రియల్ మార్కెట్​కు.. మూఢాలు కలిసొస్తున్నయ్​

మే వరకు మంచి ముహుర్తాలు లేకపోవటమే కారణం

ధర పెరిగే అవకాశం ఉన్న వాటికి ఫుల్ బుకింగ్స్

“మణి కుమార్ ఐటీ ఎంప్లాయ్. రూ. 80 లక్షల బడ్జెట్ లో సింగిల్ టైమ్ సెటిల్ మెంట్ ఇంటికోసం వెతికాడు. రెడీ టూ మూవ్ ఫ్లాట్ కావాలంటే భారీగా రేటు చెప్పారు. దీనికి తోడు 5 నెలల పాటు మూఢాలు ఉన్నాయి. దీంతో అతడు ఐదు నెలల తర్వాత నిర్మాణం పూర్తయ్యే విధంగా ఉన్న అండర్ కన్ స్ట్రక్షన్ ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. ఒకేసారి మొత్తం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకపోగా రూ. 5 లక్షలకు తక్కువకే ఫ్లాట్ సొంతం చేసుకున్నాడు.’’

హైదరాబాద్, వెలుగు :  మూఢాలు కూడా  రియల్ మార్కెట్ కు కలిసి వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్,  నాలుగు నెలలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఈ ఎఫెక్ట్  ఏడాది పాటు ఉంటుందని రియల్ వ్యాపారులు అంచనా వేశారు. పైగా ఈసారి మే వరకు మంచి ముహుర్తాలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్​ పుంజుకోవడం కష్టమేనని భావించారు. అయితే వచ్చే ఐదు నెలల నాటికి కన్ స్ట్రక్షన్ పూర్తయ్యే ఫ్లాట్లపై కొనుగోలుదారులు ఇంట్రెస్ట్​చూపుతున్నారు. ధర ఎక్కువగా ఉండే రెడీ టూ మూవ్ ప్రాజెక్టులను వదిలి 5 నెలల నుంచి ఏడాది లోపు పూర్తయ్యే వాటిని సెలక్ట్ ​చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లాట్ హ్యాండోవర్​ చేసినా మూఢాల కారణంగా గృహ ప్రవేశం చేసే చాన్స్​లేదు. దీంతో కాస్తా  తక్కువ ధరకు వచ్చే అండర్ కన్ స్ట్రక్షన్ ఫ్లాట్లను కొనుగోలు చేయడమే బెస్ట్ ఛాయిస్  అనుకుంటున్నారు. ఈలోపు అగ్రిమెంట్లు, బ్యాంకింగ్, పే​మెంట్ వ్యవహారాలతో పాటు ఒకవేళ ధరలు పెరిగినా ఎఫెక్ట్​ పడని ఫ్లాట్లను బుక్​ చేసుకుంటున్నారు.

అండర్​ కన్ స్ట్రక్షన్ ఫ్లాట్లను..

కరోనా తర్వాత మెటీరియల్, లేబర్ కాస్ట్, ఇతర కారణాలతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. దీంతో రెడీ టూ మూవ్ ఫ్లాట్ల రేట్లను బిల్డర్లు పెంచేశారు.  ఐదు నెలల తర్వాత నచ్చిన ప్రాజెక్టు ధర ఎలా ఉంటుందోనని కొనుగోలు చేసే వాళ్లు ముందుగానే ఆలోచిస్తున్నారు. అండర్ కన్ స్ట్రక్షన్ ఫ్లాట్లను ఇప్పుడే కొనుక్కుంటే రేట్లు ఫ్యూచర్ లో ఎంత పెరిగినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. పైగా ఇప్పుడే ఫ్లాట్లు బుక్ చేసుకుంటే పే​మెంట్ కూడా తక్కువ ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు.  కొనేందుకు ఇదే మంచి అవకాశమని పేర్కొంటున్నారు.  నిర్మాణ రంగంలో ఏడాదికి పదిశాతం వరకు మెటీరియల్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆరు నెలలు వెయిట్ చేస్తే కనీసం ఐదు నుంచి ఆరు లక్షల భారం ఎక్కువ పడే పరిస్థితి ఉంది. ఇప్పుడే రెడీ టూ మూవ్ ఫ్లాట్ తీసుకుంటే మరో ఐదు నెలలు వెయిట్ చేయాల్సిందే. ఈ కారణంగా వచ్చే మే నాటికి పూర్తయ్యే  ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది.

