విష కళేబరాలు తిని పులులు చనిపోతున్నాయ్

  • రాష్ట్ర సరిహద్దులో మూడు నెలల్లో ఐదు మృతి   
  • కొరవడిన ట్రాకింగ్​ వ్యవస్థ

కాగజ్​నగర్​, వెలుగు: అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పులి కూడా ఒకటి. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా పులులు ఉండగా ప్రస్తుతం ఐదు వేల లోపే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పులుల జాతిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా 2006లో దేశంలో 1,411 ఉన్న పులుల సంఖ్య 2018 నాటికి 2,967కు పెరిగింది. ఓ వైపు సంరక్షణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మరోవైపు పులులు మృత్యువాత పడుతూనే ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో గత మూడు నెలల్లో ఐదు పులులు విషాహారం తిని చనిపోయాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్​ జిల్లా తడోబా టైగర్​రిజర్వ్​పులులకు పెట్టింది పేరు. అక్కడి పులులను చూసేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే అక్కడ పులుల సంఖ్య పెరగడం, దానికితోడు అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గత రెండేళ్ల కాలంలో అక్కడ మృతిచెందిన పులుల సంఖ్య పదికి పైగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితం వరకు వేటగాళ్ల బారినపడి, వాళ్లు పెట్టిన ఉచ్చులో చిక్కుకుని పులులు మృతిచెందిన ఘటనలు వెలుగు చూసేవి.

ఇటీవలి కాలంలో పులులు ఆహారం కోసం కళేబరాలను తిని మృతిచెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జులై 8న చంద్రాపూర్​ జిల్లా చిమ్ముర్​ తాలూకా బ్రహ్మపురి రేంజ్ లోని మెటెపార్​గ్రామ సమీపంలో ఓ ఆడపులి రెండు మగ పిల్లలతో కలిసి మృతిచెందిన ఘటన వెలుగు చూసింది. అక్కడి ఆఫీసర్లు దీనిపై విచారణ చేపట్టారు. ఆవులను వేటాడుతున్న కుక్కలను చంపేందుకు విషం పెట్టిన ఓ జంతువు కళేబరాన్ని గ్రామ శివారులో పడేశారు. దానిని తిని మూడు పులులు మృతిచెందినట్లుగా గుర్తించారు. అనంతరం అదే కోర్​ ఏరియాలో మరో పులి మృతిచెందింది. తాజాగా ఆగస్టు 25న చంద్రాపూర్​జిల్లాలోని గోండ్​పిప్రి తాలూకాలోని పోడ్సా గ్రామ సమీపంలో పంట పొలంలో మగపులి కళేబరం కనిపించింది. రైతు విషం పెట్టి అడవి పందిని చంపగా దానిని తిని పులి చనిపోయిందని తేలింది.

పులుల రక్షణకు ట్రాకింగ్​ కీలకం

పులి సుదూర ప్రాంతాల్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అది సంచరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తడోబాలో పులుల సంఖ్య ఎక్కువ కావడంతో వాటి దృష్టి సుమారు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాగజ్ నగర్​అటవీ ప్రాంతంపై పడింది. రెండు మూడేళ్లుగా మహారాష్ట్రలోని తడోబా నుంచి కాగజ్​నగర్ అడవులకు పులులు ఎక్కువగా వస్తున్నట్లు ఆఫీసర్లు  గుర్తించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో జనావాసాలకు సమీపం నుంచి అవి ప్రయాణిస్తున్నాయి. అలాంటి సమయంలో విషంతో ఉన్న కళేబరాలను తిని మృత్యువాత పడుతున్నాయి. పులులు మృత్యువాత పడకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు ట్రాకింగ్​ వ్యవస్థ కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడం, ట్రాకింగ్​చేసే సిబ్బంది అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందని నిపుణులు పేర్కొంటున్నారు. పులుల రక్షణ ధ్యేయంగా ఏర్పడిన నేషనల్​ టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీకి పులికి సంబంధించి అన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు అధికారాలు, నిధులు ఉన్నాయి. ఇటీవలి పరిస్థితుల దృష్టా  ఎన్​టీసీఏ పులుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

tigers dies by eating Poisonous carbs

Latest Updates