తిరుపతి లడ్డూ రూ. 50

ఇప్పటికే సామాన్య, మధ్య తరగతి భక్తులు బస చేసే గదుల ధర ఏకంగా వందశాతం పెంచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇప్పుడు లడ్డూల(175 గ్రాములు) ధర పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు దివ్యదర్శనం, సర్వదర్శనం భక్తులకు రూ. 70కి నాలుగు లడ్డూలు ఇస్తుండగా ఇకపై రాయితీ తీసేసి ఒక్కో లడ్డూ రూ. 50 చొప్పున అమ్మాలని భావిస్తోంది. కొత్త ప్రతిపాదనలు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం కోసం పంపనుంది. మరోవైపు శ్రీవారి లడ్డూల అమ్మకాన్ని లాభాపేక్షతో చూడటంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 తిరుమల, వెలుగు: భక్తులు బస చేసే గదుల ధర ఏకంగా వందశాతం పెంచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇప్పుడు లడ్డూల(175 గ్రాములు) ధర పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాయితీపై రూ. 70కి 4 లడ్డూలు ఇస్తుండగా ఇకపై ఒక్కో లడ్డూ రూ. 50 చొప్పున అమ్మాలని భావిస్తోంది. కొత్త ప్రతిపాదనలు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం కోసం పంపనుంది.

ప్రస్తుత విధానం

అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో నడిచివచ్చే  దివ్యదర్శన భక్తులకు  ఒక ఉచిత లడ్డూ (175 గ్రాములు) ఇస్తున్నారు.  వీరికే సబ్సిడీ ధరతో  రూ.10 చొప్పున రూ.20కి రెండు లడ్డూలు, రూ.25 ధరతో మరో రెండు లడ్డూలు అందజేస్తున్నారు. నడిచి వచ్చే భక్తులు రూ.70 ధరతో  ఒక ఉచిత లడ్డూతోపాటు మరో నాలుగు లడ్డూలు పొందుతున్నారు. ఇక టైం స్లాట్​ టోకెన్లతో పొందే  సర్వదర్శనం, కంపార్ట్​మెంట్లలో వేచి ఉంటూ సర్వదర్శనం పొందేవారికి కాలిబాట భక్తుల తరహాలోనే రూ.70కి  ఉచిత లడ్డూ మినహా  నాలుగు లడ్డూలు టీటీడీ అందజేస్తోంది.

కొత్త ప్రతిపాదన

టీటీడీ  ప్రతిపాదించిన కొత్త  విధానంలో అందరికీ ఒక లడ్డూ మాత్రమే  ఉచితంగా అందజేస్తారు.  అదనంగా మరో 4 లడ్డూలు పొందాలంటే  రూ.200 ధర చెల్లించక తప్పదు. కొత్త విధానంలో కాలి నడకన వచ్చే భక్తులు ఐదు లడ్డూలు పొందాలంటే అదనంగా రూ. 130 చెల్లించాల్సి వస్తుంది.

సబ్సిడీ లడ్డూలతో రూ. 200 కోట్ల నష్టం

175 గ్రాముల ఒక లడ్డూ తయారు చేయడానికి  టీటీడీకి రూ.40 ఖర్చవుతోంది. ముడి సరుకుల  ధరల పెరుగుదలే  ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. సాధారణ రోజుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 60 వేల నుంచి 1.05 లక్షల వరకు ఉంటోంది. వీరిలో కాలిబాట భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ, కాలిబాట, సర్వదర్శనం భక్తులకు ఇచ్చే సబ్సిడీ ధరతో కూడిన లడ్డూలతో టీటీడీకి ఏటా రూ.200 కోట్లపైబడి నష్టం వస్తోందంటున్నారు.

ఇప్పటికే పెరిగిన పెద్ద లడ్డూ, వడల ధరలు

మూడేళ్ల క్రితమే కల్యాణోత్సవం లడ్డూ (750 గ్రాములు) ధర రూ.100 నుంచి రూ.200 పెంచారు. ఇక వడ రూ.25 నుంచి రూ.100కి పెంచారు. కోరినన్ని లడ్డూలు(175 గ్రాములు) కావాలనే భక్తులకు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.  అమాంతంగా పెరిగిన ధరల కారణంగా వీటిని సామాన్య భక్తులు పొందలేని పరిస్థితి ఉంది.

Latest Updates