బోణీ ఎవరిదో?..ఇవాళ ఇండియా సౌతాఫ్రికా ఫస్ట్ వన్డే

పేరుకే వన్డే సిరీస్‌‌… ప్రయారిటీ మొత్తం టీ20 వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌ను ఎంచుకోవడంపైనే..! ఒక్క రోహిత్‌‌ తప్ప.. అందరూ వచ్చేశారు…! కాబట్టి సరైన బ్యాలెన్స్‌‌ను చూసుకోవడమే అసలు టార్గెట్‌‌..! అదే టైమ్‌‌లో న్యూజిలాండ్‌‌లో ఎదురైన పీడకలను మర్చిపోయి.. ఫ్రెష్‌‌గా ఆటను మొదలుపెట్టాలి..!
ఈ నేపథ్యంలో నేటి నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ జరుగనుంది..! హోమ్‌‌ కండీషన్స్‌‌లో టీమిండియా ఫేవరెట్‌‌గా దిగుతున్నా.. బలమైన ఆస్ట్రేలియాను వైట్‌‌వాష్‌‌ చేసిన సఫారీలు కూడా మంచి ఊపుమీదున్నారు..! విజయంతో ఈ సిరీస్‌‌లో బోణీ కొట్టాలని ఇరుజట్లు తహతహలాడుతున్నా.. వాన దేవుడు ఎంతమేరకు కరుణిస్తాడో చూడాలి..!!

ధర్మశాల:న్యూజిలాండ్‌‌ గడ్డపై వన్డే, టెస్ట్‌‌ సిరీస్‌‌ కోల్పోయి కాస్త డీలాపడ్డ టీమిండియా మళ్లీ రీచార్జ్‌‌ కావడానికి మంచి చాన్స్‌‌. గాయాలతో సుదీర్ఘకాలంగా ఆటకు దూరమైన ప్లేయర్లు మళ్లీ గాడిలో పడటానికి అద్భుతమైన అవకాశం. ఐపీఎల్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్న కుర్రాళ్లు తమ సత్తా నిరూపించుకోవడానికి మంచి సందర్భం. ఈ నేపథ్యంలో… గురువారం జరిగే తొలి వన్డేలో ఇండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సెమీస్‌‌ తర్వాత క్రికెట్‌‌కు దూరమైన ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా, భుజం గాయం నుంచి కోలుకున్న ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌, స్పోర్ట్స్‌‌ హెర్నియాతో ఇబ్బందిపడ్డ పేసర్‌‌ భువనేశ్వర్ ఈ మ్యాచ్‌‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. డీవై పాటిల్‌‌ టీ20 టోర్నీలో పాండ్యా రెండు భారీ సెంచరీలు కొట్టడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇది టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఇయర్‌‌ కావడంతో వన్డేలకు లీస్ట్‌‌ ప్రయారిటీ అని కెప్టెన్‌‌ కోహ్లీ, చీఫ్‌‌ కోచ్‌‌ రవి శాస్త్రి ఓపెన్‌‌గా చెప్పేశారు. అలాగని ఈ సిరీస్‌‌ను తేలికగా తీసుకోవడం లేదని కూడా సంకేతాలు ఇచ్చారు. అంటే టీమ్‌‌ సెలెక్షన్‌‌ ఫస్ట్‌‌ ప్రయారిటీ అని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది.

ఓపెనర్లు ఎవరు?

