వైరల్​ వణుకు..రాష్ట్రంలో మంచం పట్టిన పల్లెలు,పట్నాలు

రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. టైఫాయిడ్, డెంగీ, మలేరియా, ఇతర విష జ్వరాలతో వేలాది మంది హస్పిటళ్లలో చేరుతున్నరు. ప్రతి ఇంట్లోనూ ఒకరు అనారోగ్యంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని సర్కారీ దవాఖానాలు పేషెంట్లతో కిక్కిరిపోయాయి. బెడ్లు సరిపోక నేలపై, వరండాల్లో బెడ్​షీట్లు వేసి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలోనూ వేల మంది చేరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెల రోజులుగా ఇదే పరిస్థితి. వారం రోజులుగా పరిస్థితి మరింతగా విషమించింది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్​ జిల్లాల్లో డెంగీ విజృంభిస్తోంది. సర్కారు హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్​ అందే పరిస్థితి లేకపోవడం.. ప్రైవేటు హాస్పిటళ్లకు వెళితే వేలకు వేలు బిల్లులు వేస్తుండటంతో జనం లబోదిబోమంటున్నారు. జ్వరాల కంటే ట్రీట్​మెంట్​ కోసం అయ్యే ఖర్చును తల్చుకుని వణికిపోతున్నారు.

వేలకు వేలు బిల్లులు

ప్రైవేటు హాస్పిటళ్లలో చేరుతున్న పేషెంట్లు టెస్టులు, ట్రీట్‌మెంట్  ఖర్చుల కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. జ్వరం, తీవ్రంగా ఒళ్లునొప్పులతో వస్తున్న వారికి హాస్పిటళ్లు టైఫాయిడ్, డెంగీ, మలేరియా తదితర టెస్టులన్నీ చేస్తున్నాయి. ఏ జ్వరమో నిర్ధారించుకుని ట్రీట్​మెంట్​ మొదలుపెడుతున్నాయి. ఈ టెస్టుల కోసమే నాలుగైదు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇన్​పేషెంట్​గా చేరాల్సి వస్తే.. బెడ్​ చార్జీల నుంచి మందుల దాకా చాలా ఖర్చవుతోంది. ముఖ్యంగా డెంగ్యూ బాధితుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్లేట్​లెట్​ కౌంట్​ కోసం తరచూ టెస్టులు, ఒకవేళ ప్లేట్ లెట్లు ఎక్కించాల్సి వస్తే ఆ ప్యాకెట్లకు బిల్లులు కలిపి.. నాలుగైదు రోజులు రోజులు హాస్పిటల్​లో ఉంటే రూ.50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కట్టాల్సి వస్తోంది. ఒకసారి ప్లేట్​లెట్లు ఎక్కించాల్సి వస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఇన్​పేషెంట్​ ట్రీట్​మెంట్​ కోసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారు.

సర్కారు దవాఖాన్లకొచ్చినా తప్పని ఖర్చు

ప్రైవేటు హాస్పిటళ్ల బిల్లులు భరించలేక సర్కారు దవాఖానాలకు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగింది. అయినా జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తుండటంతో టెస్టుల కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడం, తగిన మందులు అందుబాటులో లేకపోవడంతో.. పేషెంట్లు బయటే టెస్టులు చేయించుకోవడం, మందులు కొనుక్కోవడం తప్పడం లేదు. విష జ్వరాలతో వచ్చేవారి పరిస్థితిని చూస్తున్న డాక్టర్లు కూడా వీలైనంత త్వరగా ట్రీట్​మెంట్​ అందేలా టెస్టుల కోసం ప్రైవేటు డయాగ్నసిస్‌‌ సెంటర్లకు రిఫర్ చేస్తున్నారు. సర్కారు దవాఖానాకు రావడానికి ఊరి నుంచి రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఐదారు వేలకుపైగా జేబులో నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది.

సరిపడా డాక్టర్లు లేక

పేషెంట్లు సర్కారు హాస్పిటళ్లకు వస్తున్నా సరిపడా డాక్టర్లు లేక, గంటలకొద్దీ ఓపీ కోసం వేచి చూడలేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఏడు గంటలకే వెళ్లి క్యూలో ఉన్నా మధ్యాహ్నానికి గానీ డాక్టర్​ను కలవడానికి వీల్లేని పరిస్థితి ఉంది. సర్కారు హాస్పిటళ్లలో డాక్టర్లు కూడా భారీగా పేషెంట్లు వస్తుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు హాస్పిటళ్లలో పేషెంట్లకు తగిన సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. నర్సింగ్​ సేవలు, మందులు ఇవ్వడం వంటి వాటి కోసం కూడా చాలా సేపు వేచి చూడాల్సి వస్తోంది.

సిటీకీ జ్వరమొచ్చింది..

హైదరాబాద్​లో వైరల్​జ్వరాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రధాన హాస్పిటళ్లు ఉస్మానియా, గాంధీ, ఫీవర్​ హాస్పిటళ్లకు రోజూ వేలాది మంది పేషెంట్లు వస్తున్నారు. దాంతో ఆదివారం, సెలవు రోజుల్లోనూ పెద్దాస్పత్రుల్లో ఓపీ సేవలను కొనసాగించారు. ఫీవర్ హాస్పిటల్ లో సోమవారం ఒక్కరోజు రెండు వేల మందికిపైగా ఔట్​ పేషెంట్లు వచ్చారు. సోమవారం గాంధీ హాస్పిటల్ కు 2,527 మంది పేషెంట్లు రాగా.. అందులో వెయ్యి మందికిపైగా వైరల్​ జ్వరాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. పేషెంట్ల సంఖ్య పెరగడంతో జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యుల సంఖ్య పెంచినట్లు హాస్పిటల్ ఉన్నతాధికారులు తెలిపారు. ఉస్మానియాకు కూడా పెద్ద సంఖ్యలో విష జ్వరాల బాధితులు వస్తున్నారని, వారికి చికిత్స కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశామని హాస్పిటల్ సూపరిండెంట్  నాగేందర్ చెప్పారు. నీలోఫర్  దవాఖానా కూడా 1,500 మందికిపైగా చిన్న పిల్లలు, మహిళలు వచ్చారు. ప్రభుత్వాస్పత్రులే కాకుండా.. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని ప్రైవేటు హాస్పిటళ్లు, క్లీనిక్​లలోనూ వైరల్  జ్వరాల బాధితులే ఉన్నారు. ట్రీట్​మెంట్​ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

మంచాన పడ్డ పల్లెలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెల్లన్నీ మంచాన పడ్డాయి. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాల్లోని సర్కారు, ప్రైవేటు హాస్పిటళ్లన్నీ కూడా జ్వరాల బాధితులతో నిండిపోయాయి.

ఖమ్మం జిల్లా పరిధిలో డెంగ్యూ, మలేరియా పంజా విసురుతున్నాయి. గత నెలన్నర రోజుల్లో 176 డెంగ్యూ కేసులు, 4 మలేరియా, 56 చికన్ గన్యా కేసులు నమోదయ్యాయి. ఖమ్మంలోని సర్కారు ఆస్పత్రికి రోజూ 1,200 మందికిపైగా బాధితులు వస్తున్నారు. ఒక్కో బెడ్ పై ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను ఉంచుతున్నారు. అయినా సరిపోక నేలపై పరుపులు, బెడ్​షీట్లు వేసి చికిత్స చేస్తున్నారు. విష జ్వరాల వల్ల ఈ ఏడాది ఎవరూ చనిపోలేదని అధికారులు చెప్తున్నారు. అయితే డెంగ్యూ వల్ల ఎనిమిది మంది వరకు చనిపోయినట్టు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. గత రెండు నెలల్లోనే సుమారు మూడు వందల టైఫాయిడ్​కేసులు, 152 మలేరియా, 35 డెంగ్యూ, నాలుగు చికన్​గన్యా కేసులు నమోదయ్యాయి. సర్కారు హాస్పిటళ్లలో బెడ్స్​ సరిపోకపోవడంతో పేషెంట్లకు సెలైన్​ ఎక్కించి, మందులిచ్చి ఇండ్లకు పంపేస్తున్నారు.

నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలోనూ జనం విష జ్వరాలతో ఇబ్బందిపడుతున్నారు. వేలాది మంది మంచాన పడ్డారు. సర్కారు దవాఖానాలన్నీ కిక్కిరిసిపోయాయి. డెంగ్యూ, టైఫాయిడ్, చికన్​గన్యా, మలేరియాలతో వందలాది మంది బాధపడుతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలతో హాస్పిటళ్లకు వస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగింది.

