పెన్షన్ పై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి : ఢిల్లీలో TNGOలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ జంతర్ మంతర్ లో అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సంఘం భారీ ధర్నా చేసింది. రాష్ట్రం నుంచి 400మంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగులు పాల్గొన్నారు. కాంట్రిబ్యూటరీ విధానం రద్దు చేయాలని కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్న ఉద్యోగులు.. గతంలో 19 రోజుల పాటు ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి తమ డిమాండ్లను కేంద్రం ముందుంచామని చెప్పారు టీఎన్జీఓ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డి. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు గత 15 సంవత్సరాలుగా ఉద్యోగులకు నష్టం చేసే నిర్ణయాలే తీసుకుంటున్నాయని అన్నారు.

ఈసారి 6 ప్రధాన డిమాండ్లతో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామనీ.. ఈ ధర్నాలో దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి ఉద్యోగులు హాజరయ్యారని చెప్పారు సంఘాల నాయకులు. కొత్త పిన్షన్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. ఉద్యోగులకు రూ.10 లక్షల వరకు ఐటీ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కానీ, రూ.5 లక్షల వరకే మోడీ సర్కార్ మినహాయింపు ఇచ్చిందని.. ఉద్యోగులు తమ 3 నెలల జీతాన్ని ఐటీ రూపంలో చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.

ఇప్పుడున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని… భవిష్యత్తులో ఈ పద్ధతిలేకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని మరింత బలపరుస్తోందని అన్నారు. లక్షా 23 వేల మంది ఉద్యోగులు కేంద్ర నిర్ణయాలతో నష్ట పోతున్నారనీ.. 30  సంవత్సరాలు ఉద్యోగం చేస్తే, కనీసం రూ.3 వేల పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా కొత్త పెన్షన్ విధానంలో లేదని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉద్యోగుల పక్షాన నిలిచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనీ… పెన్షన్ విధానం అమలుపై నిర్ణయాధికారం.. రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని డిమాండ్ చేశారు.

Latest Updates