ఇన్వెస్ట్ చేసే వారికిదే మంచి చాన్స్

రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. ఇలాంటి సంక్షోభ సమయంలోనే పెట్టుబడి పెట్టి, లాభాలను పొందొచ్చు.  ఒకేసారి మొత్తం చెల్లించకుండా టోకెన్ అమౌంట్ తో అగ్రిమెంట్ చేసుకుని, 5 నెలల తర్వాత అమ్ముకుని ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. దీంతో కొంతమంది ఇన్వెస్టర్లు నిర్మాణంలోనే ఇళ్లను కొంటున్నారు. పక్కా అగ్రిమెంట్లతో, అవసరమైనప్పుడు అమ్ముకునేలా బిల్డర్లతో అగ్రిమెంట్ ​చేసుకుంటున్నారు.  ఇటీవల అమీన్ పూర్ లోని ఓ ప్రాజెక్టులో సేల్స్ జరుగుతుండగా, హ్యాండోవర్ కు మరో ఏడాది టైం ఉంది. చదరపు అడుగుకు మార్కెట్ ప్రైజ్ కంటే రూ. 250 తక్కువతో ఆఫర్ చేశారు. నెల రోజుల వ్యవధిలోనే 16 ఫ్లాట్లను అమ్మేశారు. ఈ ఏడాదిలో ధరలు పెరిగితే, అవసరాన్ని బట్టి ఇంటిని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందని బిల్డర్లు చెబుతున్నారు.

సెంటిమెంట్లు ఎక్కువే..

రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. ప్లాట్ విజిటింగ్ నుంచి ఇంట్లోకి వెళ్లే దాకా మంచిరోజులు చూస్తుంటారు. అయితే గృహప్రవేశానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఇతర కొనుగోళ్లకు సంబంధించి మూఢాలు ఉన్నా పెద్దగా పట్టింపులు ఉండవు. అందుకే అల్రెడీ నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈసారి ఐదు నెలల మూఢాలు రావడం కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లకు మేలే అయిందని బిల్డర్లు పేర్కొంటున్నారు.

ఇన్వెంట్రీ లేదు

కరోనా కారణంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్​ కంటే నిర్మాణం పూర్తయిన ప్రాపర్టీ క్లియరెన్స్​కు బిల్డర్లు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇన్వెం టరీ ఖాళీ అయిపోయింది. ఈ కారణంగానే అండర్ కన్ స్ట్రక్షన్​లో ప్రాజెక్టులకు డిమాండ్ వచ్చింది. ఐదు నెలలపాటు సుదీర్ఘంగా ఉండే మూఢాలను బిల్డర్లు ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. నిర్మాణ దశలో ఉన్న ప్పుడే ప్లాట్ బుక్ చేసుకుంటే కొనుగోలు దారుడికి కాస్త ధర తక్కువకే వస్తుంది. – రామచంద్రారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్.

అండర్ కన్ స్ట్రక్షన్ ప్రాజెక్ట్​లు అడుగుతున్నరు

కరోనా తర్వాత మార్కెట్ ఉండదని భావించాం. కానీ సొంతింటి కొనుగోళ్లు పెరిగాయి.  ధర తక్కువగా ఉండి, మంచి లొకేషన్, ప్రైజ్ పెరిగేందుకు అవకాశాలు ఉంటే టోకెన్ అమౌంట్ పే చేసి నాలుగు నెలల తర్వాత హ్యాండోవర్ చేసేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. గృహ ప్రవేశానికి  దాదాపు ఆరు నెలల టైమ్ ఉండడంతో ఒకేసారి భారీ మొత్తంలో  చెల్లించేందుకు ఆలోచిస్తున్నారు. ఫ్రీ లాంచింగ్, అండర్ కన్ స్ట్రక్షన్ లోని ప్రాజెక్టుల కోసమైతే కొనుగోలుదారులు అడుగుతున్నారు. –సుధాకర్ రావు, రియల్ ఎస్టేట్ ఏజెంట్.

ఇవి కూడా చదవండి

జడ్చర్ల నుంచి జపాన్ వరకు..

రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం

Latest Updates