RTC సమ్మెకు TNGO, TGO సంఘాల మద్దతు

RTC కార్మికులు, ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించాయి తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాలు. ఇవాళ టీఎన్జీఓ భవన్ లో TNGO, TGO నాయకులతో TSRTC జేఏసీ నాయకులు చర్చలు జరిపారు. న్యాయపరమైన సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. దీంతో.. సమ్మెకు మద్దతు ఇస్తున్నామని TNGO, TGO సంఘాల అధ్యక్షులు కారెం రవీందర్ రెడ్డి, మమత ప్రకటించారు.

గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఖమ్మం, హైదరాబాద్ లో డ్రైవర్-కండక్టర్ల బలిదానాలు తమను కలిచివేశాయని చెప్పారు కారెం రవీందర్ రెడ్డి. సకల సంఘాలు, పార్టీలు అందరూ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకడంతో.. తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకే ఇవాళ ఆర్టీసీ నాయకులను పిలిచి మాట్లాడామని చెప్పారు. ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ తాము రేపు బుధవారం సీఎస్ ను కలవబోతున్నట్టు చెప్పారు. 

తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించిన TNGO, TGO ఉద్యోగ సంఘాలు.. ఆర్టీసీ సమ్మెలోనూ అదే పాత్ర పోషించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. తమ పోరాటంలో కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

RTC సమ్మెపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు TNGO రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిని పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

Latest Updates