మహబూబ్​నగర్​ జిల్లా దవాఖానాలో బెడ్లు సరిపోక.. ఒకే బెడ్డుపై ఇద్దరు ముగ్గురు పేషెంట్లను ఉంచి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఈ హాస్పిటల్​కు రోజుకు రెండు వేల మంది వరకు పేషెంట్లు వస్తున్నారని.. డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికన్​గన్యాతో పాటు మెదడు వాపు కేసులు కూడా నమోదవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో గత రెండు నెలల్లో 835 డయేరియా, 130 డెంగ్యూ, 2 మలేరియా కేసులు, 14 చికన్​గన్యా కేసులు నమోదయ్యాయి. దేవరకద్ర నియోజకవర్గంలోని పెరూర్​ పీహెచ్ సీలో ఒక మెదడు వ్యాపు వ్యాధి కేసు నమోదైంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో నెల రోజుల్లోనే 502 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. జ్వరాలతో వస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిందని డాక్టర్లు తెలిపారు.

విజృంభిస్తున్న వైరల్​ జ్వరాల బాధితులతో వికారాబాద్​ జిల్లాలోని హాస్పిటళ్లు నిండిపోయాయి. పేషెంట్ల సంఖ్య పెరగడంతో దవాఖానాల్లో బెడ్లు సరిపోక వరండాలో, నేలపై ఉంచి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. వికారాబాద్​ కమ్యూనిటీ హాస్పిటల్​లో 22 మంది డాక్టర్లకుగాను ఏడుగురు డిప్యూటేషన్​పై వేరే హాస్పిటళ్లకు వెళ్లారు. మిగతా డాక్టర్లు షిఫ్టుల వారీగా అందుబాటులో ఉన్నా పేషెంట్లకు ట్రీట్​మెంట్​ అందడం లేటవుతోంది.

ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో విష జ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా ఇంటికొకరు మంచం పట్టారు. వరంగల్​లోని ఎంజీఎం హాస్పిటల్​కు రోజూ వేలాది మంది పేషెంట్లు వస్తున్నారు. దాంతో ఆదివారం, సెలవురోజుల్లోనూ ఔట్​ పేషెంట్​ సేవలు అందిస్తున్నారు. మొత్తంగా సుమారు మూడు వందల మంది వరకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్​ బాధితులు ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్​జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతోంది. గత రెండు నెలల్లోనే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 120కిపైగా డెంగ్యూ, మరో వంద మందికిపైగా టైఫాయిడ్, మలేరియా, ఇతర విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. కరీంనగర్​ పెద్దాస్పత్రిలో బెడ్లన్నీ బాధితులతో నిండిపోయాయి.

ఏడాది సంపాదన ట్రీట్​మెంట్​కే..

ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కూడా వైరల్​ ఫీవర్ల బారినపడిన ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్లు లక్షల్లో బిల్లులు చెల్లించలేక సతమతం అవుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పులు చేసైనా లక్షల రూపాయల బిల్లులు కడుతున్నామని, ఏడాది రెండేళ్ల సంపాదన మొత్తం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

డెంగీ, మలేరియాలకు ఇన్సూరెన్స్

వానాకాలం రాగానే ఊళ్లకు ఊళ్లు విష జ్వరాల బారిన పడుతున్నయి. వాటి బారినపడ్డ వారు వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు డెంగీ, మలేరియా వంటివాటికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్​ ప్యాకేజీలు అందజేస్తున్నాయి. చాలా తక్కువ ప్రీమియం సొమ్ముతోనే రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు కవరేజ్​ లభిస్తుంది. ఉదాహరణకు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సంస్థ రూ.299 ప్రీమియంతో ఏడాదిపాటు డెంగీ, మలేరియాలకు రూ.50 వేల కవరేజ్‌ ఇస్తోంది. అపోలో మునిచ్‌ కంపెనీ రూ.682 ప్రీమియంతో డెంగీకు రూ.లక్ష హెల్త్​ ఇన్సూరెన్స్​ కవరేజ్ ఇస్తోంది. ఇంకా మరెన్నో కంపెనీలు కూడా ఈ తరహా ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి.

Latest Updates