- యూఎస్ కొత్త ప్రెసిడెంట్ బైడెన్ ప్రమాణం ఇయ్యాల్నే
- క్యాపిటల్ బిల్డింగ్ ముందు బాధ్యతలు స్వీకరించనున్న జో
- తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమల హ్యారిస్ కూడా..
- వాషింగ్టన్ అంతటా వేల మందితో టైట్ సెక్యూరిటీ
- ‘ఇన్సైడ్ థ్రెట్’ భయంతో సోల్జర్లపై ఎఫ్‌బీఐ నిఘా
- వెయ్యి మంది గెస్టులకే అనుమతి
- 25 వేల మంది నేషనల్ గార్డు సోల్జర్లతో బందోబస్
అమెరికా 46వ ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ కూడా ప్రమాణం చేస్తారు. కరోనాతోపాటు రెండు వారాల క్రితం క్యాపిటల్ బిల్డింగ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనల కారణంగా ఈ కార్యక్రమానికి కేవలం వెయ్యి మందినే అనుమతించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ హాజరు కావడం లేదు. ప్రోగ్రామ్ కన్నా ముందే వాషింగ్టన్ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు.
వాషింగ్టన్: అమెరికా 46వ ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. క్యాపిటల్ బిల్డింగ్ ఎదుట జరిగే కార్యక్రమంలో బైడెన్‌తోపాటు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్షలాది మంది హాజరవుతారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం, ఇటీవల క్యాపిటల్ బిల్డింగ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనలతో చాలా తక్కువ మందిని అనుమతించనున్నారు. కాంగ్రెస్ సభ్యులు, ఇతర అతిథులతో కలిపి 1,000 మంది మాత్రమే హాజరవుతారు. ఈమేరకు ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ప్రోగ్రామ్ జరగడానికి ముందే ఫ్లోరిడాకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ప్రమాణ స్వీకారం ఇలా..
వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ వెస్ట్ ఫ్రంట్ వద్ద బుధవారం ఉదయం11.30(మన టైం ప్రకారం బుధవారం రాత్రి10) గంటలకు పాప్ స్టార్ లేడీ గాగా అమెరికా జాతీయ గీతం పాడటంతో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జెన్నిఫర్ లోపెజ్ మ్యూజికల్ ఫెర్ఫామెన్స్ ఉంటుంది. తర్వాత కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను చర్చి పెద్దలు ట్రెడిషనల్‌గా ఆహ్వానిస్తూ, ఆశీర్వచనాలు ఇస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు కొంచెం ముందు వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ చేత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సొటొమేయర్ ప్రమాణం చేయిస్తారు.
సరిగ్గా 12 గంటలకు ప్రెసిడెంట్‌గా బైడెన్‌తో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ బైడెన్ ఇనాగురల్ స్పీచ్ ఇస్తారు.
తర్వాత క్యాపిటల్ బిల్డింగ్ లోని ఈస్ట్ ఫ్రంట్ వద్ద సైనిక బలగాలతో ప్రెసిడెంట్ బైడెన్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
బైడెన్, హారిస్, మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బుష్, క్లింటన్, వారి భార్యలతో కలిసి వర్జీనియాలోని ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీ (ఆర్మీ అమరవీరుల శ్మశానవాటిక)కు వెళ్లి నివాళులు అర్పిస్తారు.
ఆ తర్వాత మిలటరీ ఎస్కార్ట్‌తో సహా బైడెన్ ఫిఫ్టీంత్ స్ట్రీట్ మీదుగా వైట్‌హౌస్‌కు చేరుకుంటారు.
తొలిరోజు సంతకాలు వీటిపైనే
పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో అమెరికా మళ్లీ చేరేందుకు సంబంధించిన ఫైల్ పై బైడెన్ సైన్ చేస్తారు.
పలు ముస్లిం దేశాల వారికి అమెరికాలోకి ఎంట్రీని నిరాకరిస్తూ ట్రంప్ బ్యాన్ విధించగా, బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సంతకం చేయనున్నారు.