
టైటిల్ చూస్తే కామెడీ సినిమాలా ఉంది.. డేంజరస్ సినిమా అంటారేంటీ? అనుకుంటున్నారా! ఇది కంటెంట్ ను బట్టి కాదు.. ఆన్ లైన్లో వైరస్లు, మాల్వేర్లను మోసుకొచ్చిన తీరును బట్టి మోస్ట్ డేంజరస్ మూవీ అయిపోయింది! ఇప్పుడు పొద్దున సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికల్లా ఆన్ లైన్లో పైరసీ వెర్షన్ వచ్చేస్తోంది. అయితే ఇలా పైరసీ సినిమా ఫైళ్ల ద్వారా వైరస్ల ముప్పు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే.. ఈ సంవత్సరం ఆన్లైన్లో ఏ సినిమా ఫైళ్ల ద్వారా ఎక్కువ వైరస్లు దాడి చేశాయన్న దాన్ని బట్టి జోయాక్విన్ ఫీనిక్స్ నటించిన ‘జోకర్’ సినిమాను మోస్ట్ డేంజరస్ మూవీగా అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై పేర్కొంది. లాస్ ఏంజిలిస్ లో ఆదివారం రాత్రి (మన టైం ప్రకారం సోమవారం ఉదయం) 92వ ఆస్కార్స్ వేడుక అట్టహాసంగా జరగనుంది.
మొత్తంగా ఈ ఏడాది ఆస్కార్స్ కు నామినేట్ అయిన సినిమాలకు సంబంధించి 925 మాలీషియస్ ఫైళ్లు క్యాస్పర్ స్కై సంస్థకు దొరికాయని, ఇందులో వైరస్లతో కూడిన 304 ఫైళ్లు జోకర్ సినిమావే ఉన్నాయని ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించింది. ఇక బెనెడిక్ట్ కంబర్బాచ్ నటించిన ‘1977’ సినిమా 215 వైరస్ఫైళ్లతో రెండో డేంజరస్ సినిమాగా, మార్టిన్ స్కోర్సెస్ డైరెక్ట్ చేసిన ‘ది ఐరిష్మ్యాన్’ 179 మాల్వేర్ ఫైళ్లతో మూడో డేంజరస్ సినిమాగా నిలిచాయి. ఆస్కార్ మూవీస్ కు సంబంధించి నెటిజన్లకు సేఫ్టీ టిప్స్ ను కూడా క్యాస్పర్ స్కై ఇచ్చింది.