రామసక్కని మందిరానికి నేడే భూమిపూజ

పురిటిగడ్డ ఒడిలోన.. సరయూ నది తీరాన..రామయ్యకు గుడి. .. అదో శతాబ్దాల కల. ఆ కల నిజమయ్యే యాళ్ల రానే వచ్చేసింది. అయోధ్యాపురి అందంగా ముస్తాబైంది. పుట్టిన ఘడియలోనే రాములోరి మందిరానికి భూమి పూజ జరుగనుంది. కోటాను కోట్ల భక్తుల రామనామ జపం మార్మోగంగ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా గుడికి పునాది పడనుంది. అయోధ్య రామ మందిరం డిజైన్ను మంగళవారం శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విడుదల చేసింది. 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. భూమి పూజ కార్యక్రమం ముగియగానే.. నిర్మాణ పనులు వేగంగా సాగనున్నాయి. రెండు మూడేండ్లలో మందిర నిర్మాణం పూర్తి కానుంది.

ఇంకొద్ది గంటల్లో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగబోతున్న తరుణంలో మందిరం నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మంగళవారం విడుదల చేసింది. మన వాస్తు శిల్పకళా నైపుణ్యాన్ని చాటేలా రాతి కట్టడాలు, గోపురాలు, భారీ డోమ్‌తో అత్యంత అద్భుతంగా ఆలయం డిజైన్ కనబడుతోంది. తొలుత అనుకున్న పరిమాణం కన్నా రెట్టింపుగా కొత్త నమూనా అభివృద్ధి చేశామని ఆర్కిటెక్ట్‌ వెల్లడించారు. ఆలయం ఎత్తును ముందు అనుకున్న దానికన్నా 20 అడుగులు పెంచినట్టు తెలిపారు. ఆలయంలో ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చని అంటున్నారు. రామసక్కని ఉత్తరాది నగర స్టైల్‌లో టెంపుల్‌ నిర్మాణం 161 అడుగుల ఎత్తు , మూడంతస్తుల్లో కట్టడం

శిల్పాల్లో రామ కథ

అయోధ్యలోని రామ మందిరం దగ్గర రామ కథను ప్రతిబింబించే (రామ కథా కుంజ్‌) శిల్పాలు రెడీ చేయనున్నారు. ఇందుకోసం అస్సాంకు చెందిన శిల్పి రంజిత్‌ మండల్‌ పని చేస్తున్నారు. అయోధ్యలో ఉన్న 67 ఎకరాల రామ మందిర్ పరిషార్‌లో ఆయన తన పని కొనసాగిస్తున్నారు. ప్రస్తు తం సీతాపహరణానికి సంబంధించిన పని పూర్తయిపోయిందని రంజిత్‌ చెప్పారు. జీవం ఉట్టి పడేలా శిల్పాలను ఆయన చెక్కుతున్నారు. ‘సీతను తొలిసారి రాముడు చూసినప్పుడు ఆయన ముఖంలో సిగ్గు కనిపించేలా శిల్పంచెక్కితేనే కదా బాగుంటుంది’ అని రంజిత్ అంటున్నారు. ఆయనకు లక్షా 25 వేల శిల్పాలు చెక్కిన అనుభవం ఉంది. అతను చెక్కిన శిల్పాలనే వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా పంచింది. 10 దేశాలకు కూడా అందించింది.

ఐదు గుమ్మటాలు

ఉత్తర భారతంలోని నగర శైలిలో ఆలయం కట్టనున్నారు. 161 అడుగుల ఎత్తులో మూడంతస్తుల్లో నిర్మించనున్నారు. నమూనా ప్రకారం మొత్తం 5 గుమ్మటాలుంటాయి. గర్భగుడి అష్ట భుజి ఆకృతిలో ఉంటుంది. గర్భగుడి పైన శిఖరం నిర్మించనున్నారు.

ఆర్కిటెక్ట్‌ సోంపుర

ఆలయ ఆర్కిటెక్ట్ ల కుటుంబానికి చెందిన చంద్రకాంత్‌ సోంపురను 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్‌ చేయమని అడిగారు. ఆయన తండ్రి ప్రభాశంకర్‌ సొంపుర సోమ్‌నాథ్ టెంపుల్‌ను డిజైన్‌ చేసి ఆలయ పునర్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అక్షర్‌థామ్‌ గుడికీ వీరి కుటుంబమే డిజైన్‌ అందించింది. నగర స్టైల్‌లో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుది రూపునిచ్చామని సోంపుర తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates