నేడు యూఎస్‌‌కు టీమిండియా

ముంబై:  ‘ప్రస్తుతానికైతే టీమిండియాలో పరిస్థితి అంత బాగాలేదు’ అనే అతిపెద్ద సమస్యతో విరాట్‌‌సేన కరీబియన్‌‌ టూర్‌‌కు రెడీ అయ్యింది. అక్కడికి వెళ్లాకా పరిస్థితి ఏంటో తెలియకపోయినా.. ఇప్పుడు మాత్రం కొద్దిగా గందరగోళంగానే ఉంది. విదేశీ టూర్లకు బయలుదేరే ముందు టీమ్‌‌ కెప్టెన్‌‌ మీడియాతో మాట్లాడటం ఆనవాయితీ. కానీ రోహిత్‌‌తో ఉన్న విభేదాల కారణంగా కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొనకుండానే యూఎస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కుతాడని కథనాలు రావడం హాట్‌‌ టాపిక్‌‌గా మారింది. ‘సోమవారం ఉదయం ఓ ప్రైవేట్‌‌ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొంటాడు. అటు నుంచి నేరుగా టీమ్‌‌తో పాటు విమానం ఎక్కేస్తాడు. కాబట్టి ప్రెస్‌‌ మీట్‌‌ ఉండదు, విరాట్‌‌ మాట్లాడడు’ అని కొందరు బీసీసీఐ అధికారులు లీక్‌‌లు ఇవ్వడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని అనుకుంటున్న విమర్శలకు ఇది బలం చేకూర్చింది. ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సీఓఏ చీఫ్​ వినోద్​రాయ్​ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే.

రోహిత్‌‌తో ఉన్న విభేదాల విషయంలో మీడియా నుంచి సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఇలా చేశారని దుమారం రేగింది. ఐతే పరిస్థితి చేయి దాటుతుందని భావించిన బీసీసీఐ పెద్దలు సాయంత్రానికి ప్లేట్‌‌ ఫిరాయించారు. అప్పటివరకు జరిగిన నష్టానికి నివారణ చర్యలు చేపట్టారు.  కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతాడని క్లారిటీ ఇచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇప్పుడు రోహిత్‌‌ విషయంలో విరాట్‌‌ ఎలా స్పందిస్తాడన్నదే ఆసక్తికరంగా మారింది. విభేదాలను ఒప్పుకుంటాడా? లేక మాట దాటేస్తాడా? అలాగే ధోనీ ఆర్మీ ట్రెయినింగ్‌‌పై ఏమైనా స్పష్టత ఇస్తాడా? చూడాలి.  సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరే టీమిండియా.. అమెరికాకు వెళ్తుంది. విండీస్‌‌ సిరీస్‌‌కు ఎంపికైన ఇండియా–ఎ ఆటగాళ్లు యూఎస్‌‌లో టీమ్‌‌తో కలవనున్నారు.

Latest Updates