నేడు జాతీయ చేనేత దినోత్సవం: లినెన్‌ @ దుబ్బాక ఇక్కత్

ఒకప్పుడు ఎంతో దర్జాగా బతికిన చేనేత కార్మికులు.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. పొట్ట కూటి కోసం పట్నాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ వృత్తిని వదిలి చిన్నచిన్న పనులు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అయితే..ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటి ట్రెండ్‌కి సరిపోయే బట్టలు నేస్తూ లాభాలు పొందుతున్నారు దుబ్బాక చేనేత కార్మికులు. పాత పద్ధతులకు కొత్త మెరుగులు దిద్ది అందరినీ ఆకట్టుకుంటున్నారు.

సిద్దిపేట, వెలుగు:
ఒకప్పుడు సంప్రదాయ కాటన్ క్లాత్ నేస్తూ.. గిట్టుబాటు ధర రాక, చేతినిండా పని దొరక్క ఇబ్బంది పడ్డ వాళ్లు ఇప్పుడు ద‌ర్జాగా బతుకుతున్నారు. కాటన్‌‌ను పక్కన పెట్టి కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేశారు దుబ్బాక చేనేత కార్మికులు. కస్టమర్ ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టు బట్టలు నేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కత్‌‌‌‌ డిజైన్లతో లినెన్ చీరలను, లినెన్ షర్టింగ్ ‌క్లాత్‌‌‌‌ని మగ్గాలపై నేస్తున్నారు. లినెన్‌‌పై ఇక్కత్ ‌నేయడానికి వాళ్లు ఐదేళ్లు రీసెర్చ్‌లు చేశారు. దుబ్బాక చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఐదేళ్ల‌ పాటు లినెన్ క్లాత్ తయారీ, మార్కెట్, డిమాండ్‌పై రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత నేయడం మొదలుపెట్టారు. ఇంత ప్లానింగ్‌తో చేశారు కాబట్టే మార్కెట్ ‌లో సక్సెస్ అయ్యారు. మూడేండ్లుగా చీరలు, షర్టింగ్ క్లాత్‌‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం దుబ్బాక సొసైటీలోని 20 మంది కార్మికులు ఈ పని చేస్తున్నారు. కలకత్తా, ముంబయి, సూరత్
లాంటి పెద్దపెద్ద పారిశ్రామిక వాడల్లో పవర్‌‌‌‌లూమ్స్ ‌‌పై తయారయ్యే లినెన్ క్లాత్‌‌కి ఈ క్లాత్ ఏ మాత్రం తీసిపోదు.

చేనేతకు అడ్డా దుబ్బాక

దుబ్బాక పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది చేనేత పరిశ్రమ. కాటన్ క్లాత్‌‌ తయారీకి దుబ్బాక పెట్టింది పేరు. ఇక్కడి చేనేత కార్మికులు కూడా చాలా ఏళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక‌ప్పుడు సంప్రదాయ కాటన్ టవల్స్‌‌, కర్చీఫ్స్‌‌, లుంగీలు, బెడ్‌షీట్స్ తయారీతో బిజీ బిజీగా ఉండేవాళ్లు. అలాంటిది కొన్నేళ్ల నుంచి పని దొరకడమే కష్టమైంది. చేనేతను నమ్ముకున్న లినెన్‌ @ దుబ్బాక ఇక్కత్ వాళ్ల‌కు పూట గడవని పరిస్థితి ఏర్పడింది.
1949లో ఏర్పడిన దుబ్బాక చేనేత సహకార సంఘంలో మొదట్లో 1500 మంది మెంబర్లు ఉండేవాళ్ళు. నష్టాల వల్ల అందరూ వేరే పనులు వెతుక్కున్నారు. ఇప్పుడు సంఘంలో 200 మంది మాత్రమే ఉన్నారు.

మూడేళ్లుగా..

