. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన భారత్… పాకిస్థాన్ తన పద్ధతి మార్చుకోకపోతే యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ఆ తర్వాత పరిణామాలతో… పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఐతే.. యుద్ధం అనేది ఓ మానసిక ఉద్వేగం మాత్రమే అనీ… దాంతో మానవ, సంస్కృతి, జీవన పరిస్థితుల విధ్వంసం జరుగుతుందంటూ ఓ వీడియో సందేశం ఇస్తోంది.

ఒక నిమిషం ఉన్న ఈ వీడియో ఆలోచింపచేసేలా తీశారు. తమ జీవితాలను ఇబ్బందిపెట్టాలనుకునేవాళ్లు.. మానవత్వాన్ని చూపాలని అక్కడి పౌరులు, స్థానికులు కోరుకుంటున్నారు. ద్వేషం.. మరింత ద్వేషం పెంచుతుందని మెసేజ్ ఇచ్చారు. “కశ్మీర్ లో పరిస్థితులు చక్కబడాలంటే యుద్ధమే పరిష్కారం అని చాలామంది అంటున్నారు. సరిహద్దులోని ఈ పిల్లలను చూడండి. చిన్నవాళ్లు… తెలివైనవాళ్లు.. చురుకైనవాళ్లు.. ఆసక్తి ఉన్నవారు. అంతేకాదు.. వీళ్లే కశ్మీర్ భవిష్యత్తు కూడా. ఉగ్రవాద బాధితులుగా మిగిలిపోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. డాక్టర్ ,ఇంజినీర్ కావాలని వాళ్లకు ఆశలున్నాయి. కశ్మీర్ నే నమ్ముకుని పనిచేస్తున్న వీళ్లను చూడండి. ఎంతో దయతో అతిథులను ఆదరిస్తారు. పొట్ట కూటికోసం రోజంతా కష్టపడతారు. కానీ.. మనలాగా రాత్రివేళ పడుకోలేరు. ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ కాదు. ఒక వేళ యుద్ధమే కోరుకుంటున్నయితే… అమాయకమైన ఈ కశ్మీరీల చావుకు మీదే బాధ్యత. యుద్ధం అనేది పరిష్కారం కానేకాదు. బదులుగా ప్రేమను చూపిద్దాం” అని వాయిస్ ఓవర్ లో వినిపిస్తుంది.