కాల‌నాగు కాటు: నిర్మ‌లా సీతారామ‌న్‌పై తృణ‌మూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్య‌లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న‌గా ప‌శ్చిమ బెంగాల్‌లోని బంకురాలో చేప‌ట్టిన ఆందోళ‌న సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నిర్మ‌లా సీతారామ‌న్‌ను కాల నాగుతో పోల్చారు. ఈ విష స‌ర్పం కాటు వేస్తే ప్ర‌జ‌లు ఎలా మ‌ర‌ణిస్తారో.. కేంద్ర ఆర్థిక మంత్రి వల్ల కూడా అలానే ప్రాణాలు కోల్పోతున్నార‌ని అన్నారు. మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆమె నాశ‌నం చేశార‌ని, దీనికి బాధ్య‌త వ‌హిస్తూ ఆర్థిక మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బెన‌ర్జీ డిమాండ్ చేశారు. ప్ర‌పంచంలోనే ఇంత‌టి అస‌మ‌ర్థ ఆర్థిక మంత్రిని ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌లేద‌న్నారు. పెట్రోల్ ధ‌ర‌లు పెంపు, రైల్వేల్లో ప్రైవేటుకు అనుమ‌తి ఇవ్వ‌డాన్ని క‌ల్యాణ్ బెన‌ర్జీ త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపైనా ఆయ‌న ఈసంద‌ర్భంగా విమ‌ర్శ‌లు చేశారు. న‌వ భార‌తాన్ని నిర్మిస్తాన‌ని ప్ర‌ధాని మోడీ చెప్పార‌ని, కానీ ఆయ‌న జీడీపీ వృద్ధి రేటును అట్ట‌డుగుకు నెట్టేశార‌ని అన్నారు.

సెన్స్‌లెస్ కామెంట్స్ అంటూ తిప్పికొట్టిన బీజేపీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై తృణ‌మూల్ నేత క‌ల్యాణ్ బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ తిప్పికొట్టింది. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో న‌లిగిపోతోంద‌ని, ఈ ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియ‌కుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్. సెన్స్‌లెస్ కామెంట్స్‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆ పార్టీపై, పార్టీలోని నేతల‌పై ప‌ట్టుకోల్పోయార‌ని, తృణ‌మూల్‌లో పైనుంచి కింది స్థాయి వ‌ర‌కు అవినీతితో నిండిపోయింద‌ని ఆరోపించారు. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌య్యాయ‌ని, ఆ ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియ‌డం లేద‌న్నారు.

Latest Updates