గందరగోళంలో తిరుమల శ్రీవారి కాలినడక భక్తులు

గందరగోళంలో తిరుమల శ్రీవారి కాలినడక భక్తులు

అలిపిరి నడకమార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శించుకునే భక్తులు గందరగోళంలో పడుతున్నారు. సమాచారం లేకుండా మరమ్మతులు చేపడుతుండటంతో నడకమార్గం మూతపడింది. దీంతో టీటీడీ ప్రత్యామ్నాయంగా చంద్రగిరి మండల పరిధిలోని శ్రీవారిమెట్టు మార్గం ద్వారా భక్తులను అనుమతించింది.

 నడకదారి మరమ్మతుల కారణంగా జూన్ 1వ తేదీ నుంచి జూలై 30 వ తేదీ వరకు మూతపడింది. అయితే నడకదారి భక్తులకు ప్రత్యామ్నాయంగా శ్రీవారిమెట్టు మార్గంలో అనుమతులిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. బస్ స్టాండ్, రైల్వే స్టెషన్ ల దగ్గర నుంచి శ్రీవారిమెట్టు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది. అయితే సరైన సమాచారం లేకపోవడంతో భక్తులలో గందరగోళం నెలకొంది. 

ఉచిత బస్సుల టైమింగ్, బస్ స్టాప్ వంటి సమాచారం లేకపోవడంతో శ్రీవారిమెట్టు వరకు భక్తులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఆటోవాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఏపీలో మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంది. ఇదే అదునుగా ఒక్కో ఆటో 500 రూపాయల నుంచి 600 వరకు డిమాండ్ చేస్తున్నారు. 22 కిలోమీటర్లు దూరానికి 600 డిమాండ్ చేస్తుండడంతో మరో మార్గం లేక ఆటోలనే ఆశ్రయించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.