చెల్లెలిని రేప్ చేసిన ఫ్రెండ్: ప‌్ర‌తీకారం కోసం.. మ‌ర్డ‌ర్ చేసి జైలుకెళ్లి ఫ్రెండ్‌ని చంపిన అన్న‌

రాఖీ సినిమాలో ఆడ‌పిల్ల‌ల‌పై అకృత్యాల‌కు పాల్ప‌డి.. జైలులో ఉన్న‌వాడిని చంప‌డం కోసం హీరో ఎన్టీఆర్ వేరొక కేసు విష‌యంలో లొంగిపోయి అదే జైలుకు వెళ్లి అత‌డిని హ‌త్య చేస్తాడు. ఇదే త‌ర‌హా ఘ‌ట‌న ఢిల్లీలో జ‌రిగింది. ఢిల్లీలోని తీహార్ జైలులో రెండ్రోజుల క్రితం ఓ ఖైదీని త‌న బ్యారెక్‌లోకి దూరి మ‌రో ఖైదీ హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేసిన పోలీసుల‌కు అనూహ్య‌మైన నిజాలు తెలిశాయి. తీహార్ జైలులో ఈ మ‌ర్డ‌ర్ చేయ‌డం కోసమే అత‌డు బ‌య‌ట వేరొక వ్య‌క్తిని చంపేసి పోలీసుల‌కు లొంగిపోయి.. వ‌చ్చిన‌ట్లు తెలిసి షాక్ అయ్యారు. త‌న చెల్లెలికి జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారంగా అత‌డు హంత‌కుడిగా మారిన‌ట్లు వారి ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

స్నేహితుడే మృగంలా మారి అకృత్యం.. చెల్లెలు ఆత్మ‌హ‌త్య‌

సోమ‌వారం నాడు ఉద‌యం తీహార్ జైలులో జ‌కీర్ (21) అనే యువ‌కుడు అదే జైలులోని మ‌రో బ్యారెక్‌లో ఉన్న మ‌హమ్మ‌ద్ మెహ‌తాబ్ (27)ని హ‌త్య చేశాడు. వాస్త‌వానికి వీరిద్ద‌రూ ఏడేళ్ల క్రితం మంచి స్నేహితులు. అప్ప‌టికి జ‌కీర్ 14 ఏళ్ల టీనేజ‌ర్. త‌న కన్నా మెహ‌తాబ్ ఆరేళ్లు పెద్ద‌వాడైన‌ప్ప‌టికీ మంచిగా క‌లిసి తిరుగుతుండ‌డంతో ఇద్ద‌రూ దోస్తులుగా మారారు. క‌లిసి ఇంటికి కూడా వెళ్లేవాళ్లు. మేక వ‌న్నె పులిలా న‌టించిన మెహ‌తాబ్ కొన్నాళ్ల‌కే త‌న అస‌లు రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఎవ‌రూ లేని స‌మ‌యంలో మైన‌ర్ అయిన‌ జ‌కీర్ చెల్లెలిపై మెహ‌తాబ్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసులో అరెస్ట‌యి తీహార్‌ జైలులో ప‌డ్డాడు. కానీ, ఆ కిరాత‌కుడు చేసిన ప‌నితో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన జ‌కీర్ చెల్లెలు ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాలు వ‌దిలింది.

ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర విషాదంలో మునిగిపోయిన జ‌కీర్.. ఎలాగైనా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నాడు. మెహ‌తాబ్‌ను చంపేయాల‌ని మ‌న‌సులో నిశ్చ‌యించుకున్నాడు. తీహార్ జైలులో ఉన్న అత‌డిని హ‌త్య చేయాలంటే తానూ అక్క‌డే ఉండాల‌ని, 2018లో బ‌య‌ట ఒక హ‌త్య చేసి.. పోలీసుల‌కు లొంగిపోయాడు. తీహార్ జైలులో ట్ర‌య‌ల్ ఖైదీగా ప‌డిన అత‌డి వ‌యసు అప్ప‌టికి 20 ఏళ్ల‌లోపే ఉండ‌డంతో మెహ‌తాబ్ ఉన్న సెక్ష‌న్‌లో కాకుండా జైలులోని మ‌రో కాంప్లెక్స్‌లో అత‌డి ఉంచారు అధికారులు. ఎప్పుడెప్పుడు 20 ఏళ్ల వ‌య‌సు నిండుతుందా అని క‌సిగా ఎదురు చూస్తూ మెహ‌తాబ్ హ‌త్య‌కు స్కెచ్‌లు వేసుకుంటూ కాలం గ‌డిపాడు. జ‌కీర్‌కు 21 ఏళ్లు రాగానే మెహ‌తాబ్ ఉన్న సెక్ష‌న్‌లోకి మార్చారు. అయితే ఇద్ద‌రి బ్యారెక్‌లు చాలా దూరంగా ఉండ‌డంతో చెల్లెలికి అన్యాయం చేసిన‌వాడు కంటికి క‌నిపిస్తున్నా ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం కుద‌ర‌లేదు. దీంతో త‌ను ఉన్న బ్యారెక్‌లోని మిగ‌తా ఖైదీల‌తో నిత్యం గొడ‌వ‌లకు దిగ‌డం స్టార్ట్ చేశాడు జ‌కీర్. అత‌డి ప్ర‌వ‌ర్త‌నతో విసుగు చెందిన తోటి ఖైదీలు జ‌కీర్‌ను మ‌రో సెల్‌లోకి మార్చాల‌ని జైలు అధికారుల‌ను కోరారు. దీంతో అత‌డు తానే ఆ సెల్‌లో ఉండ‌న‌ని, జైలు – 5 (మెహ‌తాబ్ ఉన్న వార్డు)లోకి వెళ్తాన‌ని వార్డ‌ర్‌కు చెప్పాడు. అధికారులు అక్క‌డికే మార్చ‌డంతో జ‌కీర్‌కు త‌న ప్లాన్ అమ‌లు చేయ‌డం సులువుగా మారింది.

మెహ‌తాబ్ ఉన్న బ్యారెక్‌కు రెండు బ్యారెక్‌లు ఇవ‌త‌లే జ‌కీర్ బ్యారెక్ ఉంది. దీంతో రెండు మూడు రోజుల పాటు మెహ‌తాబ్ యాక్టివిటీల‌ను గ‌మ‌నించాడు. ఉద‌యం స‌మ‌యంలోనే త‌న స్కెచ్ అమ‌లు చేయ‌డం సుల‌వ‌ని నిర్ణ‌యించుకుని, సోమ‌వారం నాడు జైలు అధికారులు ఖైదీల‌ను మార్నింగ్ ప్రేయ‌ర్‌కు పిలిచిన స‌మ‌యంలో అందరూ బ‌య‌ట‌కు వెళ్ల‌గానే జ‌కీర్ వేగంగా మెహ‌తాబ్ బ్యారెక్‌లోకి దూరాడు. ప‌దునైన ఆయుధంతో మెహ‌తాబ్ మెడ‌, పొట్ట భాగంలో స్పీడ్ పొడిచాడు. అత‌డికి తీవ్ర గాయాలు కావ‌డంతో మెహ‌తాబ్ ర‌క్త‌పు మ‌డుగులోప‌డి మ‌ర‌ణించాడు. త‌న చెల్లెలికి జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారం తీర్చుకున్న జ‌కీర్ కేసు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. *ఇన్వేస్టిగేష‌న్‌లో జ‌కీర్‌కు, మెహ‌తాబ్‌కు ఉన్న లింక్ బ‌య‌ట‌ప‌డింది. 2014లో ఢిల్లీలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్ స్టేష‌న్‌లో న‌మోదైన జ‌కీర్ సోద‌రి రేప్ కేసులో మెహ‌తాబ్ నిందితుడు. అత్యాచార ఘ‌ట‌న‌లో బాధితురాలు ఆ త‌ర్వాత‌ ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించింది* అని చెప్పారు వెస్ట్ ఢిల్లీ డిప్యూటీ క‌మిష‌న‌ర్ దీప‌క్ పురోహిత్.

Latest Updates