ఓపెనర్లుగా రోహిత్‌‌–ధవన్‌‌ కొన్నేళ్లుగా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. ఒకరు ఫెయిలైనా మరొకరు సత్తాచాటి మంచి స్కోర్లు అందించారు. గాయాల వల్ల ఇప్పుడు ఈ జోడీకి బ్రేక్‌‌ వచ్చింది. న్యూజిలాండ్‌‌ సిరీస్‌‌లోనూ వీరి లోటు స్పష్టంగా కనిపించింది. కాలిపిక్క గాయంతో రోహిత్‌‌ ఈ సిరీస్‌‌కు అందుబాటులో లేకపోవడంతో పృథ్వీతో కలిసి ధవన్‌‌ ఇన్నింగ్స్‌‌ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే కమ్‌‌బ్యాక్‌‌లో ధవన్‌‌ ఎలా ఆడతాడన్న సందేహాలు మొదలుకాగా, పృథ్వీ చోటు సుస్థిరం చేసుకుంటాడా లేదా చూడాలి. హార్దిక్‌‌ రాకతో టీమ్‌‌ బ్యాలెన్స్‌‌తో పాటు మిడిలార్డర్‌‌ బలం కూడా పెరిగింది. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లోనూ కొత్త ప్రత్యామ్నాయాలు చూసుకునే వెసులుబాటు లభించింది. ఈ మ్యాచ్‌‌లో నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీని అమలు చేసే చాన్స్‌‌ ఇండియాకు లభించింది. కివీస్‌‌ టూర్‌‌లో నిరాశపర్చిన విరాట్‌‌ రాణించడం చాలా అత్యవసరం. రాహుల్‌‌ ఏ ప్లేస్‌‌లోనైనా చెలరేగుతుండటం టీమ్‌‌కు అదనపు ప్రయోజనం. అయితే ఈసారి కూడా వికెట్‌‌ కీపర్‌‌ కమ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఉండనున్నాడు. శ్రేయస్‌‌ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. బౌలింగ్‌‌లో భువనేశ్వర్‌‌, బుమ్రా, సైనీ పేస్‌‌ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్నర్లుగా జడేజా, చహల్‌‌ తుది జట్టులో ఉండనున్నారు. భువీ, జడేజా వల్ల లోయర్‌‌ ఆర్డర్‌‌ బ్యాటింగ్‌‌ డెప్త్‌‌ కూడా పెరుగుతుంది.

డుప్లెసిస్‌‌ వచ్చేశాడు..

బలమైన ఆసీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌‌ చేసిన సఫారీ టీమ్‌‌ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే ఇక్కడి పరిస్థితులపై చాలా మంది ప్లేయర్లకు అవగాహన లేకపోవడం ప్రతికూలాంశం. మాజీ కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌ రాకతో బ్యాటింగ్‌‌ బలం బాగా పెరిగింది. ఓపెనర్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. డికాక్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించేది ఎవరనేది స్పష్టత లేదు. మలన్‌‌, స్మట్స్‌‌, వెరియానే రేసులో ఉన్నారు. కాలిపిక్క గాయం నుంచి బవుమా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌‌లో ఆడతాడో లేదో తెలియదు. అతని ఫిట్‌‌నెస్‌‌పై క్లారిటీ లేకపోవడంతోనే మలన్‌‌ను చివరి నిమిషంలో టీమ్‌‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మలన్‌‌, స్మట్స్‌‌, వెరియానే మంచి టచ్‌‌లో ఉన్నారు. అయితే ఇండియాపై డికాక్‌‌కు మంచి రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం. డుప్లెసిస్‌‌, డుసెన్‌‌, క్లాసెన్‌‌, మిల్లర్‌‌తో మిడిలార్డర్‌‌ కూడా బలంగానే కనిపిస్తోంది. బౌలింగ్‌‌లో ఎంగిడి సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు. నోర్జ్‌‌, పెహ్లుక్వాయో, కేశవ్‌‌ సహకారం అందిస్తే చాలు. హెండ్రిక్స్‌‌, జార్జ్‌‌ లిండేల్లో ఒకరు మాత్రమే ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఉండనున్నారు.

తుది జట్లు(అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), ధవన్‌‌, పృథ్వీ షా, శ్రేయస్‌‌ అయ్యర్‌‌, రాహుల్‌‌, హార్దిక్‌‌, జడేజా, భువనేశ్వర్‌‌, నవదీప్‌‌ సైనీ, చహల్‌‌, బుమ్రా.

సౌతాఫ్రికా: డికాక్‌‌ (కెప్టెన్‌‌), మలన్‌‌/ బవుమా, స్మట్స్‌‌, డుసెన్‌‌, డుప్లెసిస్‌‌, క్లాసెన్‌‌, మిల్లర్‌‌, పెహ్లుక్వాయో, కేశవ్‌‌ మహరాజ్‌‌, హెండ్రిక్స్‌‌/ లిండే, నోర్జ్‌‌, ఎంగిడి.

Latest Updates