హర్యానాలో కురుక్షేత్ర సమరమేనా?

ఉత్తరాది రాష్ట్రమైన హర్యానాలో వివిధ రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న లోక్ సభ ఎన్నికల పోరు మహాభారతం రేంజ్​లో కాకపోయినా కొద్దోగొప్పో ఆ స్థాయిలోనే ఆసక్తి కలిగిస్తోంది. ఇక్కడ ఎన్నికల బరిలోకి ఈసారి కొత్తగా మూడు రాజకీయ పార్టీలు దిగాయి. ఒకటి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​  కేజ్రీవాల్​ నాయకత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​). రెండు, దుష్యంత్​ చౌతాలా నాయకత్వంలోని  జననాయక్​ జనతా పార్టీ(జేజేపీ). మూడు, బీజేపీ మాజీ  ఎంపీ రాజ్​కుమార్​ సైనీ సారథ్యంలోని లోక్​తంత్ర సురక్షా పార్టీ(ఎల్​ఎస్​పీ).

మనుగడ కోసం ఐఎన్ ఎల్ డీ పోరాటం

మాజీ డిప్యూటీ ప్రధాని చౌదరీ దేవీలాల్​ ఏర్పాటుచేసిన ‘ఇండియన్​ నేషనల్​ లోక్​ దళ్’​(ఐఎన్​ఎల్​డీ) పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే ఆ పార్టీలో తర్వాత చీలిక వచ్చింది. దీంతో  ఐఎన్​ఎల్​డీ ఉనికి కోసం లోక్ సభ ఎన్నికల్లో పోరాడుతోంది. చౌదరీ దేవీలాల్​ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది తామేనంటూ ఒక వైపు ఐఎన్​ఎల్​డీ, మరోవైపు కొత్తగా ఏర్పడిన జేజేపీ చెప్పుకుంటున్నాయి. దేవీలాల్​ మనవడు అజయ్​ చౌతాలా తన పార్టీ జేజేపీని  ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చెమటోడ్చుతున్నాడు.

జేబీటీ టీచర్స్​ రిక్రూట్​మెంట్​ కుంభకోణంలో తండ్రి, మాజీ సీఎం ఓం ప్రకాశ్​ చౌతాలాతోపాటు పదేళ్ల జైలు శిక్ష పడ్డ అజయ్​ చౌతాలా 21 రోజుల ప్రత్యేక సెలవుపై బయటకు వచ్చారు. ఈ సెలవులో తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి  రాత్రింబవళ్లు  కృషి చేస్తున్నాడు. జేజేపీ లోక్​సభ ఎన్నికల్లో తొలిసారి పాల్గొంటోంది. ఈ పార్టీతో​  ‘ ఆప్ ’  పొత్తు పెట్టుకుంది.  హర్యానా లోక్ సభ ఎన్నికల్లో ‘ఆప్’  పోటీ చేయడం ఇదే తొలిసారి.  మొత్తం పది స్థానాల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ  మూడు చోట్ల పోటీ చేస్తుండగా జేజేపీ ఏడు స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఐఎన్​ఎల్​డీతో అలయెన్స్​ వద్దనుకొని బయటకు వచ్చిన బీఎస్పీ ఈసారి కొత్తగా తెరపైకి వచ్చిన ఎల్ ఎస్ పీతో పొత్తు పెట్టుకుంది.

పోటీ చేసే అవకాశం రాని మహిళలు

ముగ్గురు లేడీస్​కు టికెట్లు ఇస్తామని జేజేపీ చీఫ్​​  దుష్యంత్​ చౌతాలా గత నెలలో ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. ఆ పార్టీ ఒక్క మహిళనే ఎంపిక చేసింది. భివాని–మహేందర్​గఢ్​ నియోజకవర్గంలో జేజేపీ తరఫున స్వాతి యాదవ్​ నామినేషన్​ వేశారు.  హస్తం పార్టీ ఇద్దరు ఆడవారికి  అవకాశమిచ్చింది. వీరిలో ఒకరు.. కుమారి సెల్జా(అంబాలా). మరొకరు.. శ్రుతి(భివాని–మహేందర్​గఢ్). వీళ్లిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. సెల్జా.. దళిత నేత దల్బీర్​ సింగ్​ కూతురు కాగా శ్రుతి.. స్టేట్​ లెజిస్లేటివ్​ పార్టీ లీడర్​ కిరణ్​ చౌదరి కుమార్తె. బీఎస్పీ–ఎల్​ఎస్పీ అలయెన్స్​ ఇద్దరు మహిళలకు టికెట్లు ఇచ్చింది. సోనెపట్​ నుంచి రాజ్​ బాలా సైనీ, కురుక్షేత్రలో శశి సైనీ ప్రజాతీర్పు కోరుతున్నారు.

ఏ కమ్యూనిటీవాళ్లు ఎంత ఉంది?

హర్యానాలో సింగిల్​ మెజారిటీ ఓట్లు జాట్​ కులానిదే. మొత్తం ఓటర్లలో వీళ్ల పర్సంటేజీ 17 పైనే. బ్రాహ్మణులు, పంజాబీలు, బనియాలు ముగ్గురూ కలిపి సుమారు 30 శాతం వరకు ఉంటారు. ఓబీసీ, యాదవ్​ల వాటా 25 శాతం. ఎస్సీ, ఎస్టీలు 20 శాతం పైనే ఉంటారు. మొత్తం పది సెగ్మెంట్లలో రెండింటిని (అంబాలా, సిర్సా) ఎస్సీలకు రిజర్వ్​ చేశారు.

కులాల లెక్కలకే  ప్రయారిటీ

హర్యానాలో పంచాయతీ ఎన్నికల నుంచి లోక్ సభ ఎన్నికల  వరకు ప్రతిచోటా ప్రతిసారీ కులమే ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతుంటాయి. పోటీకి నిలబడే కేండిడేట్ ను ఎంపిక చేయటంలో కులాల లెక్కలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత లోక్​సభ ఎన్నికలోనూ కులమే కీలకంగా మారబోతోంది. అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను చాలా జాగ్రత్తగా, తీవ్ర కసరత్తు తర్వాత ఎంపిక చేశాయి. ఏ నియోజకవర్గంలో,  ఏ కులం జనాభా ఎక్కువ ఉందో పరిశీలించి….దాని ఆధారంగా కేండిడేట్లను సెలెక్ట్ చేసుకున్నాయి.

2014 లోక్ సభ ఎన్నికల్లో ……

2014 లోక్ సభ ఎన్నికల్లో  హర్యానాలో  బీజేపీ విజయం సాధించింది. మొత్తం 10 నియోజకవర్గాల్లో బీజేపీ ఏడు సెగ్మెంట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రెండు సెగ్మెంట్లను గెలుచుకోగా కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంతో సరిపెట్టుకుంది.

Latest Updates