ఒకప్పుడు కాటన్ క్లాత్‌‌కి కేరాఫ్‌‌గా ఉన్న దుబ్బాక మూడేళ్ల‌లో ఇక్కత్‌‌‌‌- లినెన్ చీరల తయారీకి కేంద్రంగా మారింది. 2017 నుంచి
లినెన్ తయారీని మొదలుపెట్టారు. ఇప్పుడు నెలకు 15 ఇక్కత్‌‌‌‌- లినెన్ చీరలు, 150 మీటర్ల షర్టి గ్ ‌క్లాత్‌‌‌‌ను తయారుచేస్తున్నారు. వాటిని ఇతర రాష్ట్రాలకు ఎక్స్‌‌పోర్ట్ చేస్తున్నారు. లినెన్ చీర ధర మార్కెట్‌‌లో ఎనిమిది వేల నుంచి మొ దలవుతుంది. కానీ.. దుబ్బాకలో నేసిన చీరలను 5,500 రూపాయలకే అమ్ముతున్నారు. షర్టింగ్ ‌క్లాత్‌‌ని మీటరుకు 800 నుంచి 1500 రూపాయల వరకు అమ్ముతున్నారు. తక్కువ లాభాలకు అమ్ముతూ మార్కెటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లినెన్ షర్టింగ్‌లో 44లీ, 60లీ, 80లీ, 100లీ రకాలను నేస్తున్నారు. ప్లెయిన్, లైనింగ్‌ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. లినెన్ క్లాత్ నేసే కార్మికులకు కూలీ కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది. ఒక్కో కార్మికుడు నెలకు 15వేల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నాడు.

ముడిసరుకు..

క్లాత్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు పెట్టుబడులకు ఇబ్బంది అవుతోంది. లినెన్ క్లాత్ తయారీ కోసం ఫ్లేక్స్ ట్రీ నుంచి తయారయ్యే యార్న్‌‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అందువల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్‌‌తో పాటు యూరప్‌ కంట్రీల నుంచి ముడి యార్న్‌‌ను దిగుమతి చేసుకుంటారు. మరమగ్గాలతో తయారైన ఇక్కత్- లినెన్ చీరల కంటే మగ్గాలపై తయారైనవి నాణ్యంగా ఉండటం వల్ల మార్కెట్‌‌లో డిమాండ్‌ ఉంది. ఇదిలావుంటే దుబ్బాక లినెన్ ప్రొడక్ట్స్ పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల స్థానికంగా అమ్మకాలు పెద్దగా లేవు. దీనికి తోడు ఇక్కత్- లెనిన్ చీరల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల స్థానికులు ఎవరూ కొనడం లేదు.

వేరే రాష్ట్రాల డిజైనర్లకు..

దుబ్బాక చేనేత కార్మికులు తయారు చేసిన ఇక్కత్‌‌ లినెన్‌‌‌‌ చీరలను ఇతర రాష్ట్రాలకు చెందిన డిజైనర్లు కొంటున్నారు. కేరళ, తమిళనాడు,ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలతో పాటు విదేశాలకు చెందిన కొందరు డిజైనర్లు ఎక్కువగా కొంటున్నారు. ఈ డిజైనర్లు ఇవే చీరలను ఆన్‌‌లైన్‌‌లో అమ్ముకుంటున్నారు. దుబ్బాక చేనేత కార్మికులకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. వీళ్ళు తయారు చేసిన క్లాత్‌‌ని ముంబైలో ప్రాసెసింగ్ చేయించడం కూడా ఒక సమస్యగా మారింది.

వీవర్స్ లినెన్ బ్రాండ్‌కు ప్రయత్నాలు

దుబ్బాక చేనేత కార్మికులు.. లినెన్ క్లాత్‌ ని ‘వీవర్స్ లెనిన్ బ్రాండ్‌’ పేరిట అమ్మేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ.. కరోనా వల్ల ముడిసరుకు లేక రెండు నెలలుగా లినెన్ ప్రొడ్యూస్ చేయడంలేదు. కొన్ని రోజుల్లో ఓన్ బ్రాండ్‌తో మార్కెట్‌‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Latest Updates