పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు: ముగ్గురు మృతి

పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని శివకాశి సమీపంలో ఈ ఘటన జరిగింది. విరుధునగర్ జిల్లాలోని శివకాశి సమీపంలో ఉన్న చిన్నగమన్‌పట్టిలో పటాకుల తయారీ యూనిట్‌ వద్ద బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. అక్కడ తయారు చేసిన పటాకులను వెహికల్‌లోకి లోడింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

వెహికల్‌లో నుంచి వచ్చిన స్పార్క్ క్రాకర్స్‌పై పడి ఒక్కసారిగా తయారీ యూనిట్‌లోకి మంటలు వ్యాపించాయి. లోపల భారీగా ఉన్న పేలుడు పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో జరిగిన బ్లాస్ట్ ధాటికి క్రాకర్స్ తయారు చేస్తున్న రూమ్  కూలిపోయింది. కూలీలు తలా ఓ వైపు పడ్డారు. అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని.. వారిని శివకాశి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో కూలీ మరణించాడు. మిగిలిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను పాండ్యరాజన్ (28), పి.కార్తీక్ (17), పి.వెలియసామి (60)గా గుర్తించారు.

Latest Updates