మూడు రోజులు మినీ మేడారం జాతర

రేపటి(బుధవారం) నుంచి ఈ నెల 23వరకు మూడు రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. దీంతో జాతరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మనరాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్ గఢ్ , మహారాష్ట్రకు చెందిన వేల మంది భక్తులు జాతరకు వస్తారు. మేడారానికి చెందిన సిద్దబోయిన, కొక్కెర, చందా వంశీయులు సమ్మక్కదేవతను.. కన్నెపల్లికి చెందిన కాక వంశీయులు సారలమ్మ దేవతను కొలుస్తున్నారు. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమికి అటు ఇటుగా బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మహాజాతర నిర్వహిస్తుంటారు.

ఏడాదికోసారి మాఘశుద్ధ పౌర్ణమికి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. దీన్ని మండమెలిగె పండుగ అంటారు. 2005 నుంచి ఏడాదికోసారి జరిగే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో 2007లో అధికారులు, పూజారులు దీనికి చిన్న జాతరగా పేరుపెట్టారు.

మినీ మేడారం జాతరకు దాదాపు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రధానంగా భక్తులు విడిది చేసే ఆలయ పరిసరాల్లో దేవాదాయ శాఖాధికారులు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు.  ఎండవేడి రాకుండా వెదురు తడకలతో పందిళ్లు వేస్తున్నారు. స్నానాలకు నీటిని సరఫరా చేసేందుకు నీటిపారుదలశాఖ రెండు ఊటబావుల్లో పూడిక తీయించింది. రోజుకు 50వేల మంది భక్తులు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశారు.

మేడారం  మినీ జాతర సందర్భంగా ఆర్టీసీ.. హన్మకొండతో పాటు ముఖ్యమైన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

Latest Updates