హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుపై కన్ను…

త్వరలో జరుగనున్న హుజూర్ నగర్  అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ నజర్​ వేశాయి. ఎట్లాగైనా ఆ సీటును గెల్చుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు, ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లలో హుజుర్ నగర్ లో గెలిచిన పీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత నల్గొండ ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన మే 6వ తేదీన ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేశారు. రూల్స్​ ప్రకారం ఎమ్మెల్యే సీటు ఖాళీ అయ్యాక ఆరు నెలల్లోపు (అంటే డిసెంబర్ 6వ తేదీ నాటికి) తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. ఈ లెక్కన ఈ నెలలోనే ఉప ఎన్నిక షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. దసరా తరువాత ఉప ఎన్నిక జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రతిపక్షాలకు చెక్​పెట్టే యోచనలో టీఆర్ఎస్

2014, 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్  నుంచి ఉత్తమ్  గెలిచారు. దీంతో ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసి, సత్తా ఏమిటో చూపాలని సీఎం కేసీఆర్  పట్టుదలగా ఉన్నారని నల్గొండ జిల్లాకు చెందిన నేతలు చెప్తున్నారు. మంచి మెజార్టీతో హుజుర్ నగర్ లో గెలిచి.. కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టొచ్చన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు. హుజూర్​నగర్​లో పార్టీ పరిస్థితి ఏమిటి, కాంగ్రెస్​ బలం ఏమిటి, ఎలా గెలవాలన్న దానిపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలేమైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని నేతలు, అధికారులకు సూచిస్తున్నారు. చేరికలపైనా దృష్టిపెట్టారు. కాంగ్రెస్ స్థానిక నాయకులు కొందరిని ఇప్పటికే టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే వారెవరైనా ఇంకా చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి గట్టి పోటీ ఇచ్చి, సుమారు ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా ఆయననే బరిలోకి దించాలని టీఆర్ఎస్  యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సారీ తమదే గెలుపంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్  నేతలు హుజుర్ నగర్  సీటును తిరిగి తామే కైవసం చేసుకుంటామని ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎంత ప్రయత్నించిన వృథా ప్రయాసేనని.. ఇంతకు ముందు వరుసగా రెండు సార్లు గెలిచామని, ఇప్పుడూ తామే విజయం సాధిస్తామని అంటున్నారు. ఇక్కడ ఉత్తమ్ తన సతీమణి పద్మావతి రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకుడైన పటేల్ రమేష్ రెడ్డి కూడా హుజూర్​నగర్​ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పద్మావతి కంటే రమేష్ బలమైన అభ్యర్థి అవుతారని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నట్టు కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి.

బలం పెంచుకునే పనిలో బీజేపీ

హుజూర్ నగర్లో బీజేపీకి పెద్దగా బలం లేదు, స్థానికంగా ప్రభావం చూపే లీడర్లు లేరు. అయినా గెలిచేందుకు ప్రయత్నిస్తా మని పార్టీ సీనియర్లు చెప్తున్నారు. గట్టి క్యాండిడేట్ కోసం అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నాయకుడి కుమారుడిపై దృష్టి పెట్టారని, ఆయనతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఈ ప్రయత్నాలు ఫలిస్తే..ఆ సీనియర్ నేత కుమారుడు బీజేపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

Latest Updates