లాయర్లు, పోలీసుల గలాట: మహిళా డీసీపీపై దాడి.. సీసీ కెమెరా వీడియో

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు దగ్గర నవంబరు 2న పోలీసులు, లాయర్ల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన సీసీటీవీ కెమెరా వీడియో బయటికొచ్చింది. ఆ గొడవలో లాయర్లు ఓ పోలీస్ వాహనానికి నిప్పు పెట్టడంతో వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో నార్త్ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్‌పై కొందరు దాడి చేశారు. గుంపుగా ఉన్న లాయర్లలో కొందరు ఆ మహిళా పోలీస్ అధికారిని లాక్కుని వచ్చారు. నలుగురైదుగురు కలిసి చేతులు అటు ఇటూ గుంజుతూ పరిగెత్తారు. ఆ విజువల్స్ అటు లాయర్లు.. ఇటు పోలీసులు.. రెండు వర్గాల్లోనూ కలకలం రేపాయి.

జుడిషియల్ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశం

నవంబర్ 2న తీస్ హజారీ కోర్టు దగ్గర పార్కింగ్ సమయంలో లాయర్, పోలీసు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో వారి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు మనుషుల మధ్య గొడవ కాస్తా లాయర్లు, పోలీసుల కొట్లాటగా మారింది. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. లాయర్లు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేశారు. కాల్పుల వరకు వెళ్లింది. ఈ గలాటలో లాయర్లు, పోలీసులు కలిపి 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది.

ఎంక్వైరీకి సహకరిస్తా

ఈ ఎంక్వైరీకి తాను సహకస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారికి వివరాలు అందజేస్తానని చెప్పారు డీసీపీ మోనికా భరద్వాజ్ తెలిపారు. ఆ రోజు ఒక్కసారిగా భారీగా చేరిన గుంపును కంట్రోల్ చేసే ప్రయత్నం చేశామని చెప్పారామె.

Latest Updates