ఎటు చూసినా.. టు లెట్​ బోర్డులే

హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఉండే అమీర్ పేట్, గాంధీ నగర్, అశోక్ నగర్​లో లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి అవన్నీ మూతపడే ఉన్నాయి. ఒక్క గాంధీ నగర్ లోనే  స్టడీ సెంటర్లుగా మారిన 300కి పైగా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఖాళీగా మారాయి. కోచింగ్ సెంటర్లను ఆధారంగా చేసుకుని నడిచే 318 హాస్టళ్లు క్లోజ్​ అయ్యాయి. ఎటుచూసినా తెరుచుకోని మెస్​లు, టూ లెట్ బోర్డుతో సింగిల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్, వెలుగు వేగంగా విజృంభిస్తున్న కరోనాతో హైదరాబాద్​ ఖాళీ అవుతోంది. బస్తీలు, కాలనీలు, కమర్షియల్ ఏరియాలు అనే తేడా లేకుండా టు లెట్, లీజ్ బోర్డులు వేలాడుతున్నాయి. స్టూడెంట్స్, వర్కింగ్ మెన్, విమెన్​ హాస్టళ్లతో సందడిగా ఉండే ప్రాంతాలన్నీ బోసిపోయాయి. రంగు రంగుల లైట్లు, గాజు గోడలతో ఎట్రాక్ట్​చేసే కమర్షియల్ ఏరియాల్లో నెలలు గడుస్తున్నా… లీజులకు ముందుకొస్తలేరు. లాక్​డౌన్ మొదలు బస్తీల్లో 30శాతానికి పైగా ఇళ్లు ఖాళీ అయ్యాయి. కాలనీల్లో ప్రతి 100 ఇండ్లలో పదుల సంఖ్యలో టు లెట్ బోర్డులు ఊగుతున్నాయి.

సొంతూళ్లకు చిరుద్యోగులు

కోటికిపైగా జనాభా ఉన్న మహా నగరంలో 28లక్షల
కుటుంబాలున్నాయి. అందులో 60శాతానికి పైగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చినవారే. ఇంటి యజమానుల కంటే అద్దెకుండే వాళ్లే ఎక్కువ. చిరుద్యోగులు, బిజినెస్​ కోసం వచ్చిన వారిలో చాలామంది 3 నెలల నుంచి పనులు, గిరాకీ లేక సొంతూళ్లకు వెళ్లిపోయారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ఉన్న ఫళంగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇప్పటిదాకా 6 నుంచి 7 లక్షల మంది వెళ్లిపోయినట్లు అంచనా. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో పని చేసే ఉద్యోగులు 10 లక్షల మందికిపైగా ఉండగా, అన్ని కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం అమలవుతోంది. అలా సిటీలో ఇండ్లు, రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

హాస్టళ్లు బంద్​

హయ్యర్ స్టడీస్, జాబ్ ప్రిపరేషన్, సెర్చింగ్ కోసం నగరానికి వచ్చేవాళ్లు మొదట చూసుకునేంది హాస్టళ్లు, పీజీ సెంటర్లు. లాక్​డౌన్​తో బంద్​ పెట్టిన 13 వేల హాస్టళ్లలో సగానికిపైగా తెరుచుకోలేదు. బిల్డింగ్ అద్డె కట్టలేక వ్యాపారం నుంచి తప్పుకొనే వాళ్లు ఎక్కువవుతున్నారు. అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాంధీనగర్, అశోక్ నగర్, దిల్​సుఖ్​నగర్ ​వంటి ఏరియాల్లో పెద్దసంఖ్యలో హాస్టళ్లు క్లోజ్​అవుతున్నాయి. గతంలో హాస్టల్, సింగిల్ బెడ్రూం ఇండ్ల కోసం డైలీ 30 మంది ఫోన్​ చేస్తే.. ఇప్పుడు ఒకటి, రెండు కాల్స్​ మించి రావడం లేదని గాంధీనగర్​కు చెందిన రెంటల్ ఏజెంట్ రాము తెలిపారు. రెసిడెన్షియల్ ఫ్లాట్లను కమర్షియల్​గా వినియోగించేందుకు కోటిపైగా ఇన్వెస్ట్ చేసినవాళ్లు లాక్ డౌన్​తో లబోదిబోమంటున్నట్లు చెప్పారు.

 

 

Latest Updates