పిడుగు పడి చిన్నారి మృతి

ఏటూరు నాగారం, వెలుగు: అంగన్​వాడి స్కూల్​కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగుపడటంతో ఓ చిన్నారి చనిపోయింది. మరో బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. శనివారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిలో ఈ ఘటన జరిగింది. చిన్నారి తల్లిదండ్రులు మీడియం లక్ష్మీ, సురేశ్.. పిల్లలిద్దరిని ఇంట్లో ఉంచి కూలి పనికి వెళ్లారు. ఈ క్రమంలో అంగన్ వాడీ బడికి వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తుండగా భారీ వర్షం పడింది.

వాళ్లు ఇంటికి చేరుకునే సమయంలోనే పిడుగు పడటంతో కూతురు శాంతి(4) అక్కడికక్కడే చనిపోయింది. కొడుకు సిద్దులు(2) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చనిపోవడంతో పాటు బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్నవారందరిని కంటతడి పెట్టించాయి.

Latest Updates