లోన్ ఇప్పిస్తామంటూ రెండు రోజుల్లో 50 లక్షలు కొట్టేసిన కేటుగాడు

ఖైరతాబాద్, వెలుగు:  లోన్లు ఇస్తమని ఫోన్​ చేయిస్తరు. ఆ తర్వాత వెరిఫికేషన్​ టీంను పంపిస్తరు. అంతా ఓకే అనుకుంటే చెక్​  కలెక్షన్​ టీంను పంపి, చెక్​లను తీసుకుంటరు. చివరగా చెక్​ విత్​డ్రా టీంలను బ్యాంకులకు పంపి డబ్బు కాజేస్తరు. ఇదీ జనాన్ని రూ.50 లక్షలకు బురిడీ కొట్టించిన ఫేక్​ సంస్థ బాగోతం. రెండు రోజుల్లోనే అంత మొత్తాన్ని కొట్టేసిన ఆ ఫేక్​ సంస్థ ఓనర్​ని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహేశ్​ అలియాస్​ శేఖర్​ (45) అనే వ్యక్తి, సురేశ్​ అలియాస్​ బాలాజీ అనే వ్యక్తితో కలిసి బుజ్​ వర్క్స్​, బ్యాంక్​ బకెట్​ అనే ఫేక్​ లోన్​ కన్సల్టెన్సీ సంస్థను పెట్టాడు. ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థ అని వాళ్లు నమ్మించేవారు. సికింద్రాబాద్​లోని ఆర్​పీ రోడ్​లో ఆఫీసు పెట్టారు. తాము చేసే నేరం తమ మీద పడకూడదన్న ఉద్దేశంతో టెంపరరీ ఉద్యోగులను నియమించకున్నారు. వారి నంబర్లతోనే కస్టమర్లకు ఫోన్లు చేయించేవారు. అందుకు తగ్గట్టు గత ఏడాది డిసెంబర్​1న 12 మంది టెలికాలర్లను పెట్టుకున్నారు. వారితో కస్టమర్లకు ఫోన్లు చేయించారు. కస్టమర్లు ఓకే అన్నాక, రెండో సెట్​లో భాగంగా డిసెంబర్​ రెండో వారంలో వెరిఫికేషన్​ టీంను నియమించుకున్నారు. వారిని కస్టమర్ల దగ్గరకు పంపి, వివరాలు సేకరించారు. వారితో పనయ్యాక ట్రైనింగ్​ అని బెంగళూరు పంపించి, వాళ్ల నంబర్ల నుంచి ఫోన్​లు రాకుండా బ్లాక్​ చేయించారు. చివరిగా మూడో వారంలో చెక్​ కలెక్షన్​ టీంను నియమించుకున్నారు. ఓకే అయిన కస్టమర్ల దగ్గరకు పంపి వారిని బ్లాంక్​ చెక్​లు తీసుకున్నారు. ఈ ప్రాసెస్​ మొత్తంలో ఎక్కడా వాళ్ల ఫోన్​ నంబర్లు ఇవ్వకుండా, ఉద్యోగుల ఫోన్​ నంబర్లతోనే కాల్​ చేయించారు. ఇక, చివరిగా నాలుగో వారంలో విత్​డ్రా టీంను నియమించారు. కస్టమర్లు ఇచ్చిన చెక్​లను బ్యాంక్​ నుంచి డ్రా చేయించుకున్నారు. రూ.50 లక్షలు నొక్కేశారు.

ఆ ఒక్క తప్పుతో దొరికిపోయారు

కస్టమర్​ ఇచ్చిన బ్యాంక్​ చెక్కును బ్యాంకులో వేసేందుకు చెక్​ విత్​డ్రా టీంను లోపలికి పంపుతారు. ఆ టైంలో వారికి ఓ మామూలు ఫోన్​ ఇస్తారు. చెక్​ వెనక చెక్​ విత్​డ్రా టీంలోని మెంబర్​ పేరు రాయడంతో పాటు, వాళ్లిచ్చిన మామూలు ఫోన్​ నంబర్​ రాయాల్సిందిగా చెబుతారు. ఈ ప్రాసెస్​నంతా ఫేక్​ సంస్థ యజమానులు బయట ఉండి నడిపిస్తారు. డబ్బులు నొక్కేస్తారు. ప్రాసెస్​ అయ్యాక ఆ నంబర్​ను తీసేస్తారు. కానీ, చెక్​ విత్​డ్రా టీంలోని ఓ సభ్యుడు, ఫేక్​ కంపెనీ ఇచ్చిన నంబర్​ను కాకుండా, తన సొంత నంబర్​ను చెక్​పై రాయడంతో కంపెనీ బాగోతం బయటపడింది. డబ్బులు కట్​ అయినట్టు కస్టమర్​కు మెసేజ్​ రావడం, ఆయన బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. వెంటనే బ్యాంకు అధికారులు చెక్​విత్​ డ్రా టీం మెంబర్​కు ఫోన్​ చేసి నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో బాధితుడు మహంకాళి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఇదే విధంగా మోసపోయిన బంజారాహిల్స్​లోని ఇందిరానగర్​కు చెందిన గట్ల మురళి అనే వ్యాపారి కూడా బంజారాహిల్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మహేశ్​, సికింద్రాబాద్​ రేతిఫైల్​లోని ఓయో హోటల్​లో ఉన్నట్టు తెలుసుకున్నారు. మంగళవారం అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన మహేశ్​, రెండో అంతస్తు నుంచి దూకడంతో కాలుకు దెబ్బ తగిలింది. అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ట్రీట్​మెంట్​ చేయించి గురువారం రిమాండ్​కు తరలించారు. ఈ నెల రోజుల ప్రాసెస్​లో మొత్తం డబ్బును గత ఏడాది డిసెంబర్​ 30, 31నే డ్రా చేద్దామనుకున్నారు. ఆ రెండ్రోజుల్లోనే రూ.50 లక్షలు విత్​ డ్రా చేశారు

Latest Updates