పత్తికి పొగాకు లద్దె పురుగు ..కాత దశలో తీవ్ర నష్టం

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న పత్తిపంటను పొగాకు లద్దెపురుగు దెబ్బతీస్తోంది. పలు జిల్లాల్లో పంటను తీవ్రంగా నష్ట పరుస్తోంది. రోజు రోజుకు పత్తిపంటపై లద్దెపురుగు ఉద్ధృతి పెరిగిపోతోంది. ఈ పురుగు నల్గొండ, ఆదిలాబాద్‌‌, వరంగల్‌‌ అర్బన్‌‌, వరంగల్‌‌ రూరల్‌‌, మహబూబాబాద్‌‌, జయశంకర్‌‌ భూపాలపల్లి, జనగామ జిల్లాల పరిధిలోని పత్తిపంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌‌ ప్రారంభం నుంచి వర్షాలు కురియడంతో పత్తి పంటను గణనీయంగా సాగు చేశారు.  పత్తి పంట 60.16 లక్షల ఎకరాల సాగు టార్గెట్‌‌ పెట్టగా రైతులు దాదాపు టార్గెట్‌‌కు దగ్గరగా వచ్చారు. పంట వేసి నాలుగు నెలలు కావస్తుండడంతో ప్రస్తుతం పూత, కాయ, కాయ పగిలే దశలలో ఉంది. కీలకమైన ఈ దశలో లద్దెపురుగు ఆశించడం ఆందోళన కలిగిస్తోంది.

బీటీ పత్తిపైనా లద్దెపురుగు దాడి

అందరూ బీటీ పత్తి విత్తనాలు వాడుతున్న నేపథ్యంలో  కొన్నేళ్లుగా లద్దెపురుగు కనిపించలేదు. బీటీ వాడడానికి ముందు ఈ పురుగు  వ్యాప్తి విపరీతంగా ఉండేది. 2006 నుంచి దేశంలో బీటీ వాడకం పెరిగాక లద్దెపురుగు ప్రభావం తగ్గింది.  ఈసారి ప్రభుత్వం గత ఏడాది కంటే పెద్ద మొత్తంలో పత్తి సాగు చేయాలని టార్గెట్‌‌ విధించడంతో 45 నుంచి 50 లక్షల వరకు సరిపడే బీటీ విత్తనాలను మాత్రమే సిద్ధం చేశారు. విత్తనాల కొరత ఏర్పడడం, ఇదే అవకాశంగా రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టినట్లు సమాచారం. దీంతో పొగాకు లద్దె పురుగు మళ్లీ ప్రత్యక్షమైంది. వర్షాలకు పప్పు ధాన్యాల పంటలు పూర్తిగా పోవడం, మరోవైపు అంతా బీటీ విత్తనాలు వేయడంతో ఈ పురుగులు బీటీ పంటను కూడా తట్టుకుంటున్నాయి. బీటీ విత్తనాలు లక్షణాలను కోల్పోవడం వల్ల లద్దె పురుగు వ్యాప్తి పెరుగుతోందా లేక నకిలీ విత్తనాల చలామణి వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా అన్నది తేల్చాల్సి ఉంది.

సాగుతోపాటూ ఇబ్బందులూ పెరిగాయ్​

రాష్ట్రంలో ఈసారి పత్తి  సాధారణం కంటే 30 శాతం అధికంగా సాగైంది. సాధారణ సాగు 44.50 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 59.94 లక్షల ఎకరాల్లో  సాగు చేస్తున్నారు. గత నెల నుంచి ఇప్పటివరకు కురిసిన వర్షాలు పత్తి పంటకు నష్టాన్ని కలిగించాయి. పలు జిల్లాల్లో వేలాది ఎకరాలు నీటిలో మునిగిపోవడం, చేలలో నీరు చేరడం, ఇసుక మేటలు వేయడం తదితర కారణాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు  రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో  లద్దెపురుగు వ్యాప్తి పెరగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వ్యవసాయశాఖ, అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీ అధికారులు సూచనలు చేసి విపత్తు నుంచి గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు.

Latest Updates