నేడు వరల్డ్ తలసేమియా డే : ర‌క్తం ఆగ‌నంటోంది

పాలుతాగే ప్రాయంలో రక్తం ఎక్కించుకుంటూ..
చాక్లెట్లు తినాల్సిన నోటితో టాబ్లెట్లు మింగుతూ..
ఆడుకునే వయసులో హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ
పుట్టుకతోనే పుట్టెడు నరకం
అనుభవిస్తున్నారు ఆ చిన్నారులు.
జన్యులోపాలు, వంశపారంపర్యంగా సంక్రమించే
తలసేమియా, సికిల్సెల్ వ్యాధి
చిన్నారులను పీల్చిపిప్పి చేస్తోంది
పెళ్లికి ముందు వైద్యపరీక్షలతోనే నివారణ

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర‌వ్యా ప్తంగా సుమారు 6 వేల మంది ఈ వ్యాధి బారినపడగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వెయ్యి మందికిపైగా బాధితులున్నారు. తలసేమియాతో పుట్టిన పిల్లలకు నెలల వయసులోనే రక్తహీనత ఏర్పడుతుంది . దీంతో ప్రతి నెల లేదా పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. క్రమం తప్పకుండా రక్తం ఎక్కిస్తూ, అవసరమైన మందులు వాడినప్పటికీ జీవితకాలం 25 నుంచి 30 ఏళ్ల‌కు మించదు. తరచుగా రక్తం ఎక్కించడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. ఇరవైసార్లు రక్తం ఎక్కించిన వారికి శరీరంలో ఐరన్ శాతం పెరగడం వల్ల కడుపు ఉబ్బిపోయి అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల ఐరన్ చిల్లేషన్ మందులు వాడాల్సి ఉంటుంది. కాల్షియం డిపాజిట్ పెరిగితే ఎముకలు పెలుసుగా మారి విరిగిపోతాయి. మూత్రపిండాలు, గుండె ఇలా అన్నిఅవయవాలపై దీని ప్రభావం ఉంటుంది.

అందువల్ల వ్యాధి గ్రస్తులకు ప్రతి ఆరు నెలలకోసారి పూర్తిస్థాయిలో వైద్యపరీక్షలు చేయించి, మందులు వాడాల్సి వస్తుంది. దీనికి నెలకు రూ.10వేల వరకు ఖర్చవుతుంది. ఈ వ్యాధిని నయం చేయాలంటే బోన్మ్యారో సర్జ‌రీనే ఏకైక మార్గం. 12 సంవత్సరాల లోపు ఈ ఆపరేషన్ చేయిస్తేనే జీవితకాలం పెరుగుతుంది. సర్జ‌రీకి సుమారు రూ . 50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్కువ శాతం మంది పేదలే కావడంతో ఆపరేషన్ గురించి ఆలోచన కూడా చేయలేరు. అవగాహనతోనే నివారణ ప్రతి వంద మందిలో ఐదుగురు వ్యాధి క్యారి యర్లుగా ఉంటారని వైద్యనిపుణుల అధ్యయనంతో తేలింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టబోయే సంతానంలో 50 శాతం పిల్లలు నార్మల్ గా జన్మిస్తారు. 25శాతం పిల్లలు తిరిగి క్యారియర్లుగా జన్మిస్తే.. మరో 25 శాతం పిల్లలు తలసేమియా, సికిల్సెల్ వ్యాధితో పుడుతున్నారు. పెళ్లికి ముందు హెచ్బీఏ2 అనే వైద్య పరీక్ష చేయించుకుంటే వారు వాహకాలా, కాదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఇద్దరు వాహకాలుగా తేలితే పెళ్లి చేళ్లి చేసుకోరాదని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.

ఉచిత వైద్యం…

తలసేమియా, సికిల్సెల్ వ్యాధి గ్రస్తులకు మంచిర్యాల సర్కారు దవాఖానాలోని రెడ్ క్రాస్ బ్ల‌డ్ బ్యాంక్లో ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. గతేడాది ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించి వారికి కావాల్సిన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారు. కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో మూడేళ్ల నుంచి ఉచిత సేవలు అందజేస్తున్నారు. అలాగే హైదరాబాద్ విద్యానగర్లోని రెడ్ క్రాస్ హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నె.1లోని అరోహి బ్లడ్ బ్యాంక్ , రాజేంద్రనగర్లోని తలసేమియా, సికిల్ సెల్ సొసైటీలో ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు.

Latest Updates