టిక్ టాక్ మళ్లీ వచ్చేసింది

న్యూ ఢిల్లీ: ‘టిక్‌ టాక్‌’ వీడియోలు మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. భారత్‌ లో మళ్లీ గూగుల్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్లలో టిక్ టాక్ వచ్చేసింది. ఈ యాప్‌ పై మద్రాసు హైకోర్టు నిషేధం విధించిన క్రమంలో దాన్ని యాప్‌ స్టోర్ల నుంచి తీసేయాలని ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయగా.. అవి యూజర్లకు అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ యాప్‌ పై ఉన్న నిషేధాన్ని కొన్ని షరతులతో మద్రాసు హైకోర్టు ఇటీవల ఎత్తేసింది.

నిషేధం ఎత్తేసిన వారం రోజుల తర్వాత యాప్‌ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ‘నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. తమ క్రియేటివిటీని బయటపెడుతూ యూజర్లు టిక్‌ టాక్‌ ను వినియోగిస్తున్నారు. భారత యూజర్లకు మరింత మంచి సేవలను అందించడానికి మాకు వచ్చిన అవకాశం పట్ల గర్విస్తున్నాము. ఆ యాప్‌ లో మరిన్ని సేఫ్ ఫీచర్లను తీసుకొస్తాం’ అని తెలిపారు ఇటీవల టిక్‌ టాక్‌ ప్రతినిధులు.

ఈ యాప్‌ యువతను తప్పుదారి పట్టిస్తోందని, పలువురు సూసైడ్ చేసుకున్నారని తెలుపుతూ మదురైకి చెందిన ముత్తుకుమార్‌ అనే లాయర్ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. వెంటనే నిషేధం విధించాలని ఆయన కోరారు. దీంతో దీన్ని నిషేధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ టిక్‌ టాక్‌ ప్రతినిధులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా, వారి విన్నతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మదురై ధర్మాసనం.. ఈ యాప్‌‌ పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఇటీవల ఇది అమలైంది. వారం రోజుల క్రితం మళ్లీ అదే న్యాయస్థానం నిషేధాన్ని ఎత్తేసింది.

Latest Updates