నాచు పెరుగుతోంది.. గ్లేసియర్లు కరుగుతున్నయ్

  • కెనడాలోని సాస్కాచెవాన్ వర్సిటీ రీసెర్చ్ 

నిన్నటి వరకూ నీలి రంగులో కనిపించిన సము ద్రం తెల్లారేసరికి ఎరుపెక్కుతుంది. లేదా ఆకుపచ్చగా, కాషాయం, గోధుమ లేదా పసుపు రంగులోకి మారిపోతుంది. అక్కడ అకస్మాత్తుగా ఆల్గే పెరగడం వల్ల ఆ ఆల్గే కలర్ కారణంగా సముద్రం అలా రంగు మారిపోయి కనిపిస్తుంటుంది.  ఇట్లా ఆల్గే విపరీతంగా పెరిగిపోతే.. ప్రపంచంలోని గ్లేసియర్లు కరిగిపోతాయట! ఆల్గే పెరుగుదల వల్ల గ్లేసియర్లు కరుగుతాయని గతంలోనే తెలిసినా.. ఆల్గే వల్ల గ్లేసియర్లు కరిగిపోయే ముప్పు చాలా ఎక్కువగా ఉన్నట్లు తాజాగా కెనడాలోని సాస్కాచెవాన్ యూనివర్సిటీ రీసెర్చర్ల స్టడీలో తేలింది. జెనీవాలో ఇటీవల జరిగిన ‘హై మౌంటైన్ సమిట్’లో యూనివర్సిటీ రీసెర్చర్లు తమ నివేదికను విడుదల చేశారు. వాతావరణంలోని దుమ్ము, కాలుష్యకణాలు, కార్బన్ పదార్థాలు గ్లేసియర్లపై పొరలా పేరుకుపోతుంటాయని, వాటిని ఆహారంగా వాడుకుంటూ ఆల్గే పెరుగుతుంటుందని వర్సిటీకి చెందిన జాన్ పొమెరాయ్ వెల్లడించారు. అయితే, గ్లేసియర్లపై ఆల్గే విపరీతంగా పెరగడం వల్ల ‘గ్లేసియల్ డార్కెనింగ్’ ప్రక్రియకు దారి తీస్తున్నాయన్నారు. ‘‘సాధారణంగా సూర్యరశ్మిని గ్లేసియర్లు చాలావరకూ వెనక్కి రిఫ్లెక్ట్ చేయడం వల్ల అంత త్వరగా కరిగిపోకుండా ఉంటాయి. కానీ వాటిపై ఆల్గే పేరుకుపోవడం వల్ల గ్లేసియర్లపై పడే సూర్యరశ్మి ఎక్కువగా రిఫ్లెక్ట్ కాదు. దీంతో టెంపరేచర్లు పెరిగిపోయి గ్లేసియర్లు వేగంగా కరిగిపోతున్నాయని మా స్టడీలో తేలింది” అని జాన్ తెలిపారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన స్విట్జర్లాండ్ లో ఇప్పటికే 500 గ్లేసియర్లు కరిగిపోయాయని ఈ సందర్భంగా ఎక్స్ పర్ట్ లు చెప్పారు. గ్రీన్ హౌజ్ వాయువులను తగ్గించకపోతే ప్రస్తుతం మిగిలి ఉన్న 4 వేల గ్లేసియర్లలో 2100 నాటికి 90% కరిగిపోతాయని హెచ్చరించారు.

Latest Updates