యూఎస్​ కోటీశ్వరుల్లో మనోళ్లు..

three-indian-origin-women-among-americas-richest-self-made

 

అమెరికా కోటీశ్వరుల్లో భారత మహిళలు చోటు సంపాదించారు.  అమెరికా టాప్​ 80 మహిళా ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. అమెరికాస్​ రిచెస్ట్​ సెల్ఫ్​మేడ్​ వుమెన్​ 2019 పేరిట ఫోర్బ్స్​ విడుదల చేసిన జాబితాలో అరిస్టా నెట్​వర్క్స్​ ప్రెసిడెంట్​, సీఈవో జయశ్రీ ఉల్లాల్​, ఐటీ కన్సల్టెన్సీ, అవుట్​సోర్సింగ్​ కంపెనీ సింటెల్​ కోఫౌండర్​ నీరజా సేథి, స్ట్రీమింగ్​ డేటా కంపెనీ కాన్​ఫ్లుయెంట్​ సీటీవో, కోఫౌండర్​ నేహా నర్ఖడేలు ప్లేస్​ కొట్టేశారు. అమెరికాలోని అతిపెద్ద పైకప్పులు, గోడలు, కిటికీల హోల్​సేల్​ డిస్ట్రిబ్యూషన్​ కంపెనీ ఏబీసీ సప్లై చైర్ పర్సన్​ డయానా హెండ్రిక్స్ (72)​ టాప్​ ప్లేస్​లో నిలిచారు. ఆమె మొత్తం ఆస్తి విలువ సుమారు ₹48,652 కోట్లు (700 కోట్ల డాలర్లు). 58 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్​ సుమారు ₹9713 కోట్లతో (140 కోట్ల డాలర్లు) 18వ స్థానంలో నిలిచారు.

ఆమెకు అరిస్టా స్టాకుల్లో 5 శాతం వాటా ఉంది. లండన్​లో పుట్టిన ఆమె ఇండియాలో పెరిగిందని, ఇప్పుడు అమెరికాలో మహిళా కోటీశ్వరుల్లో ఒకరిగా నిలిచారని ఫోర్బ్స్​ పేర్కొంది. ₹6937 కోట్ల (వంద కోట్ల డాలర్లు) సంపదతో 64 ఏళ్ల నీరజా సేథి 23వ స్థానాన్ని దక్కించుకున్నారు. 1980లో తన భర్త భరత్​ దేశాయ్​తో కలిసి ₹లక్షా 38 వేలతో (2 వేల డాలర్లు– ఆ టైంలో అది చాలా పెద్ద మొత్తమే) సింటెల్​ సంస్థను స్థాపించారు. మిషిగన్​లోని ట్రాయ్​ అనే ఓ అపార్ట్​మెంట్​లో చిన్నగా మొదలైన ఆ సంస్థ ప్రస్థానం కొద్ది రోజుల్లోనే పతాక స్థాయికి చేరింది. 2018లో సింటెల్​ను ఫ్రాన్స్​కు చెందిన ఐటీ సంస్థ అటోస్​ ఎస్ఈ సుమారు ₹23,590 కోట్లకు (340 కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది. ఆమె వాటా కింద ₹3539 కోట్లు (51 కోట్ల డాలర్లు) వచ్చాయి. నేహా నర్ఖడే  (34) చిన్న వయసులోనే కోటీశ్వరురాలయ్యారు. ఆమె సంపద సుమారు ₹2500 కోట్లు (36 కోట్ల డాలర్లు). కోటీశ్వరుల జాబితాలో 60వ స్థానాన్ని సంపాదించారు. ఆమె కంపెనీ కాన్​ఫ్లుయెంట్​ విలువ సుమారు ₹17,373 కోట్లు (250 కోట్ల డాలర్లు). ఆమె కంపెనీకి గోల్డ్​మన్​ సాక్స్​, నెట్​ఫ్లిక్స్​, ఊబెర్​ వంటి పెద్దపెద్ద సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. లింకెడిన్​లో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పనిచేసిన ఆమె పెద్దమొత్తంలో వచ్చిపడుతున్న డేటాను నిర్వహించేందుకు అపాచీ కఫ్కా అనే సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేశారు. 2014లో మరో ఇద్దరు సహ ఉద్యోగులతో కలిసి నేహా నర్ఖడే కాన్​ఫ్లుయెంట్​ను స్థాపించారు.

 

Latest Updates