భారీ వర్షాలతో ఈ సారి పుష్కలంగా సీతాఫలాలు

సీతాఫలానికి ఎన్నో పేర్లున్నాయి. షుగర్ ఆపిల్, స్వీట్ సోప్, సీతాఫలం లాంటి పేర్లతో పిలుస్తారు. అడవిలో దొరకటం, శీతాకాలంలో దొరికే పండు కాబట్టి సీతాఫలం అనే పేరు ప్రధానంగా ఉంది. సీతాఫలంలో పోషకాలు, చెట్టు మొదలు నుంచి వేర్ల వరకు ఆకులు, కాయలు అన్నింటిలోనూ ఔషద గుణాలున్నాయి. సీతాఫలంలో ఉండే ఎన్నో ఔషద గుణాలు అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం. రసాయనాలు లేకుండా కేవలం సహజమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ పండు లభిస్తుంది.

సీతాఫలం.. హైపో థైరాయిడ్, చిగుళ్ల వాపు, కాళ్ల నొప్పులు, క్యాల్షియం లోపాన్ని నివారించటానికి ఎంతో తోడ్పడుతుంది. లావు పెరగటానికి, గర్భిణీ స్త్రీలకు సీతాఫలం ఉపయోగపడుతుంది. సీతాఫలంలో ఆకులు, పళ్లు, వేర్లు ప్రతి భాగంలో ఉండే ఔషద గుణాలు సీతాఫలం ప్రత్యేకతను చాటుతున్నాయి. తీయని రుచినే కాదు, మంచి సువాసనను అందిస్తుంది. కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.

మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా ఉన్న అడవుల్లో సీతాఫలాలు పుక్కలంగా లభిస్తాయి. నల్లమల, అనంతగిరి, ఇతర చిట్టడువులు, వ్యవసాయ పొలాల్లో సీతాఫలాలు దొరుకుతాయి. సరైన వర్షాలు లేక ఏళ్లకేళ్లు సీతాఫలాలు కనిపించేవి కావు. ఇప్పడిదాకా కనుమరుగైన సీతాఫలాలు గతేడాది, ఈసారి కురుస్తున్న వర్షాలకు సమృద్దిగా లభిస్తున్నాయి. షాద్ నగర్, కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్, కొల్లాపూర్, అచ్చంపేట, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లభించే సీతా ఫల్ ఎంతో ఫేమస్. చుట్టు ముట్టు ఉండే అడవులు, వ్యవసాయ పొలాల్లో సీతాఫలాలు లభిస్తాయి. వాటిని సేకరించి వివిధ ప్రాంతాల్లో మార్కెట్ కు తరలిస్తారు. పాలమూరు జిల్లాలో లభించే సీతాఫలాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతుంది.

ఈసారి భారీ వర్షాలతో సీతాఫలాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఒక్కో కాయ బరువు అరకిలో వరకు ఉంటుంది. పండులో మంచిగా ఖండ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వరకు పాలమూరు సీతాఫలం ఎగుమతి అవుతాయి. షాద్ నగర్ , కడ్తాల్ నుంచి హైదరాబాద్ కు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సీతాఫల్ ఎగుమతి అవుతుంది. ఆమనగల్, కడ్తాల్, బాలానగర్, షాద్ నగర్, రాజాపూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ లో రోడ్లపైనే రైతులు సీతాఫలాలు స్టాల్స్ ఏర్పాటు చేసుకుని అమ్ముతుంటారు. సీతాఫలాల సేకరణలో రైతులు , స్టాల్స్ ద్వారా చిరు వ్యాపారులు, ఎగుమతి ద్వారా బడా వ్యాపారులు ఆదాయాన్ని పొందుతున్నారు.

శ్రీశైలం హైవే , హైదరాబాద్ – బెంగళూరు హైవే పై స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి రోజు వందల సంఖ్య ట్రేలు అమ్ముడుపోతాయి. వ్యాపారం 4 నెలల పాటు సాగుతుంది. ఈ 4 నెలలు సీతాఫల్ వ్యాపారం చేసుకునే జీవనం సాగించే చిరువ్యాపారులు ప్రతి మంచి లాభాలు చూస్తారు. ఈ సారి వరుస వర్షాలు, కరోనా దెబ్బకు వ్యాపారాలు డీలా పడ్డాయి. చిరు వ్యాపారులు నష్టపోతున్నారు.

సీతాఫలాలతో ఐస్ క్రీం తయారీకి, మిల్క్ షెక్, జూస్ లకు ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నవాబుపేట, దామరగిద్ద ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ తరపున ఏర్పాటు చేసారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో గుజ్జు సేకరణపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు.  సీతాఫలాల నుంచి గుజ్జు సేకరించి వాటి ద్వారా సేకరించిన పల్ప్ ను ఐస్ క్రీం పార్లర్లకు సరఫరా చేస్తున్నారు. రైతుల నుంచి సీతాఫలాలను కొనటం, వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వాల్యూ యాడెడ్ మార్చి మంచి లాభాలు సాధిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే వేలాది మంది రైతులకు సీజన్ లో మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

Latest Updates