అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?

TJS president kodanda ram, EX MP vivek venkataswamy questions to CM KCR

పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారు : కోదండరాం

ఎమ్మెల్యేల కొనుగోలులో ఉన్న ఆసక్తి సర్కార్ కు విద్యార్థుల మీద లేదు

రాష్ట్రంలో వన్ మ్యాన్ రూల్ నడుస్తోంది: వివేక్ వెంకటస్వామి

చదువుకుంటే ప్రాణాలు పోతాయనుకుంటే తమ పిల్లలను చదివించే వాళ్లమే కాదని తల్లిదండ్రులు చెబుతున్నారని TJS అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో విద్యార్ధి జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు , కొందరు విద్యార్ధి నేతలు పాల్గొన్నారు.

చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను కూలి పని చేసి చదివించారని, 10th లో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు ఇంటర్ లో తప్పినందుకు వారంతా ఆవేదన, ఆందోళన చెందుతున్నారన్నారు కోదండరాం. గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది పిల్లలు డబుల్ ఫీజులు కట్టారన్నారు. ఈ విషయంలో ముందు నుంచి ప్రభుత్వాన్ని  కాలేజీ ప్రిన్సిపాల్ లు హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని కోదండరాం అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఉన్న ఆసక్తి… ప్రభుత్వానికి ఇంటర్ విద్యార్థుల మీద లేదని ఆయన అన్నారు. గ్లోబరినా ప్రయోజనాల కోసం ప్రభుత్వ విద్యార్థుల జీవితాలను పొట్టన పెట్టుకుందన్నారు. వారు చేసిన తప్పిదాల వలన  9 లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయన్నారు. బోర్డులో జరిగిన అవకతవకలపై, ఈ నెల 29వ తేదీన ఇంటర్ బోర్డ్ ముందు ధర్నా చేయబోతున్నామని… విద్యార్దుల భవిష్యత్తు కోసం ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని తల్లిదండ్రులకు, విద్యార్ధి సంఘాలకు కోదండరాం పిలుపునిచ్చారు.

ఈ విషయంపై మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి  మాట్లాడుతూ.. ప్రభుత్వ తప్పిదం వల్లనే ఇంటర్ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని అన్నారు.  23 మంది విద్యార్ధుల ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు  బ్లాక్ లిస్ట్ లో ఉన్న గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎలా ఇచ్చిందని వివేక్ ప్రశ్నించారు.

విద్యార్ధుల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు వివేక్ వెంకటస్వామి. జరుగుతున్న పరిణామాలు అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వన్ మ్యాన్ రూల్ నడుస్తుందని, ప్రజాస్వామ్య సంస్థలు చట్టబద్ధంగా నడవడం లేదని వివేక్ అన్నారు. ఇటువంటి పరిణామాలపై కోదండరామ్ అందరినీ ఏకతాటి పైకి తెచ్చి మరో ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని వివేక్  అన్నారు.

Latest Updates