టిబెటన్లు .. ‘ఇండియన్లు’ కామంటున్నరు

ఇండియాలో లక్షమంది టిబెటన్ రెఫ్యూజీలు

చైనా నుంచి ఇండిపెండెన్స్ వస్తుందని నమ్ముతున్నరు

అందుకే సిటిజన్​షిప్​కు అప్లై చేస్తలే

ఇండియాలో రెఫ్యూజీలుగా ఉంటున్న టిబెట్ దేశస్తులు చాలామంది ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకోవడం లేదట. ఎందుకంటే చైనా అధీనంలో ఉన్న తమ దేశానికి ఎప్పటికైనా ఇండిపెండెన్స్ వస్తుందని వారు గట్టిగా నమ్ముతున్నారట. అందుకే ఇండియన్ గవర్నమెంట్ వారికి సిటిజన్​షిప్ పొందేందుకు అవకాశం కల్పించినప్పటికీ చాలామంది ఆసక్తి చూపడం లేదట. ప్రముఖ జర్నలిస్టు నిర్మల్యా బెనర్జీ తాను రచించిన ‘‘ది బుద్ధ అండ్ ది బోర్డర్స్” బుక్ లో ఈ విషయాలను వెల్లడించారు. ‘‘దాదాపు లక్ష మంది టిబెటన్స్ శరణార్థులుగా ఇండియాలో ఉంటున్నారు. వీరందరూ1960 ప్రాంతంలో ఇండియాకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం వీరిని రెఫ్యూజీలుగా గుర్తించి సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది. జాబ్స్ కు అప్లై చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది” అని బెనర్జీ తన పుస్తకంలో వివరించారు.

కన్ఫ్యూజన్ లో టిబెటన్స్

‘టిబెటన్ రెఫ్యూజీలు సిటిజన్ షిప్ కు అప్లై చేసుకునేందుకు ఇండియన్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. దీనిపై నిర్ణయాన్ని టిబెట్ ప్రభుత్వం ఇండియాలో ఉంటున్న తమ రెఫ్యూజీలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో ఏండ్లు గడుస్తున్న కొద్దీ టిబెటన్స్ గందరగోళం ఎదుర్కొంటున్నారు. రెఫ్యూజీగానే ఉండాలా? లేక ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకోవాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. ఒకవేళ పౌరసత్వం తీసుకుంటే టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఉద్యమం బలహీనపడుతుందేమో అనే భయాందోళనలో టిబెటన్స్ ఉన్నారు. ఎప్పటికైనా టిబెట్ కు ఇండిపెండెన్స్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకోకుండా రెఫ్యూజీలుగా జీవించడానికే చాలామంది ఇష్టపడుతున్నారు” అని బెనర్జీ బుక్ లో రాశారు. మరోవైపు ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆరోగ్యం విషయంలోనూ టిబెటన్స్ ఆందోళనలో ఉన్నారని, ఆయన దీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.

దలైలామా తర్వాత ఎవరు?

1950లో టిబెట్ ను చైనా ఆక్రమించుకోవడంతో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా1959లో ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అప్పటి నుంచి ఇండియాలోనే ఉంటూ టిబెట్ ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం14వ లామాగా ఉన్న దలైలామా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన తర్వాత గురువు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. దలైలామా మరణించిన తర్వాత ఆయన వారసుడిగా వేరెవరినో తెరపైకి తేవాలని చైనా ప్రయత్నించే అవకాశం ఉందని బెనర్జీ తన బుక్ లో వెల్లడించారు. మరోవైపు ‘‘నా తర్వాత దలైలామా వ్యవస్థ  కొనసాగకపోవచ్చు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్స్ నిర్ణయం తీసుకుంటారు” అని దలైలామా ఇటీవల పేర్కొన్నారు. ఒకవేళ కొత్త దలైలామాను ఎంపిక చేసినా, ఆయన మతం, దేశం గురించి అర్థం చేసుకోవడానికి ఏండ్ల కాలం పడుతుందని అభిప్రాయపడ్డారు.

Latest Updates