సోమ‌వారం నుంచి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు: ఘాట్ రోడ్ టైమింగ్స్ మార్పు

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల దాదాపు రెండున్నర నెల‌లు నుంచి ర‌ద్ద‌యిన తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు సోమ‌వారం నుంచి మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయ‌ని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. తొలుత టీటీడీ ఉద్యోగులతో శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆయ‌న చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి స‌హా ప‌లువురు ఉన్నతాధికారులతో గురువారం ఆయ‌న సమీక్ష నిర్వ‌హించారు. సుమారు రెండు గంటలపాటు దర్శన ఏర్పాట్లపై చర్చించారు. ఆ త‌ర్వాత ఈవో అనిల్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ నిబందనల మేరకు ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు చేశామన్నారు. దర్శనాలు, ప్రసాదాల పంపిణి, అన్నదానం, ట్రాన్స్ పోర్టు, స్క్రీనింగ్ వంటి అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు తెలిపారు. తొలుత ప్ర‌యోగాత్మ‌కంగా మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగుల‌ను స్వామి ద‌ర్శ‌నానికి అనుమ‌తించి, ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం కల్పిస్తామ‌ని అన్నారు. దర్శనాలపై టీటీడీ చైర్మన్ రేపు (శుక్ర‌వారం) పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తారని చెప్పారు.

షాపులు, ఘాట్ రోడ్డు టైమింగ్స్ మార్పు

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాల‌ను పున‌రుద్ధ‌రిస్తున్న నేప‌థ్యంలో కొండ‌పై క‌రోనా వ్యాప్తికి ఆస్కారం లేకుండా అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటున్నామ‌ని టీటీడీ వెల్ల‌డించింది. ద‌ర్శ‌నానికి వెళ్లే స‌మ‌యంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపింది. కొండ‌పైకి భ‌క్తుల వాహ‌నాల‌ను తెల్ల‌వారు జామున 5 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కొండ‌పై దుకాణాల‌ను కూడా తెరిచేందుకు ష‌ర‌తుల‌తో అనుమ‌తి ఇస్తున్న‌ట్లు చెప్పారు. గ‌తంలో దాదాపు రోజంతా తెరిచే ఉండే షాపుల‌ను ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమతిస్తున్నామ‌న్నారు. విజిలెన్స్, రెవెన్యూ, హెల్త్ విభాగాలకు షాపుల్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తుల సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఒక్కో షాప్ లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంద‌న్నారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సిందేన‌ని,
ప్రతి దుకాణంలో శానిటైజర్ అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు. అయితే చాలా రోజులుగా దుకాణాలు మూసేసి ఉండ‌డంతో వ‌స్తువులు ఎక్స్ పైర్ అయ్యే అవ‌కాశం ఉండ‌డంతో వాటిపై ఆరోగ్య శాఖ‌కు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌న్నారు.

Latest Updates