తిరుమలలో కరోనా కలకలానికి తెర

తిరుమలలో కరోనా కలకలానికి తెర పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన దయా శంకర్‌ (65) అనే భక్తుడికి కరోనా టెస్టు నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ టెస్టు రిజల్ట్ రాకతో టీటీడీతో పాటు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

యూపీకి చెందిన చెందిన దయాశంకర్ అనే 65 ఏళ్ల వృద్ధుడు, మరో 109 మంది ఈ నెల 11న తీర్థయాత్రల కోసం ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా వారంతా తిరుమల చేరుకున్నారు. అయితే దయాశంకర్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరుపతిలోని స్విమ్స్ కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలిందని గురువారం రాత్రి అధికారులు ప్రకటించారు. దీంతో టీటీడీతో పాటు ఆ 109 మంది, వేలాది భక్తుల్లో నెలకొన్న భయం తొలగిపోయింది.

రోజూ వేలాదిగా తిరుమల కొండకు వచ్చే భక్తులకు కరోనా సోకకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా శ్రీవారి దర్శనాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం టీటీడీ ఈవో అనిల్ సింఘాాల్ ప్రకటించారు. యథావిధిగా శ్రీవారి కైంకర్యాలు, పూజలను అర్చకులు కొనసాగిస్తారని, భక్తుల దర్శనాన్ని మాత్రమే నిలిపేస్తున్నామని చెప్పారు. పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుని దర్శనం పున: ప్రారంభంపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామన్నారు.

Latest Updates