మానసిక రోగం నయమైనా దవాఖాన్లలోనే బందీ

మానసిక రోగుల (మెంటల్ ఇల్ నెస్)కు వ్యాధి నయమైనా ఆస్పత్రుల్లోనే ఉంచుతున్నరట. దేశంలోని 24  రాష్ట్రాల్లోని 43 మెంటల్ హాస్పిటల్స్ లో వారిని ‘అక్రమ నిర్బంధం’లో ఉంచారట. వ్యాధి నయమైన తర్వాత వారిని ఆస్పత్రుల నుంచి పంపించి, బాధితుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా… రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు చర్యలు తీసుకోవడం లేదట. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ రిపోర్టులో ఈ మేరకు వెల్లడైంది. దాదాపు 36 శాతం మంది బాధితులు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ రోజులుగా ఆస్పత్రుల్లోనే ఉన్నారని రిపోర్టులో తేలింది. మరోవైపు కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే మెంటల్ హెల్త్ రివీవ్ బోర్డు (ఎంహెచ్ఆర్బీ)లను ఏర్పాటు చేశాయని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. మెంటల్ ఆస్పత్రుల్లో నెల కంటే ఎక్కువగా రోజులున్న మానసిక రోగుల కేసులను సమీక్షించేందుకు ఈ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ‘‘మెంటల్ హెల్త్ కేర్ చట్టం 2017లో పార్లమెంట్ లో పాస్ అయింది. అయితే దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రాలకు సమయమిచ్చిన కేంద్రం… 2018లో దీన్ని నోటిఫై చేసింది. చట్టం అమల్లోకి వచ్చి కూడా రెండేండ్లు దాటింది. కానీ ఇప్పటి వరకు స్టేట్స్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ మెంటల్ హెల్త్ రివీవ్ బోర్డ్స్ (ఎంహెచ్ఆర్బీ) ఏర్పాటు చేస్తే… ఆస్పత్రుల్లో ఉండాల్సిన అవసరం లేని పేషెంట్ల కోసం రీహాబిలిటేషన్ ప్లాన్స్ చేసేవి. అసలు ఏ ప్రొవిజన్స్ మీద వేలాది మందిని ఆస్పత్రుల్లో ఉంచుతున్నారు? నిజానికి వారందరినీ అక్రమ నిర్బంధంలో ఉంచారు. ఇది సివిల్ రైట్స్ సమస్య” అని సీనియర్ సైకియాట్రిస్ట్ అన్నారు.

రెండు రాష్ట్రాల్లోనే ఎంహెచ్ఆర్బీలు

2017లో తీసుకొచ్చిన మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని అమలు చేయాలని, మానసిక రోగులను ఆస్పత్రుల నుంచి విడుదల చేయాలని అడ్వొకేట్ గౌరవ్ కుమార్ బన్సాల్ సుప్రీంలో పిల్ వేశారు. వ్యాధి నయమైనప్పటికీ మానసిక రోగులను ఆస్పత్రుల్లో అక్రమ నిర్బంధంలో ఉంచుతున్నారని, వారిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఇదే విషయమై 2017లోనే సుప్రీం కోర్టు కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. మెంటల్ ఇల్ నెస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత బాధితులను ఆస్పత్రుల్లో ఉంచడానికి వీల్లేదని చెప్పింది. వాళ్లను తిరిగి సివిల్ సొసైటీలోకి తీసుకురావాలని, ఇందుకోసం పాలసీని రూపొందించాలని సూచించింది. అదే విధంగా వారికి రీహాబిలిటేషన్ కల్పించేందుకు గైడ్ లైన్స్ రూపొందించాలని ఆదేశించింది. దీనికి అప్పట్లో కేంద్రం కొంత సమయం అడిగింది. మళ్లీ తాజా పిటిషన్ పై విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకు వివరాలు వెల్లడించింది. ఎంహెచ్ఆర్బీ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆరుసార్లకు పైగా రిమైండర్లు పంపించామని తెలిపింది. అయితే కేవలం సిక్కిం, త్రిపుర మాత్రమే వీటిని ఏర్పాటు చేశాయంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇవి రెండే పని చేస్తున్నాయంది. మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ఇప్పటి వరకూ నిబంధనలు రూపొందించ లేదని… 10 స్టేట్స్ మాత్రమే స్టేట్ బోర్డును ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని నియమించాయంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది.

బెగ్గర్స్ హోమ్‌ లో బాధితులు

2018లో టాస్క్ ఫోర్స్ రిపోర్టు అందజేయగా… అప్పటి నుంచి ఇప్పటి వరకు 191 మందిని మాత్రమే హాస్పిటల్స్ నుంచి విడుదల చేశారని ‘‘బన్యన్” సంస్థ ప్రతినిధి వందనా గోపీకుమార్ తెలిపారు. ఈ సంస్థ మెంటల్ ఇల్ నెస్ తో బాధపడుతున్న వారికోసం పని చేస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లోనూ ఈ ఆర్గనైజేషన్ పాలుపంచుకుంది. ‘‘కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ బాధితులకు కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్ అందించేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేశాయి. ఇందుకోసం ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ మహారాష్ట్ర ఇలా చేయకపోగా… బెగ్గర్స్ హోమ్ లో వారిని ఉంచుతున్నాయి. ఇది మరీ దారుణం. జిల్లా స్థాయిలోనూ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహించాల్సిన అవసరముంది. అలా జరిగినప్పుడే మానసిక రోగుల పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. వారి సంక్షేమం కోసం కృషి చేయొచ్చు” అని ఆమె చెప్పారు. బాధితులకు సపోర్ట్ అందించేందుకు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదని, వారిని హాస్పిటల్స్ లో ఉంచేందుకు అయ్యే వ్యయం కంటే తక్కువే అవుతుందని పేర్కొన్నారు.

Latest Updates