మాకుగానీ ఓటుగానీ వేయకుంటే..

పింఛన్లు, నిధులు రావంటున్న టీఆర్​​ఎస్​ క్యాండిడేట్లు
నవ్వుతూనే ఓటర్లకు బెదిరింపులు
మంత్రులు, ఎమ్మెల్యేల నోటా ఇలాంటి మాటలే
ప్రచారంలో లోకల్​ సమస్యలను మరిచిన లీడర్లు

(వెలుగు, నెట్వర్క్) ‘కారు గుర్తుకు ఓటెయ్యి మల్ల.. ఎయ్యకపోతే నీ రెండు వేలు రావు మల్ల..’ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ వృద్ధురాలిని ఓటు అడుగుతూ ఎమ్మెల్యే జాజల సురేందర్​ ఆదివారం చేసిన వ్యాఖ్యలివి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిపింగ్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఎమ్మెల్యే సరదాగా అంటున్నట్లు అనిపించినా ఆ వృద్ధురాలు మాత్రం సీరియస్​గానే తీసుకున్నట్లు కనిపించింది. ఇలా టీఆర్​ఎస్​ క్యాండిడేట్లు ఎలక్షన్స్​ కోడ్​కు విరుద్ధంగా నవ్వుతూనే ఓటర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మారిన ప్రచార తీరు..

గతంలో మున్సిపల్​ ఎలక్షన్స్​ వస్తే పార్టీలు, లీడర్లు లోకల్​ సమస్యలపై ఫోకస్​ చేసేవారు. ఇంటర్నల్​ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్​ లైట్స్​, పార్కులు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్​ బిల్డింగుల గురించి మాట్లాడేవారు. కొత్త ఇండస్ట్రీస్​ తెస్తామనీ, యూత్​కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలిచ్చేవారు. మా హయాంలో మున్సిపాలిటీకి ఇది చేశామని, అది చేశామని చెప్పుకునేవారు. ప్రస్తుత ప్రచారం తీరు మారిపోయింది. లోకల్​ సమస్యలు, హామీలనేవే ఉండడం లేదు. అధికారపార్టీ క్యాండిడేట్లు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కిట్ల గురించి చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. ఆ పథకాలు కొనసాగాలంటే అటు రాష్ట్రంలో, ఇటు మున్సిపాలిటీలో తామే అధికారంలో ఉండాలనీ, లేదంటే ఆ స్కీంలు ఆగిపోతాయనే రీతిలో మాట్లాడుతున్నారు. ఈ తరహా ప్రచారానికి విపక్ష నేతలు సరైన కౌంటర్​ ఇవ్వలేకపోతున్నారనే విమర్శలున్నాయి.

లోకల్​ సమస్యల జాడేది?

ఇంటింటికీ నీళ్లు, డబుల్​ బెడ్​ రూం ఇళ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క హైదరాబాద్​, రామగుండం నగరాల్లో తప్ప ఇతర ఏ కార్పొరేషన్​లోనూ, ఏ మున్సిపాలిటీలోనూ అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ సిస్టమ్​ లేదు. కొన్నిచోట్ల ప్రారంభించినా పూర్తికావడం లేదు. సైడ్​ డ్రైన్స్​ జాడలేదు. వర్షాకాలంలో వీధుల్లో వరద నీరు ప్రవహించి, ఇంటర్నల్​ రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. ఓపెన్​ డ్రైనేజీల కారణంగా దోమలు, ఈగలు, పందులు విజృంభించి పట్టణ, నగర జనాలకు లేని రోగాలు వస్తున్నాయి. కూరగాయల విక్రయాలకు సరైన మార్కెట్లు లేవు. శివారు కాలనీల్లో కనీస మౌలిక వసతులులేవు.  కానీ తాజా ఎన్నికల్లో ఈ విషయాన్ని ఏ లీడరూ ప్రస్తావించడం లేదు. కరీంనగర్​లో మానేరు రివర్​ ఫ్రంట్​, అగ్రికల్చర్​ బేస్డ్​ ఇండస్ట్రీల ఏర్పాటు హామీ హామీలాగే మిగిలిపోయింది. ప్రస్తుతం అటు అధికారపార్టీ క్యాండిడేట్లుగానీ, ఇటు అపోజిషన్​ లీడర్స్​గానీ వీటిని ప్రస్తావించడం లేదు. నిజామాబాద్​, ఆదిలాబాద్​, మంచిర్యాల సహా అనేక పట్టణాల్లో రైల్వే ఓవర్​ బ్రిడ్జిలు లేక ట్రాఫిక్​ సమస్య తలెత్తి, జనం పడరాని పాట్లు పడుతున్నారు. మంచిర్యాల బైపాస్​కు నేటికీ మోక్షం కలగడం లేదు. ఇలా ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో తరహా సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఏ లీడరూ చెప్పడం లేదు. అధికార పార్టీ క్యాండిడేట్లు ‘నీకు పింఛన్​ ఇస్తున్నాం కాబట్టి ఓటేయండి. మీకు కల్యాణ లక్ష్మి వచ్చింది కాబట్టి ఓటేయండి..’ అని ప్రచారం చేస్తుంటే , విపక్ష లీడర్లు వాళ్లపై వ్యక్తిగత విమర్శలకే  పరిమితమవుతున్నారు.

మంత్రులదీ ఇదే తీరు..

‘మీరు ఓటు ఎవలకేసినా నాకు తెలుస్తది.. లోపల వేసింది సారుకు తెల్వదనుకునేరు.. తర్వాత పొరపాటైందన్నా లాభం లేదు.. మీ జీవితాలు నాశనమైతయ్’  అంటూ శనివారం తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఒకరకంగా బెదిరించినంత పనిచేశారు. ఇది మరవకముందే మధిర మున్సిపాలిటీలో ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ​ప్రచారంలో ఇలాంటి కామెంట్లే చేశారు. విపక్షాలకు ఓటేస్తే మురిగిపోయినట్లేననీ, ఆ పార్టీలను గెలిపిస్తే తాము నిధులు ఇవ్వబోమనే ధోరణిలో మాట్లాడారు.

see also: టఫ్ ఫైట్ : ప్రధాన పార్టీలకు పరీక్ష..

 

Latest Updates