కరెంటు పోల్​ ఎక్కడం కోసం.. కోర్టు మెట్లెక్కి గెలిచింది

పోటీ పెట్టి చూడండని ముందుకొచ్చిన ఈతరం అమ్మాయిలు

ఇండియాలో 99.92 శాతం పల్లెలకు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది. 99.93 శాతం ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఉంది. వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ తో దేశం వెలిగిపోవాలనుకుంటుంటే ఈ వెలుగుల్లో కి ఆడవాళ్లు రావద్దని అధికారులంటున్నారు. డ్యూటీకి ఎప్పుడంటే అప్పుడు రాలేరు. కరెంటు స్తం భం చకచకా ఎక్కలేరని ఆడవాళ్లు జూనియర్ లైన్ మెన్ (జేఎల్ ఓ) జాబ్స్​కి ఎలిజిబుల్ కాదంటన్నారు ఎస్పీడీసీఎల్ ఆఫీసర్స్. ఇదేమి న్యాయం? పోటీ పెట్టి చూడండని ఈ తరం అమ్మాయిలు ముందు కొచ్చారు.

కరెంటే కాదు రూల్స్​ కూడా షాక్​ కొడుతున్నాయ్​!  కాకపోతే అందరికీ కాదు ఆడవాళ్లకు మాత్రమే! కరెంటు పోల్​ ఎక్కడం కోసం కోర్టు మెట్లెక్కి గెలిచింది. రూల్స్​ పెట్టిన ప్రభుత్వానికే షాక్​ ఇచ్చింది!  ‘స్థంభాలెక్కుతా.. జీవితంలోని చీకట్లను వెలిగిస్తా’ అంటోంది తండా ఆడబిడ్డ వాంకుడోతు భారతి.

జనగామ జిల్లాలోని సుతారిగడ్డ తండాలో పుట్టి పెరిగింది వాంకుడోత్​ భారతి. చిన్నప్పటి నుంచి చేలల్లో పనిచేస్తూనే కష్టపడి చదివింది. బీకామ్​ చదువయ్యాక ఐటీఐ (ఎలక్ర్టికల్) పూర్తి చేసింది. పెద్దవాళ్లు.. మహబూబాబాద్​ జిల్లాలోని దేశ్యాతండా (వెలికట్ట)లో ఉండే మాలోత్​ మోహన్​ సింగ్​తో 2011లో పెండ్లి చేశారు.

ఎన్నో పరీక్షలు.. 

మోహన్​ కూడా చదువుకున్నవాడే. ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎంఈడీ, ఎంసీఏ చదివినా తనకూ ఉద్యోగం రాలేదు. ఉన్న మూడెకరాల భూమిలో ఇద్దరూ కష్టపడుతున్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలయ్యారు. పిల్లల బాధ్యత భార్యకి అప్పజెప్పి ఉద్యోగం కోసం భర్తలు ప్రిపేర్​ అవుతారు. కానీ మోహన్​ మాత్రం తాను పిల్లల్ని చూసుకుంటూనే ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యాడు. భారతికి మాత్రం వరంగల్​లో కోచింగ్​ ఇప్పించాడు. వీఆర్​ఓ, పంచాయితీ కార్యదర్శి,  గ్రూప్​ ఫోర్​ ఉద్యోగాల కోసం ట్రై చేసింది. కానీ రాలేదు. పోలీసు ఉద్యోగానికి ఎత్తు అడ్డొచ్చింది. అయినా సరే ఏదో ఒక ఉద్యోగం సాధించాలని భారతి కష్టపడుతూనే ఉంది. ఆమె పట్టుదలకు ప్రోత్సాహమే తప్ప ఆటంకం లేదు ఆ ఇంట్లో.

సంతోషాలు స్విచాఫ్​

వాన పడితే వరిపొలం. వానల్లేకుంటే పత్తి పంట. ఇలా సాగిపోతోంది మోహన్​, భారతి జీవితం. పగలు పంటచేలో, రాత్రి పుస్తకాల్లో తలమునకలైపోయింది భారతి. ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో చదువుతూనే ఉంది.  ఏడాది కిందట.. ఎస్పీడీసీఎల్​ తెలంగాణ రాష్ర్ట దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలో జూనియర్​ లైన్​ మెన్​ (జేఎల్ఎం) ఉద్యోగాలకు  నోటిఫికేషన్​ పడింది. ఊళ్లలో ఉండే కరెంటు స్తంభాలకు పవర్​ సప్లై చూసుకోవడం జేఎల్​ఓల బాధ్యత. ఎండైనా, వానైనా, రాత్రైనా, పగలైనా చేయాల్సిన ఉద్యోగం. కష్టానికి భయపడలేదామె. చెట్లు ఎక్కడం, ఎండలో, వానలో పని రైతు బిడ్డలకు తేలికైనదే. భారతి జేఎల్​ఎం పోస్ట్​కి అప్లై చేసింది. పరీక్ష రాసింది. క్వాలిఫై అయింది. కరెంటు బుగ్గ చీకటి గదిలో వెలుగులు పంచినట్లు ఆ ఇంట్లో సంతోషం విరిసింది. పవర్​ కట్​ ఇంటిని చీకటి పాలు చేసినట్టే రూల్స్​ ఆ సంతోషాన్ని స్విచాఫ్​​ చేసినయ్. క్వాలిఫై అయిన అబ్బాయిలందరికీ పోయిన ఆగస్టు చివరి వారంలో  పోల్​టెస్ట్​ పెట్టారు. కానీ అమ్మాయిల్ని పిలవలేదు. తనలా క్వాలిఫై అయిన అమ్మాయిలతో కలిసి భారతి హైకోర్టు మెట్లెక్కింది. ‘ఆడవాళ్లు అంతరిక్షంలోకి పోతున్న రోజుల్లో కరెంటు స్తంభం ఎక్కలేరు అంటున్నారేంటి?’ అని న్యాయపోరాటం మొదలుపెట్టింది.

