10 ఏండ్లు ఎక్కువ బతకాలంటే 3 దారులు

ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, హెల్దీ లైఫ్​ను గడపాలని ఉంటుంది. ఫుల్ జోష్​తో ఎక్కువ కాలం బతకాలనీ అనిపిస్తుంది. మనకోసం ప్రకృతి ఇచ్చిన ఎన్నో అందాలను ఆస్వాదించాలని ఉంటుంది. మనచుట్టూ అల్లుకున్న రిలేషన్స్​తో మరింతకాలం ఉండాలనీ అనిపిస్తుంది. ఎక్జిట్ దారికి వీలైనంత లేట్​గా రీచ్ అవ్వాలని ఉంటుంది. వినడానికి ఇదేదో పెద్ద డ్రీమ్​లా ఉంటుంది. బాగా కష్టపడి సాధించుకోవాల్సిన పనిలానూ ఉంటుంది. నిజానికి ఇదేమీ పెద్ద కష్టం కాదు. బాగా బతకడం చాలా సింపుల్.

మనం మూడంటే మూడింటిని ఫాలో అయితే చాలు. అవే మన ఆరోగ్యాన్ని సాఫీగా నడిపిస్తాయని హెల్దీగా ఉండేట్టు చూస్తాయని ఒక పదేళ్ల లైఫ్​స్పాన్​ పెంచుతాయని బ్రిటిష్​ మెడికల్​ జర్నల్​లో ఇటీవల ఒక స్టడీ బయటపెట్టింది. వీళ్లు ఈ స్టడీని 34 ఏళ్ల పాటు చేశారు. లక్షా పదివేల మంది హెల్త్​ డేటాను పరిశీలించారు. దాని నుంచి హెల్దీలైఫ్​ కోసం కొన్ని విషయాలను బయటపెట్టారు.

మిగతాపని అవే చూసుకుంటాయి

స్మోకింగ్​కు దూరంగా ఉండటం, పరిమితంగా డ్రింక్ చేయడం, కనీసం రోజుకు ఒక​ అరగంట పాటు వర్క​వుట్స్ చేయడం, ఆరోగ్యకరమైన డైట్​ను ఫాలో అవడం… ఈ పనులను మనం చేస్తే చాలు. మన ఆరోగ్యకరమైన లైఫ్​కు కావాల్సిన అన్నింటినీ అవే చేస్తాయి.  ​హార్ట్​కు సంబంధించిన వ్యాధులనూ, క్యాన్సర్​నూ, డయాబెటిస్​నూ మన దరికి చేరనివ్వకుండా ఈ అలవాట్లే కాచుకుని ఉంటాయి. మనం చెయ్యాల్సిన సింపుల్​ పనులను మనం చేసేస్తే, పెద్దపెద్ద పనులన్నింటినీ అవి చూసుకుంటాయి.

ఎక్కువ కాలం పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఇక వాళ్ల పని అయిపోయినట్టేనని అనుకుంటాం. ఆ తర్వాత వాళ్లు రికవర్​ అయినా, తిరిగి మూమూలు అవుతారనే నమ్మకం మనకుండదు. అయితే మనం ఈ ఆలోచనను మార్చుకుని తీరాల్సిందేనని ఈ సర్వే చెబుతోంది. సరైన అలవాట్లను అలవర్చుకుంటే… ఎలాంటి పరిస్థితులనుంచైనా రికవర్​ అయి తిరిగి మామూలు అవ్వొచ్చని చెప్తున్నారు.

మూడు అలవాట్లు…

మనం జీవితాంతం హెల్దీగా ఉండేందకు పాటించాల్సిన వాటిలో మొదటిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెండోది వర్కవుట్స్​ చేయడం, మూడోది స్మోకింగ్​కు​, డ్రింకింగ్​కు చెక్​ పెట్టడం. వీటికి సంబంధించిన చిట్కాలనూ ఒకసారి చూద్దాం.

