జేసీబీతో పూడ్చిపెట్టడం తప్పే.. విధిలేని పరిస్థితుల్లో త‌ప్ప‌లేదు

తిరుపతి కమిషనర్ గిరీషా వివరణ

చిత్తూరు జిల్లా : క‌రోనాతో చనిపోయిన ఓ వ్య‌క్తి అంత్యక్రియ‌ల్ని మున్సిప‌ల్ సిబ్బంది.. జేసీబీ సాయంతో నిర్వ‌హించ‌డంపై తిరుపతి కమిషనర్ గిరీషా మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. కోవిడ్ తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో త‌మ‌ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించార‌ని, అది ముమ్మాటికీ తప్పేన‌న్నారు. విధిలేని పరిస్థితుల్లో సిబ్బంది అలా వ్యవహరించిన‌ట్టు త‌మ విచారణలో తేలింద‌ని చెప్పారు. మృతుడి శరీర బరువు అధికంగా ఉండడం, చుట్టుప్రక్కల ప్రజలు బయటకు రావడంతో జేసీబీని ఉపయోగించారని చెప్పారు. కుటుంబ సభ్యుల అనుమతితోనే యంత్రాలను ఉపయోగించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునారావృతం కాకుండా సిబ్బందిని అధిక సంఖ్యలో నియమిస్తామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు.

ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారమే కోవిడ్ తో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ వైర‌స్ తో చ‌నిపోయిన‌ 16మందిని గోవింద ధామంలోనే అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించామ‌ని గిరీషా చెప్పారు. చిత్తూరు జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లా వాసులను కూడా తిరుపతిలోనే అంత్యక్రియలు నిర్వహించామ‌న్నారు.

Latest Updates