రేపటిని వెలిగిస్తం

పిడుగుపడి ట్రాన్స్​ఫార్మర్లు పేలిపోతాయ్​. ట్రిప్​ అయి పవర్​ సప్లై ఆగిపోతుంది. గాలివానకు లైన్​ తెగిపోతే పవర్​ సప్లై ఆగిపోతుంది. ఆగమేఘాల మీద పోయి పవర్​ సప్లై చేయాలె. రాత్రీ, పగలూ చేయాల్సిన డ్యూటీ ఇది. ఆడవాళ్లు చేయలేరు. పోల్​ ఎక్కి పని చేయలేరని కోర్టులో వాదించింది గవర్నమెంట్. ట్రాన్స్​కోలో 33 శాతం ఉద్యోగాలు ఆడవాళ్లకు ఇచ్చారు. అక్కడ ఎప్పుడూ పవర్​ సప్లైకి ఇబ్బంది రాలే. ఇప్పుడే ఎందుకొస్తుందనేది భారతి వాదన. వాదోపవాదాల్లో భారతి, ఆమెతోపాటు కోర్టుకి వెళ్లిన మరో క్యాండిడేట్​ శిరీష గెలిచారు. ఆడబిడ్డలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్​ అమలు చేయాలని కోర్టు చెప్పింది. ‘స్తంభం ఎక్కుతం. కరెంటు బుగ్గ ఎలిగిస్తం’ అని భారతి అంటోంది. రేపటి పోల్​ టెస్ట్​ కోసం భారతి ఊళ్లో ప్రాక్టీస్​ మొదలుపెట్టింది. తనతోపాటు క్వాలిఫై అయిన ఇంకో పది మంది వరకు ఆడవాళ్లు ఉన్నారట. ‘‘వాళ్లు కూడా ప్రాక్టీస్​ చేయాలి.  సక్సెస్​ కావాలి. కరెంటు ఆఫీసుల్లో కొత్త వెలుగులు నింపాలి’’ అని అంటోంది భారతి.

పంటచేలే పాఠశాల
‘నాట్లు వేసిన, కలుపు తీసిన, కోత కోసిన. కట్టెలు నరికిన. వాటి కంటే స్తంభం ఎక్కడం కష్టమేం కాదు. రైతు జీవితం కంటే కష్టమా ఇయ్యన్నీ. వ్యవసాయంకష్టపడటం నేర్పిస్తుంది. దానితోపాటు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ధైర్యం రేపు గెలుపునిస్తుంది-వాంకుడోత్ భారతి

ఆడపిల్లలు చదివే కోర్స్​ చెయ్యమన్నరు

జూనియర్​ లైన్​మెన్​ పోస్ట్​ కోసం పరీక్ష రాసి కోర్టుకి వెళ్లిన వాళ్లలో పబ్బూరి శిరీష కూడా ఉంది. సిద్దిపేట జిల్లాలోని గణేష్​పల్లి (మర్కూక్​ మండలం) వాళ్ల ఊరు. శిరీష తల్లి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదివిస్తోంది. ఒక పక్క గజ్వేల్​లో బీకామ్​ చదువుతూనే జూనియర్​ లైన్​ మెన్​ పోస్ట్​ కోసం పరీక్ష రాసింది. క్వాలిఫై అయింది శిరీష.  పదో తరగతి పాస్​ అయిన వెంటనే ఐటీఐలో ఎలక్ట్రికల్​ కోర్సులో చేరింది. ఆ కోర్సు చేరడానికి పోయినప్పుడు ‘ఇక్కడ అందరూ అబ్బాయిలే ఉంటారు. టైలరింగ్​, బుక్​ బైండింగ్​ లాంటి కోర్సులు ఆడపిల్లలకు బాగుంటాయి’ అని సలహా ఇచ్చిండు ఆ కాలేజి ప్రిన్సిపాల్​. ‘నేను ఎలక్ట్రికల్​ కోర్సే చేస్తాను. ఆ పని నాకు తెలుసు. మా మామయ్య శేఖర్​ ఎలక్ట్రికల్​ చదివిండు. లైన్​మెన్​ జాబ్​ చేస్తుండు. మా మామయ్య చేసే పని చేయాలనిపించింది. అందుకే ఈ కోర్సులో చేరాలని వచ్చిన’ అన్నది శిరీష. తను అనుకున్న గోల్​ని చేరుకునేందుకు ఇగ ఎంతో దూరం లేదు. ::: నాగవర్ధన్​ రాయల

 

Latest Updates