  1. ఫుడ్​ విషయాన్ని చాలా సీరియస్​గా తీసుకోవాలి. బ్యాలెన్స్​డ్​ డైట్​ ఉండేలా చూసుకోవాలి. ఏ సీజన్​లో దొరికే పండ్లను, కూరగాయలను ఆ సీజన్​లో తప్పక తినాలి. ఫ్రూట్​ జ్యూస్​ల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మార్కెట్​లో దొరికే ప్యాక్​ చేసి ఉన్న జ్యూస్​లను పక్కన పెట్టడమే మంచిది. వాటిలో షుగర్​ ఎక్కువగా ఉండటమే కాకుండా ఫైబర్​ తక్కువగా ఉంటుంది. ఇంట్లో జ్యూస్​ తయారు చేసుకుని, పిప్పితో సహా తాగాలి. దాదాపు ఫైబర్​ అంతా పిప్పిలోనే ఉంటుంది. దీంతోపాటుగా ఇంట్లో తయారు చేసుకునే జ్యూస్​లో షుగర్​ వాడకపోవడమే బెటర్​ ఆప్షన్​. పాల విషయంలోనూ జాగ్రత్త పాటించాలి. ఎంత తక్కువ ఫ్యాట్​ ఉన్న పాలని వాడితే అంత మంచిది. పాలకు ఆల్టర్​నేటివ్​గా సోయా పాలు వాడొచ్చు. జంక్​ ఫుడ్​కూ, షుగర్​ ఎక్కువగా ఉన్న ఫుడ్​కూ ‘నో’ చెప్పాలి.
  2. కనీసం రోజుకు అరగంటైనా వర్కవుట్స్​ చేయాలి. ఎలాంటి సిచ్యుయేషన్​లో అయినా ఈ లెక్క వారానికి 150 నిమిషాలకు తగ్గకూడదు. అప్పుడే గుండె బాగా పనిచేస్తుంది. వాకింగ్ పేరుతో అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. నడకలో వేగం ఉండాలి. సైక్లింగ్​, స్విమ్మింగ్​, బ్యాడ్మింటన్​ వంటి వాటి వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వీటి పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు వీటిని ఎంచుకోవడమే బెటర్​ ఆప్షన్​. నడకను ఇష్టపడే వాళ్లు మాత్రం… వేగాన్ని పెంచి నడవాల్సిందే. 
  3. డ్రింకింగ్​కు, స్మోకింగ్​కు ‘నో’ చెప్పాల్సిందే. ఎప్పుడైనా ఒకసారి డ్రింక్ చేసినా పర్వాలేదు. కానీ, స్మోకింగ్​కు ఇప్పటికిప్పుడు ఫుల్​స్టాప్​ పెట్టాల్సిందే. ఎక్కువగా డ్రింక్​ చేయడం వల్ల దాని ప్రభావం లివర్​పైనా, నడుముపైనా పడుతుంది. స్మోకింగ్​ ద్వారా అయితే ఫ్యూచర్​లో అన్నిరకాల ఇబ్బందులూ ఎదురవుతాయి. వీటికి చెక్​ పెట్టడానికి సహకరించేందుకు ఇప్పుడు చాలా కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆశ్రయించడమూ మంచి ఆలోచనే.

పదేళ్లు బోనస్​…

ఈ సర్వే ఇస్తున్న సమాచారం ప్రకారం… ఈ మూడు అలవాట్లనూ అలవర్చుకుంటే… మహిళలకు పదేళ్లు, పురుషులకు ఎనిమిదేళ్లు ఆరోగ్యకరమైన బోనస్​ లైఫ్​ ఉంటుంది.  మనకోసం, మన ఆరోగ్యకరమైన జీవితం కోసం మనం చేయాల్సింది మనం చేద్దాం. మిగతాపనిని అవే చూసుకుంటాయి.

Latest Updates